
ముంబై: మనదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) అమ్మకాలు జూన్ 2025లో గత ఏడాదితో పోలిస్తే ఈసారి జూన్లో 28.60 శాతం పెరిగి 1,80,238 యూనిట్లకు చేరుకున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) మంగళవారం (జులై 08) ఒక ప్రకటనలో తెలిపింది. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్స్ విక్రయాల్లో భారీ పెరుగుదల ఈ వృద్ధికి ప్రధాన కారణమని వెల్లడించింది.
గత నెలలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్స్ విక్రయాలు జూన్ 2024లో 7,323 యూనిట్లతో పోలిస్తే 13,178 యూనిట్లకు చేరుకున్నాయి. ఏడాది లెక్కన 79.95 శాతం పెరిగాయి. మొత్తం ఈవీ మార్కెట్‌లో ఈ–-ప్యాసింజర్ వెహికల్స్ వాటా జూన్ 2024లో 2.5 శాతం నుంచి జూన్ 2025లో 4.4 శాతానికి పెరిగింది. ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ విక్రయాలు 15.79 శాతం పెరిగి 60,559 యూనిట్లకు, ఎలక్ట్రిక్ టూ-వీలర్ విక్రయాలు 31.69 శాతం పెరిగి 1,05,355 యూనిట్లకు చేరుకున్నాయి. ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలు 122.5 శాతం వృద్ధితో 1,146 యూనిట్లకు చేరుకున్నాయి.