లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అంతా సిద్ధం

లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అంతా సిద్ధం

లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అంతా సిద్ధం చేస్తోంది ఎన్నికల కమిషన్. ఎటువంటి లోటుపాట్లకు అవకాశం లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను, మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు సీఈఓ రజత్ కుమార్. లోక్ సభ ఓట్ల లెక్కింపులో చట్టపరమైన అంశాలతోపాటు, కౌంటింగ్ కు ముందు, తర్వాత తీసుకోవాల్సిన చర్యలను.. ఎన్నికల అధికారులకు వివరించారు. స్ట్రాంగ్ రూమ్ లు తెరిచే సమయంలో అభ్యర్థులు, ఏజంట్లు, పరిశీలకులు తప్పనిసరిగా అక్కడే ఉండాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను, మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. జిల్లా ఎన్నికల ప్రధానాధికారులు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు నిన్న హైదరాబాద్ లో రెండో విడత శిక్షణ నిర్వహించారు. ఎలాంటి విమర్శలకు, ఆరోపణలకు తావులేకుండా కౌంటింగ్ నిర్వహించాలని సూచించారు రజత్ కుమార్. మొదటి రెండు రౌండ్లు దశలవారీగా ఎలా లెక్కించాలో.. ఆ సమయంలో ఎఆర్ ఓలు ఎలా అప్రమత్తంగా ఉండాలో వివరించారు.

రిటర్నింగ్ అధికారులు, పరిశీలకులకు ఉన్న పరిమితులు, అధికారాలను వివరిస్తూనే.. వాటిని ఎలా వినియోగించాలో చెప్పారు సీఈఓ. కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత.. ఓటింగ్ యంత్రాల భద్రత, ఎన్నికలకు సంబంధించిన రికార్డులు, పత్రాల సీల్ ఎలా వేయాలనే విషయాలు వివరించారు. ఫలితాల ప్రకటనను ఎన్నికల సంఘానికి నిర్దేశిత ఫారాలలో ఎలా నింపి పంపాలనే విషయాలపై అవగాహన కల్పించారు.

ఓట్ల లెక్కింపులో సువిధ అనే అప్లికేషన్ ను ఎలా ఉపయోగించాలో శిక్షణలో.. మాస్టర్ ట్రైనర్లు వివరించారు. సువిధ పోర్టల్ లో డేటా ఎంట్రీ జరిగిన తర్వాతనే ఆ రౌండ్ ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ఇవాళ ఓట్ల లెక్కింపు సన్నద్ధతను పూర్తిస్థాయిలో పరీక్షించేందుకు.. డ్రెస్ రిహార్సల్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు రజత్ కుమార్. ఎక్కడా అజాగ్రత్తకు అవకాశం లేకుండా లెక్కింపు ప్రక్రియ విజయవంతంగా పూర్తిచేయాలని.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సీఈసీ చర్యలు తప్పవని హెచ్చరించారు సీఈఓ.