ఏపీ డీజీపీకి లేఖ రాశారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కర్నూలు జిల్లా కోసిగిలో టీడీపీ నేత తిక్కారెడ్డిపై దాడి ఘటనలో చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బొంపల్లె ఆలయానికి వెళ్లిన తిక్కారెడ్డిపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనలో ఐదుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడినట్టు లేఖలో వివరించారు. రాష్ట్రంలో వైసీపీ వర్గీయుల అరాచకాలను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. తిక్కారెడ్డికి తగిన భద్రత కల్పించాలని కోరారు. గతేడాది ఫిబ్రవరిలోనూ తిక్కారెడ్డిపై వైసీపీవర్గీయులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని.. అయినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోందన్నారు. తిక్కారెడ్డికి ఏవిధమైన ప్రమాదం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు.
