- పిల్లర్‌ను ఆనుకొని తవ్వకాలు...
- పోలీసు కాపలా ఉన్నా... నిఘా సున్న
కాగజ్ నగర్,వెలుగు: కాగజ్ నగర్ మండలం అందెవెల్లి గ్రామ సమీపంలో పెద్దవాగు బ్రిడ్జి ఎప్పుడు కూలుతుందో తెలియదు. ప్రమాదాన్ని తెలుసుకున్న ఆఫీసర్లు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అయితే బ్రిడ్జి పిల్లర్లను ఆనుకొని కొందరు జేసీబీల సహాయంతో ఇసుకను తోడేస్తున్నారు. రోజు వందలద ట్రిప్పులు రవాణా చేస్తున్నారు. పిల్లర్కుంగడం... వంతెన డ్యామేజీకి ఇసుకాసురులే కారణమని ఆరోపణలు ఉన్నాయి. అయినా ఆఫీసర్లు మాత్రం పట్టించుకోవడంలేదు. ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు బ్రిడ్జికి రిపేర్చేయాలనే ఆలోచన చేయడం లేదు. అంతేకాదు ఉన్నదానిని కాపాడే ప్రయత్నమూ చేయడంలేదు. ఎలాంటి అనుమతి లేకుండా సాగుతున్న ఈ దందాను ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు. మరో విశేషం ఏమిటంటే అందెవెల్లి బ్రిడ్జి దగ్గర కాపలాగా ఉన్న పోలీసుల ఎదుటే ఇదంతా జరగడం అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయమై కాగజ్ నగర్ తహసీల్దార్ ప్రమోద్ కుమార్ ను వివరణ కోరగా విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. స్థానిక సర్పంచ్‌కు ఇసుక తవ్వకాలు జరగకుండా చూడాలని చెప్పామన్నారు. పంచాయతీ సెక్రటరీని సంప్రదించగా ఇసుక తోడేయడంపై తమకు సంబంధం లేదన్నారు. అదంతా తహసీల్దార్ చూసుకుంటాడని చెప్పడం విశేషం.
