ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్లపై సుప్రీం తీర్పును పునః సమీక్షించాలి

ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్లపై సుప్రీం తీర్పును పునః సమీక్షించాలి

ఇటీవల సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం అగ్రకుల పేదలకు విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ల అమలును సమర్థిస్తూ 3:2 మెజార్టీతో తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.103వ రాజ్యాంగ సవరణ చేసే నాటికి ఆర్టికల్15(4), 15(5), 16(4) ద్వారా షెడ్యూల్డ్ కులాలకు(ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలకు(ఎస్టీ) సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతుల(ఓబీసీ) వారికి విద్యా, ఉద్యోగాల్లో తగు ప్రాతినిధ్యం లేనట్లయితే రిజర్వేషన్లు కల్పించడానికి వెసులుబాటు ఉంది.

నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ముఖ్యంగా హిందూ సమాజంలో కుల వ్యవస్థ, సామాజిక అంతరాలు స్పష్టంగా, వేల ఏండ్లుగా కొనసాగుతున్నాయి. అందుకే రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో ఆర్టికల్15, 16లను చేర్చారు. రాజ్యాంగ మౌలిక సూత్రం ఆర్టికల్ 15, 16ల ద్వారా విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందాలంటే ఆయా కులాలు/వర్గాలు సామాజిక విద్యాపరమైన వెనుకబాటు, అస్పృశ్యత, నాగరిక సమాజానికి దూరంగా ప్రత్యేక భాష, ఆచార, కట్టుబాట్లతో నివసిస్తూ ఉండాలి. కానీ, ఆర్థికపరమైన వెనుకబాటు రిజర్వేషన్లు పొందుటకు అర్హత కాదు.

మండల్ కమిషన్ నివేదిక అమల్లో భాగంగా1990లో కేంద్ర ప్రభుత్వం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల(ఓబీసీ) వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేసింది. తర్వాత దేశవ్యాప్తంగా ఓబీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అగ్రకులాలు ఆందోళన చేపట్టాయి. దీంతో వెనువెంటనే ఆనాటి కేంద్ర ప్రభుత్వం అగ్రకులాలను బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా అగ్రకుల పేదలకు(ఈబీసీ) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. 1991లో జీవో జారీ చేసింది. ఈ రెండు రిజర్వేషన్ల అమలును నిలుపుదల చేసిన నాటి సుప్రీంకోర్టు 9 మంది జడ్జీల బెంచ్​సుదీర్ఘ కాలంపాటు విచారించింది.

1992 నవంబర్ లో 6:3 మెజారిటీతో తీర్పును వెలువరిస్తూ ఓబీసీలకు కల్పించిన 27 శాతం రిజర్వేషన్లను సంపన్న శ్రేణి నిబంధనలతో ఆమోదించింది. ఈబీసీ వారికి కల్పించిన10 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక సూత్రానికి విరుద్ధమని తెలుపుతూ కొట్టివేసింది. అదే తీర్పులో మొత్తం నిలువు/వర్టికల్ రిజర్వేషన్లు ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప 50 శాతానికి మించకూడదని నిబంధన విధించింది. 

మరోసారి సమీక్షించాలి..

కేంద్ర ప్రభుత్వం 2019లో 103వ రాజ్యాంగ సవరణ చేస్తూ రాజ్యాంగంలో ఆర్టికల్15(6), ఆర్టికల్16(6) లను చేరుస్తూ, ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కులాలుగా గుర్తింపు పొందిన వారిని మినహాయిస్తూ, మిగిలిన అగ్రకులాల్లోని పేదలను ఆర్థికంగా బలహీన వర్గాలుగా(ఈడబ్ల్యూఎస్) గుర్తించి మతాలకతీతంగా 10 శాతానికి మించకుండా కేంద్ర, రాష్ట ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పించుటకు వెసులుబాటు కల్పించింది.

