పెండ్లి వయసు లేకున్నా.. మేజర్లు సహజీవనం చేయొచ్చు.. రాజస్తాన్ హైకోర్టు సంచలన తీర్పు !

పెండ్లి వయసు లేకున్నా.. మేజర్లు సహజీవనం చేయొచ్చు.. రాజస్తాన్ హైకోర్టు సంచలన తీర్పు !
  • వ్యక్తిగత స్వేచ్ఛను వివాహ వయస్సుతో ముడిపెట్టలేమని వ్యాఖ్య

జైపూర్: రాజస్తాన్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వివాహ వయసు (అమ్మాయికి 18, అబ్బాయికి 21) రాని వయోజనులు పరస్పర సమ్మతితో లివ్-ఇన్‌‌‌‌ రిలేషన్​షిప్​లో ఉండొచ్చని స్పష్టం చేసింది. తమ ప్రాణాలకు ముప్పు ఉందని, రక్షణ కోరుతూ కోటా జిల్లాకు చెందిన 18 ఏళ్ల అమ్మాయి, 19 ఏళ్ల అబ్బాయి దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌ను శుక్రవారం విచారించిన రాజస్తాన్​హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనూప్ కుమార్ ధండ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 

పిటిషనర్లు ఇద్దరూ అక్టోబర్ 27, 2025 నుంచి పరస్పర సమ్మతితో లివ్-ఇన్ రిలేషన్ షిప్​లోకి ప్రవేశించి కలిసి జీవిస్తున్నట్టు కోర్టుకు తెలిపారు. అయితే అమ్మాయి కుటుంబం చంపేస్తామని బెదిరిస్తోందని, కోటా కునాడీ పోలీస్ స్టేషన్‌‌‌‌ లో నవంబర్ 13న, నవంబర్ 17న రెండు సార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని వాపోయారు. అందుకే ప్రాణభయంతో రక్షణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు.

లివ్​ఇన్​ రిలేషన్ నేరం కాదు

రాజ్యాంగం 21వ అధికరణం కింద ప్రాణ, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును వివాహ వయసు రాలేదనే కారణంతో ఆపలేమని న్యాయస్థానం పేర్కొన్నది. సహజీవన సంబంధాలు భారత చట్టాల ప్రకారం నేరం కాదని, నిషేధం లేదని స్పష్టం చేసింది. “అబ్బాయికి 21 ఏండ్లు నిండలేదు కనుక సహజీవనానికి అనుమతి ఇవ్వకూడదు” అని ప్రభుత్వ న్యాయవాది వివేక్ చౌదరి వాదించినా, ఆ వాదన హైకోర్టు తోసిపుచ్చింది. ప్రతి వ్యక్తి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత దేశానికి ఉందని గుర్తు చేసింది. యువతి, యువకులకు రక్షణ కల్పించాలని భిల్వారా, జోధ్‌‌‌‌పూర్ రూరల్ జిల్లాల ఎస్పీలకు ఆదేశాలిచ్చింది.