జనం కోసం చెరువులు బాగు చేస్తుండు

జనం కోసం చెరువులు బాగు చేస్తుండు

ప్రతి నీటి చుక్క విలువైనదే. నీటిని వేస్ట్‌‌‌‌ చేయకుండా జాగ్రత్త పడాలి, లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని చెప్తుంటాయి ప్రభుత్వాలు, కొన్ని ఎన్జీవోలు. ఎవరు ఎంత చెప్పినా... అవగాహన కల్పించినా... చాలామందిలో మార్పు రావడం లేదు. అందుకని నోయిడాకు చెందిన ముప్పై ఏండ్ల రామ్‌‌‌‌వీర్‌‌‌‌‌‌‌‌ తన్వర్‌‌‌‌‌‌‌‌ తను చేస్తున్న ఇంజనీరింగ్‌‌‌‌ జాబ్‌‌‌‌ మానేశాడు. నీటిని కాపాడాలి, చెట్లు పెంచాలని తనకు తానుగా  కొన్ని పనులు చేస్తున్నాడు.

నీటి నిల్వ సరిగా జరగక ప్రతీఏటా కొన్ని వేల గ్యాలన్ల వర్షపు నీరు సముద్రంలో కలిసి వృధాగా పోతోంది. చెరువులు, కుంటలు ఉన్నా అవి చెత్త, మురుగు నీరు, భూ కబ్జాలతో నిండిపోయి ఉంటున్నాయి. దానివల్ల నీటి సేకరణ సరిగాలేక, గ్రౌండ్‌‌‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌ తగ్గిపోయి అక్కడక్కడ చాలామంది నీటి సమస్య ఎదుర్కొంటున్నారు. అందుకే ‘జల్‌‌‌‌ చౌహల్‌‌‌‌’ అనే పేరుపెట్టి చెరువులు, కుంటలను శుభ్రం చేస్తున్నాడు రామ్‌‌‌‌వీర్‌‌‌‌‌‌‌‌. అందరికి నీటి విలువ గురించి మరీమరీ చెప్తున్నాడు రామ్‌‌‌‌వీర్.

అందుకే ఇదంతా..
ఉత్తర్‌‌‌‌‌‌‌‌ ప్రదేశ్, నోయిడా జిల్లాలోని చౌగన్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో పుట్టి పెరిగాడు రామ్‌‌‌‌వీర్‌‌‌‌‌‌‌‌. వ్యవసాయ కుటుంబం. దాంతో చిన్నప్పుడు వాళ్లకున్న బర్రెల్ని చెరువు గట్లమీద, అడవుల్లో తిప్పుతూ మేపేవాడు. అక్కడే ఆడుకునేవాడు కూడా. అలా ఆ ప్రకృతికి బాగా అలవాటు పడిపోయాడు. తరువాత చదువు, జాబ్‌‌‌‌ వల్ల నోయిడాలో స్థిరపడ్డాడు. అక్కడ గ్రౌండ్‌‌‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌ లెవల్ తగ్గడం వల్ల నీటి సమస్యలు వచ్చి బాగా ఇబ్బంది పడ్డారు జనం. ఇలా ఎందుకు జరుగుతుందని రీసెర్చ్‌‌‌‌ చేస్తే, సిటీ చుట్టూ ఉన్న చెరువులు, కుంటలన్నీ చెత్తాచెదారంతో నిండిపోయి ఉన్నాయి. కొన్నైతే పూర్తిగా కనుమరుగు అయిపోయాయి. దానివల్ల నీటి స్టోరేజ్‌‌‌‌ జరగక గ్రౌండ్‌‌‌‌ వాటర్ లెవల్ తగ్గింది. అందుకే నీటి సమస్య వస్తుందని తెలుసుకున్నాడు. దేశంలో చాలా ప్రాంతాల్లో ఇలాగే  జరుగుతుంది. చెరువులన్నీ  డ్రైనేజ్‌‌‌‌ల్లా, డంప్‌‌‌‌ యార్డ్‌‌‌‌ల్లా మారిపోతున్నాయి. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ముందు తరాలు చెరువులు, వాటి అందాలు చూడలేరు అనిపించింది రామ్‌‌‌‌వీర్‌‌‌‌‌‌‌‌కు. దాంతో సొంతంగా చెరువుల పూడికతీత పనులు మొదలుపెట్టాడు. వాటిలోని చెత్తా చెదారాన్నంతా క్లీన్‌‌‌‌ చేసి మళ్లీ మామూలు వాటిలా మార్చుతున్నాడు. ఈ పని కోసం 2016లో తను చేస్తున్న మెకానికల్‌‌‌‌ ఇంజనీరింగ్‌‌‌‌ జాబ్ కూడా వదిలేసాడు. అతను చేస్తున్న పని నచ్చి  ఫ్రెండ్స్ కొందరు రామ్‌‌‌‌వీర్‌‌‌‌‌‌‌‌తో కలిసి నడుస్తున్నారు. కొన్ని ఎన్జీవోలు కూడా ఇతనికి సాయపడుతున్నాయి. ఏ ఊరికి వెళ్తే ఆ ఊరి ప్రజలు రామ్‌‌‌‌వీర్‌‌‌‌‌‌‌‌తో కలిసి పనిచేసేందుకు ముందుకొస్తున్నారు. ఒక్క నోయిడాలోనే కాదు ఇప్పటివరకు ఉత్తర్‌‌‌‌‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌, మధ్య ప్రదేశ్‌‌‌‌, ఉత్తరాఖండ్‌‌‌‌, ఢిల్లీ, హర్యానా, కర్నాటక రాష్ట్రాల్లో వందలకు పైగా చెరువులు, కుంటలను బాగు చేశాడు. అంతేకాకుండా ఊళ్లన్నీ తిరుగుతూ... నీటిని ఆదా చేయాలి, చెట్లు పెంచాలని అవగాహన కల్పిస్తున్నాడు. అందుకే ఇతన్ని ‘పాండ్‌‌‌‌ మ్యాన్ ఆఫ్‌‌‌‌ ఇండియా’ అని పిలుస్తున్నారు. 

‘చెట్లు, చెరువుల వల్లే మనమంతా హాయిగా బతకగలం.  మనిషి అవసరాలకు చెట్లను నరికేస్తూ, చెరువులు పూడ్చేస్తూ పోతే భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదురవుతాయి. అందుకే ప్రతీ ఒక్కరు ప్రకృతిని కాపాడటానికి ఎవరికి తోచినపని వాళ్లు చేయాలి’ అంటున్నాడు రామ్‌‌‌‌వీర్‌‌‌‌‌‌‌‌.