న్యూఢిల్లీ: ఇండియా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య జరగనున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్‌టీఏ) చారిత్రక మైలురాయిగా నిలిచిపోతుందని భారత్‌లోని నార్వే అంబాసిడర్ మే ఎలిన్ స్టెనర్ అన్నారు. ఈ డీల్ వల్ల భారత్‌తో ఈయూ దేశాలు, నార్వే వాణిజ్య సంబంధాలు బలోపేతమవుతాయని తెలిపారు. శుక్రవారం ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో స్టెనర్ మాట్లాడారు.
‘‘ఈయూలో నార్వే భాగం కానప్పటికీ, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్‌టీఏ)లో మాత్రం ఉంది. అలాగే మేం ఇప్పటికే భారత్‌తో ట్రేడ్ అండ్ ఎకనమిక్ పార్టనర్‌షిప్ అగ్రిమెంట్ (టీఈపీఏ) చేసుకున్నం. ఇది పోయినేడాది అక్టోబర్ 1 నుంచే అమల్లోకి వచ్చింది. భారత్, నార్వే సంబంధాల్లో అదొక మైలురాయి. అలాగే ఈయూ, ఇండియా మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్.. ఆ రెండింటి మధ్య బంధాల బలోపేతంలో కీలక అడుగు అవుతుంది. నార్వేకుఈయూ అతిపెద్ద ట్రేడ్ పార్టనర్. కాబట్టి ఈయూ, ఇండియా మధ్య జరిగే డీల్‌తో నార్వేకూ లాభం ఉంటుంది” అని ఆమె పేర్కొన్నారు.
‘‘ఫ్రీ ట్రేడ్ డీల్‌కు మేం అనుకూలంగా ఉన్నం. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యానికి ఉన్న అడ్డంకులను తొలగించాలి. కానీ వాటిని మరింత పెంచకూడదు” అని అమెరికా టారిఫ్‌లను ఉద్దేశించి అభిప్రాయపడ్డారు.
డెన్మార్క్‌దే గ్రీన్‌లాండ్..
నోబెల్ విజేతల ఎంపికలో నార్వే ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం ఉండదని స్టెనర్ స్పష్టం చేశారు. నోబెల్ తనకు రాకుండా నార్వే సర్కార్ అడ్డుకున్నదని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్చేసిన ఆరోపణలపై ఆమె స్పందించారు. ‘‘నార్వేజియన్ నోబెల్ కమిటీ స్వతంత్రంగా పనిచేస్తుంది. నార్వే సర్కార్ గానీ, ఇతర అథారిటీలతో గానీ సంబంధం ఉండదు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని నోబెల్ విజేతలను ఎంపిక చేస్తుంది” అని తెలిపారు. గ్రీన్‌లాండ్ ఇష్యూపై స్పందిస్తూ.. ‘‘గ్రీన్‌లాండ్ విషయంలో మేం డెన్మార్క్‌కు సపోర్టు చేస్తం. అది ఆ దేశంలోని భాగమే. నాటో వ్యవస్థాపక సభ్య దేశంగా.. ఆర్కిటిక్ ప్రాంతంలో రక్షణ విషయంలో సభ్య దేశాలతో కలిసి పని చేస్తం” అని చెప్పారు.
