జ్యుడీషియల్ ఎంప్లాయీస్కీ జీతాల తిప్పలు

జ్యుడీషియల్ ఎంప్లాయీస్కీ జీతాల తిప్పలు
  • హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో విడతలవారీగా పేమెంట్స్​
  • జులైలో 18వ తేదీ దాకా జరగని చెల్లింపులు
  • ఈఎంఐలు పెనాల్టీతో చెల్లిస్తున్నమని ఉద్యోగులు ఫైర్​

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులకే కాదు..   రాష్ట్రంలోని జడ్జీలు, జ్యుడీషియల్ ఆఫీసర్లకూ రాష్ట్ర సర్కార్ టైంకు జీతాలు వేయడంలేదు. ఒకటో తేదీన పడాల్సిన శాలరీలు చాలా ఆలస్యంగా క్రెడిట్​ అవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నుంచీ పరిస్థితి ఇలాగే ఉందని ఆఫీసర్లు అంటున్నారు.  ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నట్లే జిల్లాలవారీగా.. విడతల్లో ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో జ్యుడీషియల్ ఆఫీసర్లకు, స్టాఫ్ కు జీతాలు జమచేస్తున్నారు. జులైలో 18వ తేదీ వచ్చే వరకు వేతనాలు పూర్తి స్థాయిలో చెల్లించలేదు. ఒక్క హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా  అన్ని జిల్లాల్లో శాలరీలు ఆలస్యంగా చెల్లిస్తున్నారు. జడ్జీలకు ఒక తేదీన, ఆఫీసర్లకు మరొక తేదీన, ఇతర స్టాఫ్​కు ఇంకో  తేదీన ఇలా ఇష్టారీతిన జీతం వేస్తున్నారు.  ఠంచనుగా శాలరీలు ఎప్పుడు వస్తాయోనని ఎదురుచూసేలా చేశారని జ్యుడీషియల్ సిబ్బంది మండిపడుతున్నారు. ప్రతి నెలా జీతాలు లేట్ అవుతుండడంతో ఈఎంఐలు, ఇతర చెల్లింపులు పెనాల్టీతో చేస్తున్నామని జ్యుడీషియల్ సిబ్బంది, ఆఫీసర్లు వాపోతున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగమాగం..

రాష్ట్రంలో హైకోర్టు మొదలు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులు, సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి కోర్టులు, జూనియర్ డివిజన్ సివిల్ జడ్జి కోర్టులు, ఇతర చిన్న కోర్టుల్లో పనిచేస్తున్న జడ్జిలు, జ్యుడీషియల్ ఆఫీసర్లు, సిబ్బందికి రాష్ట్ర సర్కార్ నిధి నుంచే జీతాలు చెల్లిస్తారు. ఇంతకుముందు అందరికీ ఠంచనుగా ఒకటో తేదీనే శాలరీలు జమయ్యేవి. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఎవరికి ఎప్పుడు జీతాలు జమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.జిల్లాల్లోని జడ్జీలు, ఆఫీసర్లకు జమైన జీతాల తేదీలను చూస్తే మెదక్ జిల్లాలో జూన్ లో 14న, జులైలో 18న జీతాలు వేశారు. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, ఆసిఫాబాద్ కోర్టు ఉద్యోగులకు జులై 11న, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు 14న, ఖమ్మం వారికి 8న, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, ఖమ్మం జిల్లాలకు 7న, సూర్యాపేటకు 10న, మహబూబ్ నగర్, జోగుళాంబ గద్వాలకి 14న శాలరీలు జమయ్యాయి.