ప్రగతి భవన్ దగ్గర్లోనే ఉంది.. ఏనుగు ఎక్కి పోదాం

 ప్రగతి భవన్ దగ్గర్లోనే ఉంది.. ఏనుగు ఎక్కి పోదాం
  • బానిసలుగా ఉంటారా..? పాలకులు అవుతారా..? మీదే నిర్ణయం
  • మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
  • నల్లగొండలో బీఎస్పీ 'రాజ్యాధికార సంకల్ప సభ' 
  • పార్టీలో చేరి రాష్ట్ర కోఆర్డినేటర్ బాధ్యతలు చేపట్టిన ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

నల్గొండ: స్వచ్ఛందంగా తరలివచ్చిన మీ ఉత్సాహం చూస్తుంటే.. ప్రగతి భవన్ దగ్గర్లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఎనుగు ఎక్కి ప్రగతి భవన్ కు పోదాం.. బానిసలుగా ఉంటారా..? పాలకులు అవుతారా..? మీదే నిర్ణయం అని మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నల్లగొండలో ఆదివారం సాయంత్రం బహుజన సమాజ్ వాదీ పార్టీ 'రాజ్యాధికార సంకల్ప సభ' కు ప్రజలు భారీగా తరలివచ్చారు. బీఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు శ్రీరాంజీ గౌతమ్ ముఖ్య పరిశీలకునిగా హాజరయ్యారు. 
ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీలో చేరి రాష్ట్ర కోఆర్డినేటర్ బాధ్యతలు చేపట్టిన ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రజలనుద్దేశించి ఒకింత ఉద్వేగంగా మాట్లాడారు. మీరు ఇంకా బానిసలు గానే ఉంటారా.. ?  పాలకులుగా.. మారుతారా అంటూ ప్రశ్నించిన ప్రవీణ్ కుమార్..  ఏనుగు ఎక్కి ప్రగతి భవన్ పోవాలి..  ఏనుగు ఎక్కి ఎర్రకోటలో నీలి జెండా ఎగురవేయాలని కోరారు. లక్షలాది మంది పేదల గొంతుక గా మారేందుకే వచ్చానని ఆయన స్పష్టం చేశారు. బంగారు తెలంగాణలో కొందరి బతుకులు మాత్రమే బాగు పడ్డాయని, నాలాగా లక్షల మంది బిడ్డలను చైతన్యం చేయడానికి సోషల్ వెల్ఫేర్ కు వచ్చానని అన్నారు. గత తొమ్మిదేళ్ల కాలంలో ఎంతో చేశానని తెలిపారు. 
బహుజన రాజ్యంతోనే న్యాయం జరుగుతుందని పేర్కొన్న ప్రవీణ్ కుమార్.. ఊరు అవతల ఉండే వీళ్లకు ఏం చేతకాదు అని ఎద్దేవా చేసిన వాళ్లకు సమాధానంగా ఒక దళిత బిడ్డ ఎవరెస్ట్ శిఖరం ఎక్కి బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ ఎగరేసేలా చేశానన్నారు. 
తెలుగే సరిగ్గా రాదు ఇంగ్లీష్ వస్తదా అని ఎగతాళి చేసిన వాళ్లకు.. విదేశాల్లో మన బిడ్డల చదువులే నిదర్శనం అన్నారు. కరోనా సమయంలో పేద దళిత బిడ్డలకోసం ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో చదువులు చెప్పిస్తుంటే.. కేంద్రం ప్రభుత్వం నుంచి ఒత్తిడి తెచ్చి రాత్రికిరాత్రి ఆ పిల్లలను ఇంటికి వెళ్లగొట్టారని, నన్ను ఏమీ చేయనీయకుండా చేతులు కట్టేసి.. కేసులు బనాయించి వెనక్కి నెట్టే కుట్ర జరుగిదని,  అది తెలిస్తే బయటికి వచ్చానని ప్రవీణ్ కుమార్ తెలిపారు. 
సంక్షేమ పథకాలు, దళిత బంధు పైసలు ఎవరివి..?
