తెలుగు పాటలతో అదరగొడుతున్న నైజీరియన్

తెలుగు పాటలతో అదరగొడుతున్న నైజీరియన్
మార్వివెస్ట్​.  నైజీరియన్. తెలుగు తెలియకుంటేనేం కష్టపడి తెలుగు వాళ్లు ఇష్టంగా వినేలా ఆల్బమ్స్​ చేస్తున్నాడు. ‘నాంపల్లి స్టేషన్​ కాడి రాజాలింగో’  అంటూ నిన్నా, మొన్నా ఫేస్​బుక్​లో మోతమోగించిండు. ఈ ఒక్కపాటేమిటి? మా భూమిలో గద్దర్​పాడిన ‘బండెన బండి కట్టి’ పాట నుంచి గద్దరంటే నాకు ఎంతో ఇష్టం అన్న పవన్​ పాట ‘కాటమరాయుడా కదిరి నర్సింహుడా’ వరకు భలేగా పాడిండు. పాట బాగానే పాడిండు కానీ భావానికి తగ్గ హావాలు లేవని కొంతమంది నొచ్చుకున్నా.. ‘ఈ పాటకు భావమేమి తిరుమలేశా’ అని ఆయన ఎవరినీ అడుగలే. అందుకే ఆకలి పాటల్ని కూడా హుషారుగా పాడినందుకు ఆయన్ని నిందించాల్సింది లేదు. తెలుసుకుని పాడుంటే కొంచెం బాగుండేది. ఆయన భావానికి కాకుండా బీట్ కి తగ్గట్లుగా బాడీ లాంగ్వేజ్​ ఉంది. ఏదైతేనేం మన తెలుగు పాటల్ని మరింత పాపులర్​ చేస్తూ ఇక్కడి వాళ్లనే  కాదు దేశ విదేశాల్లో తెలుగు వాళ్లని ఆకట్టుకుంటోంది. విదేశాల్లో పుట్టి పెరిగిన తెలుగు పిల్లల కంటే భాష బాగానే ఉందని కొందరు మార్వివెస్ట్ ని మెచ్చుకుంటున్నారు. ఇంగ్లీష్​ చదువులతో తెలుగు భాషను బతికిస్తామనే వాళ్లు యానిమేషన్​, మల్టీమీడియాతో ఇప్పటి పిల్లల కోసం చేస్తున్న ప్రయత్నాల కంటే మార్వివెస్ట్​ యూ ట్యూబ్​ ఛానల్​ జాల్లీ వోకల్​ (Jolly Vocal) మస్త్​గా సక్సెస్​ అయింది. పాత కొత్త పాటలతో మార్వివెస్ట్​ పాటలు ఇరగదీస్తుండు. స్టూడియోలో రీమిక్స్​ బ్యాక్ గ్రౌండ్​ని ఆస్వాదిస్తూ ఆనందంగా పాడే మార్వివెస్ట్​ని చూస్తే ఎవరికైనా హుషారొస్తుంది. ‘ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియల్లో’లాంటి విప్లవగీతం, మాయదారి మైసమ్మో మైసమ్మ’ లాంటి ఫోక్స్ దాకా ఉన్నాయి. ‘నేను పుట్టాను ఈ లోకం మెచ్చిందని’ మార్వివెస్ట్​ ​ అన్నట్లే ఆయన ఛానల్​ చూసి చాలా మంది తెలుగు వాళ్లు ముచ్చటపడి మొచ్చుకున్నారు. ‘ నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది.. నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది.. నాకింకా ఈ లోకంతో పని ఏముంది?’ అంటూ ఆ పాటల్ని తేలిగ్గా కొట్టిపారేయొద్దు. ఎందుకంటే మార్వివెస్ట్​ పాటలు మనకింకా కావాలి. ఎంటర్​టైన్​మెంటే కదా మనకు కావాల్సింది. చిన్న చిన్న తప్పులకు ‘డోంట్​ కేర్’ అంటూ తెలుగు పాటలు వింటూనే ఉందాం. మనవి తెలుగు పాటలతోపాటు హిందీ పాటలకూ అలవాటుపడ్డ ప్రాణాలని ఆయనకీ తెలిసిపోయిందేమో? హిందీ పాటలు కూడా ఇప్పుడు మొదలుపెట్టిండు. జాల్లీ వోకల్​ ఛానల్​లో ఏడాది కిందనే ఈ పాటలు పోస్ట్ చేసిండు. ఆలస్యంగా ఇప్పుడీ వినోదం వైరల్ అవుతోంది.