మళ్లీ సోమేశ్ పెత్తనం! ఆయన చెప్పినోళ్లకే బదిలీల్లో ప్రాధాన్యం 

మళ్లీ సోమేశ్ పెత్తనం! ఆయన చెప్పినోళ్లకే బదిలీల్లో ప్రాధాన్యం 

మళ్లీ సోమేశ్ పెత్తనం!
ప్రతి వ్యవహారంలోనూ ఆయన మార్క్ 
ఆయన చెప్పినోళ్లకే బదిలీల్లో ప్రాధాన్యం 
సీఎస్ కు వెళ్లేది సమాచారం మాత్రమే?
ధరణి, లిక్కర్, కమర్షియల్ టాక్స్ సార్ కంట్రోల్ లోకే!

హైదరాబాద్ : రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో మాజీ సీఎస్ సోమేశ్ పెత్తనం మళ్లీ మొదలైంది.  ప్రభుత్వ కార్యక్రమాల్లో.. అధికారుల బదిలీలు, ఇతర నిర్ణయాల్లో ఆయన మాటనే చెల్లుబాటు అయ్యేలా చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. రాష్ట్ర పరిపాలన వ్యవహారాలు , సెక్రెటేరియేట్ నిర్ణయాల్లో సీఎస్ కు సమాచారం ఇచ్చి.. తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా ముందు ఆయన వద్దకే వెళ్తున్నాయని సమాచారం. ఆయన ఓకే అంటేనే ఫైల్ ముందుకు కదులుతోందని తెలుస్తోంది. సారు వద్దంటే ఆ ఫైలు పక్కన పెట్టేయాల్సిందేనని సెక్రటరీ స్థాయి అధికారులే చెబుతున్నారు.

మూడేళ్లకు పైగా లాంగ్ స్టాండింగ్ ఉండి, ఎన్నికలతో  ప్రమేయం ఉన్న అధికారులను బదిలీ చేయాలని ఇటీవలే ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే.  ఏ కలెక్టర్ ను ఎక్కడికి బదిలీ చేయాలి..? ఆ స్థానంలో ఎవరిని నియమించాలి.. అదనపు కలెక్టర్లుగా ఎవరుంటే లాభం..? ఏ డివిజన్ లో ఏ ఆర్డీవో ఉంటే లాభం.. ఏ తహసీల్దార్  చెబితే వింటారు..? అనే అంశాలపై  సీఎంవో సెక్రటరీ, ఒక మంత్రి , సీఎం ముఖ్య సలహాదారు మాత్రమే చర్చించి ప్రతిపాదనలు రెడీ చేసినట్లు  తెలిసింది. సీఎస్ తో పాటు సంబంధిత శాఖల సెక్రటరీలు , హెచ్ వోడీల ఒపీనియన్ కూడా తీసుకోకుండానే అంతా సోమేశ్ చెప్పినట్లుగానే ఆ ఫైల్ సిద్దమైనట్లు సమాచారం. సీఎస్ గా సోమేశ్ వెళ్ళిపోయాక హమ్మయ్యా..? అంటూ ఊపిరి పీల్చుకున్న వారంతా ఇదెక్కడి ఖర్మరా బాబూ.. అంటూ ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు.  

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఇష్యూలోనూ..

ఇటీవల తమ సర్వీసులను రెగ్యులర్ చేయాలంటూ జూనియర్ పంచాయతీ సెక్రటరీలు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. వచ్చిన వెంటనే ఈ ఇష్ష్యు ని తానే డీల్ చేస్తానని రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ విషయం లోనూ సోమేశ్ తన నిర్ణయాన్నే అమలు అయ్యేలా చూశారు.  నిర్దేశించిన టైం లో విధుల్లో జాయిన్ కాకుంటే కొత్తవారిని నియమిస్తామని బెదిరింపులకు పాల్పడటం ఆయన ఆలోచననేనని కొందరు ఉన్నతాధికారులు అంటున్నారు. సీఎస్ తో సహా ఇతర ఉన్నతాధికారులు వేరే పరిష్కార మార్గం ఆలోచించినా.. ఈ విషయాన్నీ తానే డీల్ చేస్తానని సీఎం కు చెప్పానంటూ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. 
 
ధరణి..లిక్కర్ , కమర్షియల్ టాక్స్ లోను జోక్యం ?

సోమేశ్ సీఎస్ కాకముందు ఏయే శాఖల బాధ్యతలు చూశారో.. వాటన్నింటినీ మళ్లీ తన కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు. ఆయా శాఖల రిపోర్టులు అడగడం, వివరాలు తెప్పించుకోవడం, సంబంధిత సెక్రటరీలకి తెలియకుండానే ఆదేశాలు ఇవ్వడం చేస్తున్నారని చర్చ సచివాలయంలో జోరుగా సాగుతున్నది. ఆయన "సీఎం ముఖ్య సలహాదారు కావొచ్చు కానీ మాకు సమాచారం ఇవ్వాలి గా.. హెచ్ వోడి తెలియకుండా చేయడం సరికాదు.. ఇంకా సీఎస్ అనుకుంటున్నారేమో అయన " అని ఒక ఉన్నతాధికారి ఆవేదన వ్యక్తం చేశారు.