ఎన్నికల హడావుడి కనిపించని గ్రామం .. ప్రచారానికి దూరంగా అభ్యర్థులు

ఎన్నికల హడావుడి కనిపించని గ్రామం .. ప్రచారానికి దూరంగా అభ్యర్థులు

అలీరాజ్ పూర్(మధ్యప్రదేశ్) : రాజకీయ నాయకులకు ఒక్క ఓటు కూడా విలువైనదే. అలాంటిది, ఏకంగా 763 ఓటర్లున్నా సరే ఆ ఊరిలో మాత్రం ఏ నాయకుడూ ప్రచారం చేయలే. దీనికి కారణం ఆ ఊరు కొండల మధ్య ఉండడమే. అదే.. మధ్యప్రదేశ్ అలీరాజ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని  జందన గ్రామం. ఇక్కడి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్​కు చేరుకోవాలంటే ముందు బోట్​లో, ఆపై కాలినడకన ప్రయాణించాలి. మరో మార్గం ఉన్నా అది దూరం ఎక్కువని అలీరాజ్ పూర్ కలెక్టర్ అభయ్ అరవింద్ తెలిపారు. 

763 మంది రిజిస్టర్డ్ ఓటర్లు..

జిల్లా కేంద్రం అలీరాజ్​పూర్​కు 60 కి.మీ.ల దూరం లోనే ఉన్నప్పటికీ  జందన గ్రామం అభివృద్ధికి అమడ దూరంలో ఉంది. ఈ గ్రామం సర్దార్ సరోవర్ డ్యామ్ బ్యాక్ వాటర్​ మధ్యలో ఉంది. బిలీ అనే భాషను మాట్లాడే గిరిజన తెగల వారు నివసిస్తున్నారు. సుమారు వెయ్యిమంది జనాభా ఉన్న ఈ ఊళ్లో 763 మంది ఓటర్లు ఉన్నారు. ఈ గ్రామంలో కూడా ఎన్నికలు జరగుతున్నయనడానికి సంకేతంగా అక్కడక్కడా ఇళ్ల మీద పార్టీల జెండాలు కనిపిస్తున్నాయి. అంతకుమించి ఈ ఊరిలో ఎలాంటి హడావుడి లేదు.

తాగునీటికి కరువు..

ఈ గ్రామంలో కనీస సదుపాయాలు కూడా లేవు. వర్షాకాలంలో తాగునీటికి ఘోస పడాల్సిందే. ఇంటింటికీ నీటి సదుపాయం కల్పిస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన నేతలు.. గెలిచాక ఇప్పటి వరకు కనిపించనేలేదు. కొన్నాళ్ల క్రితం గ్రామస్తులు బోరు బావిని వేసేందుకు ప్రయత్నించారు. కొండ ప్రాంతం కావడటంతో వారి ప్రయత్నం ఫలించలేదు. కాంక్రీట్ రోడ్ వేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, అటవీ శాఖకు లేఖ రాశామని, అనుమతి రాగానే రోడ్డు పనులు ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు. అలీరాజ్ పూర్ లో నవంబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. అధికార బీజేపీ నుంచి నగర్ సింగ్ చౌహాన్, కాంగ్రెస్ నుంచి ముకేశ్ పటేల్ పోటీపడుతున్నారు.