నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష!

నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష!

ఇటీవల అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు పదేపదే ‘ఈ ప్రభుత్వం కూలిపోతుంది’ అని తుపాకి రాముని మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నా ఇలా మాట్లాడడం ఆకాశం మీద ఉమ్మి వేసినట్టే అవుతుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్​తో సహా వీరు అనుసరించిన విధివిధానాలు, తోటివారిని బోల్తా కొట్టించే కుట్రలు కుతంత్రాలు  ఇన్నీ అన్నీ కావు. అంతవరకు మేధావులు, కవులు, రచయితలు ఊరూవాడ ఏకంచేసి జనంలోకి తీసుకుపోయిన  తెలంగాణ భావజాలాన్ని.. కేసీఆర్ తన ఖాతాలో వేసుకోవడానికి పడ్డతిప్పలు మౌలికంగా ఆయన మోసకారి వ్యక్తిత్వాన్ని తెలియజేసింది. స్వచ్ఛందంగా ఉద్యమించిన నాటి తెలంగాణ ప్రజలను తనవైపు తిప్పుకోవడానికి భారీ బహిరంగ సభల పేరున తానే  కర్త, కర్మ, క్రియ అన్నట్టు వ్యవహరించే ప్రయత్నం చేశారు.

 ఎందుకంటే ఆయన మోకా కోసం దీర్ఘకాలిక వ్యూహంతో అనుసరించిన విధానాలు, ఆచరించిన నమూనాలు అనేక సందర్భాల్లో  బయటపడ్డాయి. అడిగే ప్రతి ఉద్యమకారుణ్ని బయటకు పంపడానికి ఎంతో అవమానించి ఎన్నో రకాలుగా వేధించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. పొమ్మనలేక  కేసీఆర్ పొగ పెట్టిన సంగతి ఇంకా నిజాయితీ గల ఉద్యమకారుల హృదయాలలో అలాగే నిలిచి ఉంది.  ఒకానొక దశలో విసిగిపోయి కేసీఆర్ ప్రారంభంలో మస్కట్ పైరవీలు సిరిసిల్ల కేంద్రంగా పనిచేసిన ఆయన వేషాలను గమనించిన ఈ వ్యాసకర్త అయిన నేను వేదనతో  జయశంకర్ సార్ తో ఒకసారి వేములవాడలో ప్రస్తావిస్తే నేను కొత్తగా ఈ వయసులో ఏమీ చేయలేనని నిస్సహాయతతో అన్నారు. 

దొరహంకార ధోరణితో దుర్మార్గాలు

1300 మంది యువకుల బలిదానాల పుణ్యమా అని అధికారంలోకి వచ్చిన కేసీఆర్​ నాటి ప్రజాసంఘాలను, మీడియాను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు.  బెదిరించి, మేనేజ్ చేసి తెలంగాణ తెచ్చింది మేమేననే అభూత కల్పనలు, అబద్ధాల పునాదులపై అధికారం చేపట్టాడు.  తెలంగాణ సమాజం వీరి వర్గం చేసిన చేస్తున్న దుర్మార్గాలను ఊహించలేకపోయింది. విశేషాలు అనుభవం గడించిన మేధావులు కూడా అంచనా కట్టలేకపోయారు. ప్రజల డబ్బుతో, అధికార దుర్వినియోగంతో ప్రజలకు అందుబాటులో లేకుండా దొరహంకారంతో వ్యవహరించాడు.  ఆయన తీరును తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని విస్మరించాడు.

అధికారం పోయినా బీఆర్​ఎస్​ నాయకులు ఇంకా అధికార అహంకార మత్తులోంచి బయటకు రాలేదు. కాబట్టే అహంకారం ధోరణితో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. పురపాలక సంఘాలలో అవిశ్వాస  తీర్మానాలు కొనసాగుతున్నాయి.  ఇంతకు ముందు అధికారంలో ఉన్న వారి ఆగడాల వలన ఇన్ని రోజులు అణగిమణగి ఉన్నారనే అసలు సారాంశాన్ని వారు విస్మరిస్తున్నారు.

ఏదో అవిశ్వాస తీర్మానాలు పెట్టిస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్​ఎస్​ నాయకులు గతంలో తాము ప్రతిపక్షాల నాయకులపై, శాసనసభ్యులపై వలలు విసిరి తాము అనుసరించిన విధానాలను మరిచిపోయి ఆశ్చర్యకరంగా బెంబేలెత్తిపోతున్నారు. ఊసరవెల్లులు, నక్కలు  మీ తంతును చూసి నివ్వెరపోతున్నాయి. గతంలో మీరు మీ నాయకుడు చేసిన అన్ని విషయాలని తవ్వి మీరే మననం చేసుకుంటే ఇవన్నీ మీరు నేర్పిన విద్యనే అని తేటతెల్లమవుతోంది. బీఆర్ఎస్​  నాయకులు ఇకనైనా కళ్లు తెరవాలి.