దేశంలో ఈశాన్య రాష్ట్రాలు, తమిళనాడు మినహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సదరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేస్తున్నాయి. ఆ రాజ్యాంగ సవరణను, రిజర్వేషన్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 40కి పైగా పిటీషన్లు ఫైల్​అయ్యాయి. అందుకు సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం నాలుగు అంశాలను విచారించడానికి స్వీకరించింది. పది రోజుల విచారణ తర్వాత ధర్మాసనంలోని ముగ్గురు న్యాయమూర్తులు వేర్వేరుగా తీర్పు ఇస్తూ103వ రాజ్యాంగ సవరణను సమర్థించారు.

2014లో ప్రమతి ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పులో ఐదుగురు న్యాయమూర్తుల  ధర్మాసనం ప్రైవేటు విద్యాసంస్థల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారికి కల్పిస్తున్న రిజర్వేషన్ల ప్రకారం, ఈడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలిపారు.  సుప్రీం ధర్మాసనంలోని ప్రధాన న్యాయమూర్తి సహా మరో న్యాయమూర్తి103వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేస్తూ, ఆర్థిక వెనుకబాటును మాత్రమే ప్రామాణికంగా తీసుకొని కల్పిస్తున్న రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలను మినహాయించడం మరో రకమైన వివక్షగా గుర్తించారు.

మొత్తం రిజర్వేషన్లు ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప 50 శాతం పరిమితిని మించకూడదని తెలుపుతూ, సదరు రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక సూత్రానికి విరుద్ధమని కొట్టివేశారు. వాస్తవానికి ఆర్దిక పరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక సూత్రానికి విరుద్ధమని గతంలోనే మండల కమిషన్ తీర్పులో 9 మంది జడ్జీల రాజ్యాంగ రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేసింది. రాజ్యాంగ విరుద్ధంగా, బీసీలకు నష్టం చేకూర్చే విధంగా ఉన్న సుప్రీం తీర్పును దేశంలో రాజకీయ పార్టీలు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా ఆ తీర్పుపై సుప్రీంకోర్టులో 13 మంది జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటై సమీక్షించాలి.

మౌలిక స్వరూపం మార్చేలా..

కేంద్రం 2006లో అగ్ర కులాల్లోని ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈబీసీ) వారికి ఏవిధంగానైనా రిజర్వేషన్లు కల్పించాలని జాతీయస్థాయిలో ఇద్దరు సభ్యులతో ఎస్.ఆర్.సిన్హో అధ్యక్షతన కమిషన్​ను నియమించింది. ఆ కమిషన్ సుదీర్ఘ విచారణ తర్వాత 2010లో కేంద్రానికి నివేదిక సమర్పిస్తూ, అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆర్థిక సదుపాయాలు, ఉచిత విద్య తదితర సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. కానీ, వారికి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పలేదు.

కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 2021 నాటికి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో అన్ని  కేటగిరీలను కలిపితే ఉద్యోగుల ప్రాతినిధ్యం ఎస్సీలు 18 శాతం, ఎస్టీలు 9 %, ఓబీసీలు 22 %, అగ్రకులాల వారు 51% ఉన్నారు. కేంద్రీయ విద్యా సంస్థల్లో అగ్రకుల విద్యార్థుల ప్రాతినిధ్యం 50 శాతానికి పైగా ఉంది. ఓబీసీలకు 2008 నుంచి 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. అంటే అగ్రకులాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే విధంగా ఉందని గమనించాలి.

రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని మార్చే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఎలాంటి చట్టాలనైనా/రాజ్యాంగ సవరణలనైనా సమీక్షించి కొట్టివేసి అధికారం ఉందని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో తెలిపింది. 1973లో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ  కేసులో 13 మంది జడ్జిల ధర్మాసనంలో 7:6 మెజార్టీ తీర్పు, 2007లో ఐఆర్ కోల్హో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో 9 మంది జడ్జీలు ధర్మాసనం తీర్పుల ప్రకారం.. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్​లో 1973/1974 తర్వాత చేర్చిన ఎలాంటి చట్టాలనైనా సమీక్షించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. 

-కోడెపాక కుమారస్వామి, రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం