కేరళ నర్స్ నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దు: యెమెన్ నుంచి కేఏ పాల్ వీడియో రిలీజ్

కేరళ నర్స్ నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దు: యెమెన్ నుంచి కేఏ పాల్ వీడియో రిలీజ్

సనా: యెమెన్ పౌరుడి హత్య కేసులో మరణ శిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్స్ నిమిషా ప్రియ ఉరిశిక్షపై సస్పెన్స్ కొనసాగుతోంది. బ్లడ్ మనీకి మృతుడి కుటుంబం ససేమిరా అనడంతో యెమెన్ ప్రభుత్వం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు నిమిషా ప్రియను ఉరిశిక్ష ఉంచి రక్షించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నిమిషా ప్రియ మరణశిక్షపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. 

యెమెన్ పౌరుడి హత్య కేసులో నిమిషా ప్రియకు విధించిన మరణ శిక్ష రద్దు అయిందని సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు యెమెన్ నుంచి మంగళవారం (జూలై 22) కేఏ పాల్ ఓ వీడియో రిలీజ్ చేశారు. యెమెన్, భారత నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించాయని.. ఫలితంగా నిమిషా ప్రియ ఉరి శిక్ష రద్దు చేయబడిందన్నారు పాల్. మంచి మనసుతో ప్రియ విడుదలకు అంగీకరించిన యెమెన్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

ప్రియ మరణ శిక్ష రద్దు కోసం గత పది రోజులుగా రాత్రింబవళ్లు కృషి చేస్తూ 24 గంటలూ పని చేశామన్నారు. మరణ శిక్ష రద్దు కావడానికి సహయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు పాల్. ఆమెను విడుదల చేసి భారతదేశానికి తీసుకువెళతారని తెలిపారు. నిమిషాను ఇండియాకు తిరిగి తీసుకెళ్లడానికి సిద్ధమైన భారత ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు పాల్. ఆమెను సనా జైలు నుంచి స్వదేశానికి తరలించడానికి భారత ప్రభుత్వంతో కలిసి లాజిస్టిక్స్ ఏర్పాట్లు చేసుకోవచ్చని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Also Read : బీహార్ ఓటర్ల జాబితా సవరణపై విపక్షాల నిరసన

కేసు ఏంటంటే..?

కేరళలోని పాలక్కడ్‎కు చెందిన నిమిషా ప్రియా 2008లో యెమన్ వెళ్లి అక్కడ నర్సుగా పని చేసింది. అనంతరం 2015లో సొంతంగా క్లినిక్‌ పెట్టుకోవాలని ఆలోచించింది. అయితే.. యెమన్ చట్ట ప్రకారం అక్కడ సొంతంగా క్లినిక్ ఓపెన్ చేయాలంటే యెమన్ జాతీయుడి భాగస్వామ్యం అవసరం. దీంతో యెమెన్ జాతీయుడైన తలాల్ అబ్దో మహదీతో కలిసి ప్రియా క్లినిక్ ప్రారంభించింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. 

2016లో మహదీపై ప్రియా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. జైలు నుంచి బయటకు వచ్చిన మహదీ ప్రియాపై వేధింపులకు దిగాడు. అంతేకాకుండా ప్రియా పాస్ట్ పోర్టు తిరిగి ఇవ్వకుండా బెదిరించాడు. దీంతో మహదీ నుంచి ఎలాగైనా పాస్ట్ పోర్టు తిరిగి తీసుకోవాలని భావించిన ప్రియా మరో వ్యక్తికితో కలిసి మహదీకి మత్తు మందు ఇచ్చింది. మత్తు మందు ఓవర్ డోస్ కావడంతో మహదీ మరణించాడు. దీంతో ప్రియా, ఆమెకు సహయం చేసిన మరో వ్యక్తిపై కేసు నమోదు అయ్యింది. 

2018లో ఈ కేసులో ప్రియాను దోషిగా తేల్చి 2020లో మరణ శిక్ష విధించింది యెమన్ సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్. ఈ క్రమంలో ప్రియా యెమన్ విడిచి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు. యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్-అలిమి కూడా ప్రియాకు ఉరి శిక్ష విధించడాన్ని ఆమోదించాడు. ఈ క్రమంలోనే 2025, జూలై 16న నిమిషను ఉరి తీసేందుకు యెమెన్ ప్రభుత్వం సిద్ధమైంది. కానీ భారత ప్రభుత్వ అధికారుల జోక్యంతో చివరి నిమిషంలో ఉరి వాయిదా పడింది.