తెలంగాణ ప్రజాధనం నిర్వీర్యం

ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించిన అనంతరం ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారంలోకి రాగానే అవలంబించిన తీరు, ఎన్నుకున్న ప్రజల పట్ల ప్రదర్శించిన విపరీతమైన అహంకారం, నిర్లక్ష్యం వహించిన వ్యవహారాలను చూస్తే క్షమించే అర్హతను కూడా కేసీఆర్​ కోల్పోయారు.  నైతికంగా రాజకీయ ఆవు తోలు కప్పుకున్న కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడో కోల్పోయారు. ప్రజలు మిమ్మల్ని తొమ్మిదిన్నర ఏండ్లు భరించడానికి కారణం అవకాశం కోసం ఎదురు చూసిండ్రు తప్ప మరొకటి కాదు.

ఇకపోతే ఇటీవల తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీపైనా  ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల పైన బీఆర్​ఎస్ అధినేత కేసీఆర్​, ఆయన  ఇంటి చిట్కాల ను అందిపుచ్చుకున్న ద్వితీయ శ్రేణి నాయకులు రకరకాలుగా రోజుకో తరీక మాట్లాడుతున్నారు.  మా అమ్మ రాత్రిపూట వండిన అన్నం గిన్నెలో నాలుగు మెతుకులు ఉంచాలిరా ఎందుకైనా మంచిది అని చెప్పేది నాకు. ఇక్కడ అదే విషయం జ్ఞాపకం వస్తున్నది. ఎందుకంటే ఈ తొమ్మిదిన్నర ఏండ్లలో బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ రకరకాల  అభివృద్ధి ప్రాజెక్టులు, పథకాలు రూపొందించి వాటి అమలులో తె లంగాణ మిగులు ధనాన్ని కాజేశారు. తెలంగాణ సంపద గిన్నెలో మెతుకు లేకుండా ఖాళీ చేశారు. కేసీఆర్​ పొంగనాలు పోతుంటే ఊసరవెల్లులు సైతం నవ్వుతున్నాయి.

ALSO READ:  చెప్పు చూపాల్సింది కేసీఆర్​కు.. బాల్క సుమన్​పై చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫైర్

తెలంగాణ సమాజం ఎన్నటికీ క్షమించదు

ఉద్యమ కాలంలో  అవకాశం కోసం ఎదురుచూసి గోతికాడ గుంటనక్కలా కేసీఆర్​ ప్రవర్తించిన తీరు క్షమించరాని నేరంగా తెలంగాణ ప్రజల మనసుల్లో నిలిచిపోయింది.  తొమ్మిదిన్నరేండ్లు తెలంగాణ రాష్ట్ర గీతం లేకుండా, ప్రజలలో విస్తృతంగా ఉన్న గీతాన్ని  గుర్తించకుండా కాలం వెళ్లబుచ్చిన తీరు శోచనీయం. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికే పెద్ద మచ్చగా మిగిలిపోయింది. 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్  తెలంగాణ వ్యతిరేకులతో మంత్రి వర్గాన్ని నింపి, తెలంగాణేతర కాంట్రాక్టర్లకు పెద్దపీట వేశాడు. దీంతో తెలంగాణ ప్రజలలో ఉన్న సెల్ ఫోన్లలోని తెలంగాణ ఆత్మగౌరవ రింగ్​ టోన్లు మెల్లమెల్లగా  మాయమయ్యాయి. మిగులు సంపదపై కన్నేసిన కేసీఆర్  తెలంగాణ ఉద్యమకారులను క్రమక్రమంగా అవమానించి బయటకు పంపించాడు. ఆయన తీరును తెలంగాణ ప్రజలు, మేధావిలోకం మర్చిపోయిందనుకుంటే  మూర్ఖత్వమే.  కేసీఆర్, బీఆర్ఎస్​ నాయకులు​ తమ తీరును మార్చుకోకుంటే ఇక దేవుడు కూడా కాపాడలేడు.  మిమ్మల్ని, మీ కుటుంబాన్ని తెలంగాణ సమాజం ఎన్నటికీ క్షమించదు గాక క్షమించలేదు. 

- జూకంటి జగన్నాథం,  కవి, రచయిత