పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన

పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన

హైదరాబాద్: అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ మధ్య విమర్శలు ప్రతి విమర్శలు, కౌంటర్లు రీ కౌంటర్లతో తెలంగాణ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే జోరు చూపించాలని వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు సర్పంచ్ ఫలితాల్లో రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ కూడా పురపాలక ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది.

పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు కావడంతో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా మూడు పార్టీలు అస్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగబోయే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యింది. తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ హైకమాండ్ ప్రకటించింది.

ఈ మేరకు శనివారం (జనవరి 10) అధికారిక ప్రకటన విడుదల చేసింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేలా కమిటీలు ఏర్పాటు చేయాలని జనసేన అగ్ర నాయకత్వం నిర్ణయించింది. మున్సిపల్ ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ప్రతీ జనసైనికుడు, వీరమహిళ ఉత్సాహంగా ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. త్వరలో ఎన్నికల కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించింది.

ఇప్పటికే మూడు పార్టీల మధ్య ట్రయాంగిల్ ఫైట్ నెలకొన్న వేళ జనసేన బరిలోకి దిగుతుండటంతో తెలంగాణ పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇస్తూ వస్తోన్న జనసేన.. ఈసారి ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. జనసేన ఎంట్రీతో ఓట్ బ్యాంక్ చీలి.. ఏదో ఒక పార్టీకి భారీ డ్యామేజ్ తప్పదంటున్నారు పొలిటికల్ ఎక్స్‎పర్ట్స్