ఆలోచన అద్భుతం : ఒక్క ఆడపిల్ల పుడితే 111 మొక్కలు నాటుతారు

ఆలోచన అద్భుతం : ఒక్క ఆడపిల్ల పుడితే 111 మొక్కలు నాటుతారు

సమాజంలో నేటికీ కొంతమంది మగపిల్లాడు పుడితే బాగుంటుందని భావిస్తూ ఉంటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆడపిల్ల పుడితే పండుగలా జరుపుకుంటారు. రాజస్థాన్ రాష్ట్రంలోని పింప్లాని గ్రామంలో ఆడపిల్ల పుడితే 111 మొక్కలు నాటుతారు. ఎవరి ఇంట్లో ఆడపిల్ల పుడితే ఆ ఆడపిల్ల తల్లిదండ్రులు మొక్కలు నాటుతారు. అలా ఎంతమంది ఆడపిల్లలు పుడితే అన్నిసార్లు మొక్కలు నాటుతారు.

ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ విధంగా మొక్కలు నాటడం వల్ల ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు పచ్చదనంతో కళకళలాడుతూ ఉంటాయి. మొక్కలు నాటడంతో పాటు ఆ మొక్కలు ఏపుగా పెరిగేవరకూ ఆ మొక్కల సంరక్షణ బాధ్యతలను తీసుకుంటారు. ఆడపిల్ల బర్త్ డే రోజున ఆ మొక్కలకు పూజలు చేస్తారు. పండుగ దినాల్లో సైతం ఆ మొక్కలకు పూజలు నిర్వహిస్తారు. మాజీ సర్పంచ్, గ్రామపెద్ద అయిన శ్యామ్ సుందర్ పాలిపాల్ మొక్కలు నాటే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.

శ్యామ్ సుందర్ పాలిపాల్ కు ఒక ఆడపిల్ల పుట్టగా ఆ పాప ఆరోగ్య సమస్యల వల్ల చనిపోయింది. ఆ పాప జ్ఞాపకార్థం శ్యామ్ సుందర్ పాలిపాల్ 111 మొక్కలను నాటడంతో పాటు ఆ ప్రాంతమంతా చక్కగా పచ్చదనంతో వెల్లివిరిసేలా చేశారు. శ్యామ్ సుందర్ పాలిపాల్ ప్రస్తుతం పదవిలో లేకపోయినా ఆడపిల్ల పుడితే 111 మొక్కలు నాటాలి అని గ్రామస్తులంతా నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. పింప్లాన్ గ్రామం లో మూడు లక్షలకు పైగా నాటిన మొక్కలు చెట్లుగా మారాయి. ఆ గ్రామాన్ని చూసి ఇతర గ్రామాల ప్రజలు సైతం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతుండటం గమనార్హం. శ్యామ్ సుందర్ పాలిపాల్ కృషి వల్లే గ్రామానికి మంచి పేరు రావడంతో గ్రామస్తులు అతనిని ప్రశంసిస్తున్నారు. 

ఎనిమిదిన్నరవేలమంది జనాభా గల ఈ గ్రామంలో సగటున ఏడాదికి అరవైమంది ఆడపిల్లలు పుడుతుంటారు. ప్రతి ఆడపిల్ల పుట్టినప్పుడు నూటపదకొండు మొక్కలు నాటడమే కాకుండా ఆమె పేరు మీద 21 వేల రూపాయలు ఫిక్స్ డ్‌ డిపాజిట్ చేస్తారు. స్వంత కుటుంబము నుంచి తమ తమ ఆర్థిక పరిస్థితిని అనుసరించి వెయ్యి నుంచి పదివేల రూపాయలు వెచ్చిస్తారు. ఈ మొత్తం ఆ అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చాక మాత్రమే తీసుకోవాల్సివుంటుంది. ఆమె చదువుకు మాత్రమే ఈ మొత్తాన్ని వినియోగిస్తామని కుటుంబం అఫిడవిట్ ఇవ్వాలి. అలాగే ఆమె పేరు మీద నాటిన మొక్కల పెంపకం బాధ్యత కుటుంబ సభ్యులు తీసుకుంటారు. అంతేకాదు ఆ అమ్మాయికి చట్టం నిర్దేశించిన వయస్సు వచ్చే వరకు వివాహం చేయమని తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రంపై కూడా సంతకం తీసుకొంటారు.