
Manoj Naravane: ఇవాళ తెల్లవారుజామున భారత్ మెరుపు దాడులతో పాకిస్థాన్ లోని ఉగ్రవాదుల క్యాంపులు, స్థావరాలపై విరుచుకుపడింది. దీని తర్వాత ప్రధాని మోదీ కూడా మీడియా ముందుకు వచ్చినప్పటికీ దాడుల గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. దీనిని చూసిన చాలా మంది నేడు జరిగిన అటాక్స్ కేవలం ట్రైలర్ అని, ఈ చర్యలు ఇంకా మిగిలే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఒక మాజీ ఆర్మీ అధికారి చేసిన కామెంట్స్ అనుమానాలను బలపరుస్తోంది.
పహల్గామ్ దాడి తర్వాత ప్రతికారం తీర్చుకునేందుకు ఇండియా నేరుగా ఉగ్రవాదుల స్థావరాలను టార్గెట్ చేసి వారిని మట్టుబెట్టడంతో భారతదేశంలో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పాక్ భూభాగంతో పాటు పీవోకేలోని టెర్రర్ క్యాంపులపై చేసిన దాడుల్లో 100 మంది వరకు మరణించినట్లు వెల్లడైంది. అయితే ఈ విషయం ఇక్కడితో ముగియలేదని ఇండియన్ ఆర్మీ చీఫ్ మేజర్ నరవాణే కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read:-ఆపరేషన్ సింధూర్.. మే 8న ఉదయం 11 గంటలకు ఆల్ పార్టీ మీటింగ్
ఈ క్రమంలో సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో అబీ పిక్చర్ బాకీ హై అంటూ పోస్ట్ చేశారు. అయితే దీనిని చూసిన చాలా మంది ప్రజలు రానున్న కాలంలో మరిన్ని దాడులను భారత్ ప్రణాళికాబద్ధంగా నిర్వహించవచ్చని భావిస్తున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఇండియా అతిత్వరలో పాక్ ఆక్రమించిన కశ్మీర్ ప్రాంతాన్ని తిరిగి చేజిక్కించుకునేందుకు ముందుకెళొచ్చని భావిస్తున్నారు.
Abhi picture baki hai…
— Manoj Naravane (@ManojNaravane) May 7, 2025
ఈరోజు ఉదయం 10 గంటలకు భారత ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆపరేషన్ సిందూర్ కింద తాము మెుత్తంగా తొమ్మిది ప్రాంతాల్లో 28 మిసైల్స్ ఉపయోగించి దాడులు జరిపినట్లు వెల్లడించింది. ఈ దాడులతో ప్రస్తుతం పాకిస్థాన్ లోని ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుడుతోందని నివేదికలు చెబుతున్నాయి.
నేడు భారత్ చేపట్టిన దాడులు యుద్ధాన్ని ప్రేరేపించేవిగా లేవని కేవలం టార్గెట్ చేయబడిన ఉగ్రస్థావరాలను మట్టుబెట్టామని భారత్ వెల్లడించింది. ఈ క్రమంలో తాము ఎలాంటి పాక్ ఆర్మీ స్థావరాలకు నష్టం కలిగించలేదని పేర్కొంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మౌలానా మసూద్ అజ్హర్ కుటుంబానికి చెందిన 14 మంది వరకు మరణించినట్లు అధికారిక నివేదికలు వెల్లడించాయి. ఈ ఉగ్రవాది జైష్ ఈ మెుహమ్మద్ చీఫ్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇతను భారతదేశంలో జరిగిన అనేక దాడులకు కీలక సూత్రధారిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.