ఆ ముచ్చట ఈటలకు కూడా తెలుసు: మంత్రి జగదీశ్ రెడ్డి

ఆ ముచ్చట ఈటలకు కూడా తెలుసు: మంత్రి జగదీశ్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: పోలీసులను రాజకీయాలకు వాడుకోవద్దనేది సీఎం కేసీఆర్ విధానం అని, ఈ విషయం ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌‌‌‌కు కూడా తెలుసని మంత్రి జగదీశ్‌‌రెడ్డి అన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని మునుగోడులో రాజకీయం చేస్తున్నారని ఈటల ఆరోపించడం సరికాదన్నారు. బుధవారం ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్‌‌తో కలిసి తెలంగాణ భవన్‌‌లో జగదీశ్‌‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పలివెల గ్రామంలో టీఆర్‌‌‌‌ఎస్ కార్యకర్తలపై, హైదరాబాద్‌‌ నుంచి వచ్చిన గూండాలు దాడి చేశారని ఆరోపించారు. 

తెలంగాణ ఉద్యమకారుడు, ములుగు జడ్పీ చైర్మన్ జగదీశ్​పై, గొడవ ఆపేందుకు ప్రయత్నించిన పల్లా రాజేశ్వర్‌‌‌‌రెడ్డిపై కూడా దాడి చేశారన్నారు. ఒక్క సీటుతో కేసీఆర్‌‌‌‌ను ఎలా గద్దె దించుతారో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ పాదయాత్రపైనా జగదీశ్‌‌రెడ్డి సెటైర్లు వేశారు. పార్టీని నడిపించడం చేతగాక ఆయన పారిపోయాడని విమర్శించారు. రాహుల్ ఏ హోదాలో పాదయాత్ర చేస్తున్నాడో చెప్పాలన్నారు. పార్లమెంట్‌‌లో మోడీని రాహుల్ ముద్దుపెట్టుకున్నప్పుడే, బీజేపీకి, కాంగ్రెస్‌‌కు మధ్య ఉన్న అంతర్గత ఒప్పందం ఏంటో తెలిసిపోయిందన్నారు.