- కేసీఆర్‌ను ఓడించేందుకు టీజేఎస్ శక్తి చాలకే కాంగ్రెస్‌కు మద్దతిచ్చినం: ఎమ్మెల్సీ కోదండరాం
- కొన్ని నియోజకవర్గాలను ఎంపిక చేసుకొని పనిచేస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: పార్టీ ఆవిర్భావం నుంచి ఓట్ల రాజకీయంలో ఓడినా.. ప్రజల గుండెల్లో నిలిచామని తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. కేసీఆర్‌ను ఓడించడానికి తమ పార్టీ శక్తి ఒక్కటే సరిపోదని, అందుకే కాంగ్రెస్‌కు మద్దతిచ్చామని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని జలవిహార్‌లో టీజేఎస్ నాలుగో ప్లీనరీ నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి భారీగా పార్టీ అభిమానులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు హాజరయ్యారు. పార్టీ జెండాను కోదండరాం ఆవిష్కరించారు. గద్దర్, కేశవరావ్ జాదవ్‌కు పూలమాలలు వేసి, నివాళి అర్పించారు. ప్లీనరీలో భాగంగా పార్టీ అధ్యక్షుడిగా కోదండరాంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చేసారి పార్టీ అధ్యక్ష పదవిని ఇతరులకు అప్పగిస్తానని ప్రకటించారు.
‘‘మాకు ఓట్లు రావని నాకు తెలుసు. ఎందుకంటే మా దగ్గర డబ్బు లేదు. వచ్చే శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని నియోజకవర్గాలను ఎంపిక చేసుకొని పోరాటం చేస్తాం. ఇప్పుడు స్వేచ్ఛ ఉంది. ఏ సమస్యనైనా ప్రభుత్వానికి నేరుగా చెప్పే, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే అవకాశం ఉంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని, మంత్రులను కలవడం చాలా కష్టమయ్యేది. తెలంగాణ జన సమితిని కేసీఆర్ తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. అయినప్పటికీ పార్టీ నిలబడింది. కేసీఆర్ ఇక ఫార్మ్‌హౌస్‌కే పరిమితం.. బయటకు రారు. మా పోరాటానికి రాజకీయ పార్టీ అవసరం కావడంతోనే తెలంగాణ జన సమితిని స్థాపించాం.
23 తీర్మానాలతో ఈ మహాసభకు వచ్చాం. రైతు సమస్యలు, నిరుద్యోగ సమస్యలుసహా ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జనసమితి పనిచేస్తుంది. ఇప్పటి సమస్యల పరిష్కారానికి టీజేఎస్ దిక్సూచిగా నిలుస్తోంది. ఈ ఎనిమిదేండ్లలో మాకు ఓట్లు రాకపోయినా ప్రజల విశ్వాసం సంపాదించుకున్నాం. ప్రజల కోసం మేం నిలబడతాం. మీరు మా పోరాటంలో భాగస్వాములు కావాలి” అని ప్రజలను కోరారు.
ఉద్యమ పోరాట ఫలితమే ఎమ్మెల్సీ పదవి
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పోరాడినందుకే తనకు ఎమ్మెల్సీ పదవి దక్కిందని కోదండరాం అన్నారు. పదేండ్లూ తెలంగాణను తానే తెచ్చాననే భావనలో కేసీఆర్ మాట్లాడారని, ఆ కాలంలో కమీషన్ల కోసమే ప్రభుత్వం నడిచిందని విమర్శించారు. ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వచ్చి ప్రజలకు పొదుపు సుభాషితాలు చెప్పారని, కానీ ప్రజలకు ఏమి చేయబోతున్నారో చెప్పలేదని అన్నారు. ఈ మహాసభలో పార్టీ నాయకులు బైరి రమేశ్, నర్సయ్య, నిజ్జన రమేశ్, సర్దార్ వినోద్, ధర్మార్జున్ పాల్గొన్నారు.
