- మొబైల్ ఫోన్లు లేక ఆధార్ కార్డులు రావట్లే
- కోర్ ఏరియాలో 9,500 మందికి నో ఐడీ ప్రూఫ్స్
- ఏ గుర్తింపు లేక స్కీమ్‌లు దూరం
- బర్త్, క్యాస్ట్ సర్టిఫికెట్లు, రేషన్‌కార్డులు లేక కాగితాలకే సంక్షేమం పరిమితం
- ప్రత్యామ్నాయ మార్గంలో కార్డులివ్వాలని వేడుకోలు
నాగర్ కర్నూల్, వెలుగు: నాగరిక సమాజానికి దూరంగా చెట్టు పుట్టల మధ్య బతికే ఆదివాసీలకు ఆధార్‌కార్డులు అందడం లేదు. అన్నింటికీ ఆ కార్డే ప్రామాణికం కావడంతో నల్లమల అడవుల్లోని చెంచులకు ఏ సంక్షేమ ఫలాలు దక్కడం లేదు. దీంతో వేలాది మంది ఆదివాసీల జీవనం దయనీయంగా మారింది. సెల్ఫోన్లు లేకపోవడమే ఇందుకు కారణమని ఆఫీసర్లు చెబుతున్నారు. ఓటీపీ లేక ఆధార్ కార్డులు ఇవ్వలేకపోతున్నామని అంటున్నారు. ఆధార్లేక.. అటు బర్త్, క్యాస్ట్ సర్టిఫికెట్లు రాక, రేషన్‌కార్డులకు నోచుకోకపోడంతో చెంచుల సంక్షేమం కాగితాలకే పరిమితమవుతున్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేండ్లు గడిచినా ఆదివాసీల బతుకులు మారడం లేదు.
ఒక్కరికీ ఆధార్ లేదు..
మన్ననూర్ఐటీడీఏ పరిధిలోని 172 పెంటల్లో సుమారు 9,500 మంది చెంచులు నివసిస్తున్నారు. ఈ పెంటలు నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లోని 100 గ్రామ పంచాయతీల పరిధిలో విస్తరించి ఉన్నాయి. అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో80 చెంచు పెంటలు ఉన్నాయి. వేటే ప్రధానంగా బతికే వీరిలో ఎవరికీ పక్కా గృహాలు లేవు.
అందరూ గుడిసెల్లోనే నివసిస్తున్నారు. చెంచుపెంటల్లోని పిల్లలకు చదువు అందని ద్రాక్షలా మారింది. ఫలితంగా ఎవరూ బర్త్, క్యాస్ట్ సర్టిఫికెట్లు తీసుకోవడం లేదు. దట్టమైన అడవుల్లో ఉండే చెంచులకు రేషన్‌కార్డులు సైతం లేవు. ఉమ్మడి ఏపీలో చెంచుల సంక్షేమంకోసం అప్పటి ప్రభుత్వాలు కొంతవరకు కృషిచేశాయి. అడపాదడపా బర్రెలు, గొర్రెలు, ఇండ్లు, వలలు ఇస్తూ వచ్చాయి. కానీ తెలంగాణ వచ్చాక వీరిని ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు.
రెండుసార్లు క్యాంపులు ఫెయిల్..
ప్రతి పనికీ ఆధార్అడిగే ప్రభుత్వ అధికారులు.. నల్లమల కోర్ ఏరియా లో నివసిస్తున్న చెంచులకు ఆ ఆధార్ ఇప్పించలేకపోతున్నారు. కారణం అడిగితే చెంచులకు సెల్ఫోన్లు లేవని, అందువల్ల ఆధార్‌ను, మొబైల్‌తో లింక్చేయలేకపోతున్నామని చెబుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా చెంచులు ఆధార్ సెంటర్లకు రావడం లేదని, పెంటల దగ్గరకే వెళ్దామంటే అక్కడ సెల్‌ఫోన్స్ సిగ్నల్స్ ఉండవని అంటున్నారు. కాగా, చెంచులకు ఆధార్‌కార్డులు ఇప్పించేందుకు 2020 జనవరిలో ఒకసారి, 2022 ఫిబ్రవరిలో రెండోసారి ఆఫీసర్లు మన్ననూర్‌లో క్యాంప్ ఏర్పాటుచేశారు.
ఫస్ట్ టైం సుమారు 480 మందిని, రెండోసారి 160 మందిని రప్పించి ఆధార్‌కార్డుల కోసం ఫొటోలు, వేలిముద్రలు తీసుకున్నారు. కానీ ఓటీపీ సమస్య రావడంతో కార్డులు రాలేదు. ఇక రెండు విడతల్లో 280 మందికి చిత్రమైన సమస్య వచ్చింది. అడవుల్లో రకరకాల పనులు చేయడం వల్ల వాళ్ల వేళ్లపై రేఖలు అరిగిపోయి వేలిముద్రలు తీసుకోలేదు. దీంతో రెండు క్యాంపులు ఫెయిల్ అయ్యాయి. ఇక పెంటల్లో పురుడుపోసుకునే చెంచు మహిళలు బర్త్ సర్టిఫికెట్లకు అప్లై చేయడం లేదు. దీంతో పిల్లలకు క్యాస్ట్ సర్టిఫికెట్లు రావడం లేదు. ఆసరా పింఛన్లతోపాటు ఇతరత్రా ప్రభుత్వ స్కీమ్‌లు అందడం లేదు. ఈ పరిస్థితుల్లో అధికారులు ఏదైనా ప్రత్యమ్నాయ మార్గంలో ఆధార్‌కార్డులు ఇప్పించాలని చెంచులు కోరుతున్నారు.
మమ్మల్ని పట్టించుకునేటోళ్లు లేరు
ప్రభుత్వ స్కీమ్‌లన్నింటికీ సార్లు ఆధార్‌కార్డులు అడుగుతున్నరు. కానీ ఆ కార్డులు మాత్రం ఇప్పించట్లేదు. గతంలో ఒకసారి ఆధార్ సెంటర్‌కు తీసుకెళ్లి అందరి ఫొటోలు తీసుకున్నరు. ఎవరిదో మొబైల్ నంబర్పెడ్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ ఆధార్‌కార్డులు రాలేదు. చాలమందికి బర్త్, క్యాస్ట్సర్టిఫికెట్లు లేవు. రేషన్‌కార్డులు లేవు. మైదాన ప్రాంతాల్లో ఉన్న చెంచుల పరిస్థితి కొంత మంచిగా ఉన్నా అడవుల్లోని చెంచులను ఎవరూ పట్టించుకుంటలేరు.మల్లికార్జున్, సార్లపల్లి మాజీ సర్పంచ్