హార్వర్డ్ వెళ్లొచ్చినా.. రేవంత్ బుద్ధి మారలే! : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హార్వర్డ్ వెళ్లొచ్చినా.. రేవంత్ బుద్ధి మారలే! : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • సీఎం సీటుకు విలువ ఇస్తలేరు.. అవే గాలి మాటలు అవే అబద్ధాలు:  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  •     కేసీఆర్‌‌‌‌పై చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నదెవరు?
  •     రాహుల్ గాంధీనా.. కాంగ్రెస్ అధిష్టానమా? సీఎం సమాధానం చెప్పాలి
  •     మజ్లిస్ చేతిలో రేవంత్ కీలుబొమ్మ.. స్టీరింగ్ ఓవైసీ చేతిలోనే ఉందని కామెంట్

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ వెళ్లొచ్చినా ఆయన బుద్ధి మాత్రం మారలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అడ్డగోలు ఆరోపణలు.. రోజుకో కొత్త అబద్ధం.. కొత్త వివాదం... ఇదీ ఆయన పాలన అంటూ ఫైర్​అయ్యారు. సీఎం సీటుకు ఒక గౌరవం, విలువ ఉంటుందని.. కానీ, ఆ విలువ ఏమాత్రం పాటించకుండా సంస్కారహీనమైన భాషతో రేవంత్ దిగజారి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటినా హామీల అమలు చేతకాక, రోజుకో అబద్ధం, పూటకో వివాదంతో రేవంత్ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. 

జైలుకు పంపిస్తానన్నవ్.. ఇప్పుడు కాపాడుతున్నవ్ 

‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్‌‌‌‌ను జైలుకు పంపిస్తానని బీరాలు పలికిన రేవంత్.. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌‌‌‌పై ఈగ, దోమ కూడా వాలకుండా ఎందుకు కాపాడుతున్నారు? అసలు మీ చర్యలను అడ్డుకుంటున్నదెవరు? రాహుల్ గాంధీనా.. కాంగ్రెస్ అధిష్టానమా?’’ అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకునే దమ్ము రేవంత్ రెడ్డికి లేదని, కాంగ్రెస్- బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం నడుస్తోందని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే తక్షణం చర్యలు తీసుకోవాలని, లేదంటే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఓటుకు నోటు కేసు మాఫీ కోసమేనా?

రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్​లో జరిగిన అగ్నిప్రమాదంపై రేవంత్ సర్కార్ తీరుపై కిషన్​రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. ‘‘ఓటుకు నోటు కేసు, గత ప్రభుత్వ ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించిన కీలకమైన డిజిటల్, టెక్నికల్ ఎవిడెన్స్ ఆ ల్యాబ్‌‌‌‌లోనే ఉంది. దీనిపై ఇప్పటికీ ప్రభుత్వం నోరు మెదపకపోవడం దారుణం’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే దీనిపై ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

డ్రైవర్ మారినా.. ఓనర్ మారలే

గతంలో కేసీఆర్ లాగే.. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఎంఐఎం పార్టీకి బానిసగా మారారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ‘‘అప్పట్లో కేసీఆర్ ఇంటికి అసదుద్దీన్ ఒవైసీ బుల్లెట్ మీద వెళ్తే.. బండి నడిపింది ఒవైసీ, వెనక కూర్చున్నది కేసీఆర్. ఇప్పుడు సీట్లు మారాయి గానీ.. స్టీరింగ్ మాత్రం ఒవైసీ చేతిలోనే ఉంది. ఇప్పుడు వెనక కూర్చున్నది రేవంత్ రెడ్డి. అక్బరుద్దీన్ చెప్పినట్లు.. సీఎం ఎవరైనా వాళ్ల కాళ్ల దగ్గర ఉండాల్సిందే అన్నట్లుగా రేవంత్ పాలన సాగిస్తున్నారు’’ అని విమర్శించారు.

మతపరమైన రిజర్వేషన్లతో మరో డ్రామా..

మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి కోసమే రేవంత్ రెడ్డి మతపరమైన రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారని కిషన్ రెడ్డి ఆరోపించారు. హైకోర్టు కొట్టివేసినా, రాజ్యాంగ విరుద్ధమని తెలిసినా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం ఓటు బ్యాంకు రాజకీయమేనని చెప్పారు.  సీఎం స్థాయిలో ఉండి ‘కాంగ్రెస్ అంటే ముస్లింలు' అంటూ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. హిందూ దేవుళ్లను అవమానించేలా, విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడే రేవంత్ రెడ్డి.. ముందు తన నోటిని అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు.

ధనిక రాష్ట్రాన్ని  అప్పుల పాలు చేసిన్రు: కిషన్ రెడ్డి

  •     ఇంద్రేశం మున్సిపల్‌‌‌‌ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి 


అమీన్‌‌‌‌పూర్, వెలుగు: కేసీఆర్​ కుటుంబ పాలన సాగిస్తే.. కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వంలో  సోనియాగాంధీ కుటుంబ పాలన సాగుతున్నదని కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ పదేండ్ల పాలనలో కేసీఆర్​ పది లక్షల కోట్లు అప్పు చేస్తే.. రెండున్నరేండ్లలోనే సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి రెండున్నర లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు.  సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాలిటీలో శనివారం సాయంత్రం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కిషన్‌‌‌‌రెడ్డి మాట్లాడారు. 

ఆడబిడ్డ పెండ్లికి రూ.లక్షతోపాటు తులం బంగారం, రూ .4 వేల పెన్షన్, మహిళలకు రూ.2500 అంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటైన నెరవేర్చారా? అని కిషన్‌‌‌‌రెడ్డి ప్రశ్నించారు.  పటాన్​చెరు ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నరు? పటాన్​చెరు ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని గూడెం మహిపాల్‌‌‌‌రెడ్డినుద్దేశించి కిషన్‌‌‌‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్‌‌‌‌లో ఉన్నడా? బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​లో ఉన్నడా?’’ అని ప్రశ్నించారు. అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నడో ఆయనకైనా తెలుసా? అని ఎద్దేవా చేశారు.  ఇంద్రేశం మున్సిపాలిటీలో కనీస సౌకర్యాలు లేవని, వీధిలైట్లు పెట్టలేని స్థితిలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఉందన్నారు.