సంక్షేమ పథకాలు, దళిత బంధు పైసలు ఎవరివి..  మావి కాదా..? పేద పేద బడుగు బలహీనవర్గాల కష్టపడిన సొమ్ము తోనే కేసీఆర్ విచ్చలవిడిగా దుబారా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. మీ సొంత ఆస్తులను అమ్మి ఖర్చు పెట్టండి చూద్దాం అని ఆయన సవాల్ చేశారు. బహుజన రాజ్యం సాకారమయ్యే కల దగ్గరలోనే ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొక్కుబడిగా విద్యా వ్యవస్థ పై ఖర్చు పెడుతుందని, మొత్తం 60 లక్షల మంది విద్యార్థుల్లో కేవలం ఆరు లక్షల మంది మాత్రమే గురుకులాల్లో పూర్తిస్థాయి బోధన జరుగుతోందన్నారు. అనురాగ్ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీలకు సపోర్ట్ చేస్తున్న ప్రభుత్వం ఏ వర్గాల కోసం పాటు పడుతుందో చెప్పాలన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు మా హక్కు అని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. గత ఏడేళ్ల లో ఎన్ని ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు వదిలారు..? అని ఆయన ప్రశ్నించారు. 
ముఖ్యమంత్రి కేసీఆర్ మాయమాటలకు చరమగీతం పాడే రోజు దగ్గరర్లోనే ఉంది
సీఎం కేసీఆర్ మాయమాటలకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందని మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. 52 శాతం ఓబిసి జనాభా వున్న దేశంలో ఒకే ఒక్కడికి భారత రత్న ఇచ్చారని, జనాభా దామాషా ప్రకారం అధికారంలోనూ వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బహుజన రాజ్యం లో ప్రతి మండలానికో అంతర్జాతీయ స్థాయి పాఠశాల ఏర్పాటు చేస్తామని, బహుజన రాజ్యంలో చైనాతో పోటీ పడే ది మనమే అన్నారు. బహుజన రాజ్యంలో ఉన్నత చదువులతో పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి లక్షల మందికి ఉపాధి మార్గం చూపెడతామన్నారు. ఆఖరికి సుప్రీం కోర్టులో ఎస్సీ ఎస్టీ బిసి వర్గాలకు చెందిన న్యాయమూర్తి ఒక్కరు కూడా లేరని, ఇలా అయితే మాకు న్యాయం ఎలా జరుగుతుందన్నారు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 
బహుజన రాజ్యం అంత ఈజీగా రాదు
బహుజన రాజ్యం అంత ఈజీగా రాబోదని.. దీని కోసం ఉమ్మడిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. దశాబ్దాలుగా మనల్ని మోసం చేస్తూ వస్తున్న పార్టీలు మనల్ని పైకి లేవకుండా ఎన్నో కుట్రలు చేసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. మీరు ఇంకా బానిసలు గానే ఉంటారా..?  పాలకులుగా మారుతారా.. అంటూ ప్రశ్నించిన ప్రవీణ్ కుమార్.. కారు కింద పడతారా.. ఏనుగు ఎక్కి పోతారా..? ఏనుగు ఎక్కి ప్రగతి భవన్ పోవాలి.. ఏనుగు ఎక్కి ఎర్రకోటలో నీలి జెండా ఎగురవేయాలని ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. 
అంబేడ్కర్ కలలు కన్న రాజ్యం తెలంగాణ నుండే మొదలవుతుంది 
అంబేడ్కర్ కలలు కన్న రాజ్యం తెలంగాణ నుండే మొదలవుతుందని బీఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు శ్రీరాం జీ గౌతమ్ అన్నారు. నల్గొండ బీఎస్పీ ర్యాలీ లో ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. బీఎస్పీ అంటే బహుజన రాజ్యం కోసం పుట్టిన పార్టీ అని, బీఎస్పీ బహుజన రాజ్యం కోసం మహా సంగ్రామమే సృష్టిస్తోందని ఆయన పేర్కొన్నారు. బహుజన సమాజ్ పార్టీ  నల్గొండ నుండి సమర శంఖం పూరిస్తోందని, బహుజన సమాజ్ పార్టీ సకల జనుల పార్టీ అన్నారు. దేశంలో విద్యావ్యవస్థ పేద వారికి అందుబాటులో లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2023 లో దేశంలో బహుజన రాజ్యం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బహుజన సమాజం కోసం ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అత్యున్నతమైన ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టివచ్చారని.. అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ను తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ గా ప్రకటిస్తున్నా అని తెలిపారు.