
సిటీల్లో దాదాపు ప్రతి ఇంటి ముందు కారు, బైక్ పార్కింగ్‌కు కొంత ప్లేస్ ఉండడం కామన్. కానీ.. అమెరికాలో ఉన్న ఈ టౌన్లో మాత్రం ప్రతి ఇంటికి ఎరోప్లేన్ పార్కింగ్ కోసం కొంత ప్లేస్ ఉంటుంది. ఎందుకంటే.. ఈ టౌన్లో ప్రతి ఒక్కరికీ ఒక విమానం ఉంది. మనం బైకులు, కార్లు కొన్నట్టే వాళ్లు విమానాలు కొంటుంటారు. అంతెందుకు ఆఫీసులకు కూడా విమానాల్లోనే వెళ్లొస్తారు!
ఇల్లు కట్టుకున్నప్పుడు బైక్ లేదా కారు పార్కింగ్ కోసం కొంత ప్లేస్‌ని కేటాయిస్తుంటారు. కానీ.. కాలిఫోర్నియాకు దగ్గర్లోని కామెరాన్ ఎయిర్‌పార్కు అనే టౌన్లో మాత్రం ఎవరు కొత్త ఇల్లు కట్టినా.. కచ్చితంగా విమానం పార్క్ చేయడానికి కొంత ప్లేస్ వదిలిపెడతారు. అంతేకాదు.. అక్కడ ప్రతి ఇంటిముందు కనీసం ఒక్క విమానమైన పార్క్ చేసి ఉంటుంది. కామెరాన్ ఎయిర్‌పార్కులో ఉండేవాళ్లలో ప్రతి ఒక్కరూ ఏవియేషన్ ఇండస్ట్రీలోనే పనిచేస్తున్నారు. అందుకే అందరికీ విమానాల మీద ఎక్కువ అవగాహన ఉంటుంది. దాంతో ఇక్కడివాళ్లంతా సొంతంగా విమానాలు కొన్నారు.
యుద్ధం తర్వాత
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా బాగా డెవలప్ అయ్యింది. అందులో భాగంగానే అర్బన్ ఏరియాలు పెరిగాయి. ఏవియేషన్ ఇండస్ట్రీ డెవలప్ అయ్యింది. విమానాల్లో ప్రయాణించే వాళ్ల సంఖ్య కూడా పెరిగింది. దాంతో ఎక్కువమంది ట్రైనింగ్ తీసుకుని, పైలట్లు అయ్యారు. 1939లో 34 వేలు ఉన్న పైలట్ల సంఖ్య1946 నాటికి 4 లక్షలకు పెరిగింది. సరిగ్గా ఆ టైంలోనే కాలిఫోర్నియాకు దగ్గర్లో ఈ కామెరాన్ ఎయిర్‌పార్క్ పుట్టింది. కాలిఫోర్నియా ఎయిర్‌పోర్ట్‌లో పనిచేసేవాళ్లలో చాలామంది దాని చుట్టుపక్కలే ఇండ్లు కట్టుకున్నారు. దాంతో ఎయిర్‌పోర్టుకు దగ్గర్లో ఫ్లై–ఇన్ కమ్యూనిటీ ఏర్పాటైంది. రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడి, రిటైరైన మిలటరీ పైలట్లు కూడా ఇక్కడే ఇండ్లు కొనుక్కున్నారు. గవర్నమెంట్ కూడా వాళ్ల విమానాల ఫ్లైయింగ్‌కు కావాల్సిన అన్ని పర్మిషన్లు ఇచ్చి, రెసిడెన్షియల్ ఎయిర్‌ఫీల్డ్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ రెసిడెన్షియల్ ఎయిర్‌ఫీల్డ్స్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఏదో ఒక విధంగా ఏవియేషన్ ఇండస్ట్రీతో సంబంధాలు ఉన్నాయి. అందుకే ఈ టౌన్‌లోని వీధులకు కూడా విమానాలు, ఏవియేషన్ రంగానికి సంబంధించిన పేర్లనే పెట్టుకున్నారు. ఉదాహరణకు.. ఇక్కడున్న ఒక రోడ్డుని ‘బోయింగ్ రోడ్డు’ అని పిలుస్తారు.
కార్లలా విమానాలు
మన దగ్గర కార్లు తిరిగినట్టే, ఈ టౌన్లో విమానాలు తిరుగుతుంటాయి. లేదంటే.. టేకాఫ్, ల్యాండింగ్ అవుతూ కనిపిస్తాయి. ప్రతి ఇంటికి ఒక ప్లేన్ హాంగర్ ఉంటుంది. వీధుల్లోని రోడ్లు కూడా చాలా వెడల్పుగా ఉంటాయి. కొన్ని రోడ్లైతే.. రన్‌వే కంటే పెద్దగా ఉంటాయి. విమానాల కోసం ప్రభుత్వమే ఇలా పెద్ద రోడ్లను నిర్మించింది. రోడ్లపై ఫ్లైట్స్, కార్లు పక్కపక్కనే నడుస్తుంటాయి. ఇది చాలా చిన్న టౌన్. మొత్తం 124 ఇండ్లు ఉన్నాయి. ఇంకా 20కి పైగా ఖాళీ స్థలాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఒక ఇంటి ధర 1.5 మిలియన్ల అమెరికన్ డాలర్లు. రోడ్లు 100 అడుగుల వెడల్పుతో ఉంటాయి. పైలట్లు తమ విమానాలను ఎయిర్పోర్ట్ నుంచి, ఇంటి గుమ్మాల వరకు హాయిగా తీసుకెళ్లొచ్చు.
మెయిల్ బాక్స్
అమెరికాలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ప్రతి ఇంటి ముందు మెయిల్ బాక్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఉంటాయి. కానీ.. ఇక్కడ కాస్త స్పెషల్. స్ట్రీట్ సైన్ బోర్డ్స్, మెయిల్‌బాక్స్‌లు 3 అడుగుల కంటే తక్కువ ఎత్తులో ఉంటాయి. అది మామూలుగా అవి ఉండే ఎత్తు కంటే చాలా తక్కువ. విమానాలు నడుస్తున్నప్పుడు వాటి రెక్కలు తగిలి, బాక్స్‌లు డ్యామేజ్ కాకుండా ఉండేందుకు ఇలా ఏర్పాటు చేశారు.
ట్రాఫిక్ తప్పినట్టే
ఈ టౌన్ పక్కనే ఎయిర్పోర్ట్ ఉండడంతో ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. కానీ.. ఈ టౌన్లో ఉండేవాళ్లకు మాత్రం ఆ సమస్య ఉండదు. ఎందుకంటే.. ఇక్కడ దాదాపు అందరూ విమానాల్లోనే ఆఫీసులకు వెళ్లి, వస్తుంటారు. అక్కడే ఉండే ఒక పైలట్ ‘‘నేను పనిచేసే ఎయిర్‌పోర్ట్‌కి కారులో వెళ్తే.. మూడు గంటలు జర్నీ చేయాల్సి ఉంటుంది. కానీ.. నేను విమానంలో వెళ్లడం వల్ల కేవలం 35 నిమిషాల్లోనే ఆఫీస్‌కు వెళ్లగలుగుతున్నా” అని చెప్పాడు.