- ట్రేడింగ్ చిట్కాలు ఇస్తామంటూ వాట్సాప్ మెసేజ్
- వారి సూచనల మేరకుయాప్ డౌన్‌లోడ్
- డిసెంబర్ 24 నుంచి ఈ నెల 5 వరకు నగదు బదిలీ
- మోసపోయానని గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: ఓ మాజీ ఐపీఎస్ అధికారి భార్య సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి ఏకంగా రూ.2.58 కోట్లు కోల్పోయారు. వాట్సాప్ ట్రేడింగ్ గ్రూపులో చేరిన ఆమె నిలువునా మోసపోయారు. -ట్రేడింగ్ చిట్కాలు ఇస్తామంటూ సైబర్‌నేరగాళ్లు.. ఆమె నంబర్‌కు వాట్సాప్ మెసేజ్పంపడంతో ఈ వ్యవహారం మొదలైంది. యాప్డౌన్లోడ్చేసుకున్న ఐపీఎస్భార్య.. తన భర్తను వాట్సప్గ్రూపులో చేర్చారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 24 నుంచి ఈ నెల 5 వరకు నగదు బదిలీ చేశారు. చివరకు మోసపోయానని గుర్తించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది.
అలా గ్రూపులో చేరి..
కేంద్ర దర్యాప్తు సంస్థలో సేవలందించిన సదరు ఐపీఎస్ అధికారి కుటుంబం బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటోంది. ఆయన భార్య(51)కు నవంబర్ చివరి వారంలో, షేర్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్పేరుతో వాట్సాప్ మేసేజ్ వచ్చింది. ఈమె రెస్పాండ్కావడంతో సైబర్‌నేరగాళ్లు రంగంలోకి దిగారు. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఆమెకు సాంకేతికంగా ప్రావీణ్యం లేకపోవడంతో.. ఆమె తరపున గ్రూప్‌లో చేరమని తన భర్తను కోరారు. దీంతో ఆయన నవంబర్ 29న ‘స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ 20’ అనే వాట్సాప్ గ్రూప్‌లో చేరారు. అదే గ్రూపులో దాదాపు 167 మంది సభ్యులు ఉన్నారు. ఆ తర్వాత దినేష్ సింగ్ అనే పేరుతో గల మొబైల్ నంబర్ ద్వారా గ్రూప్‌లో ట్రేడింగ్ వివరాలను వెల్లడించడం ప్రారంభించారు. కొన్ని స్టాక్‌లను సిఫార్సు చేశారు. గ్రూప్ సభ్యులు ఈ స్టాక్‌లు మంచి లాభాలను ఇస్తున్నాయంటూ గ్రూప్‌లో మెసేజ్‌లు పెట్టడంతో పాటు స్క్రీన్‌షాట్‌లను పోస్ట్ చేయడం ప్రారంభించారు.
ఏడాదికి 500 శాతం లాభాలంటూ ఆశ చూపి..
‘ది వెల్త్ అలయన్స్’ అనే ట్రేడింగ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని సైబర్ నేరగాళ్లు సూచించారు. స్టాక్ మార్కెట్‌లో 500శాతం కంటే ఎక్కువ వార్షిక రాబడి వస్తుందని నమ్మించారు. ఈ క్రమంలోనే క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (క్యూఐబీ) పేరున https://barrazacarlos.com/dr-dinesh-singh అనే లింక్‌ను పంపించారు. లింక్‌లో ఐఐటీ బొంబై గ్రాడ్యుయేట్‌గా, అమెరికాలోని వార్టన్ నుంచి పీహెచ్‌డీ పొందిన వ్యక్తిగా, జేపీ మోర్గాన్‌లో 6 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఆస్తులను సంపాదించినట్లుగా మాజీ ఈక్విటీ విశ్లేషకుడిగా వర్ణించుకున్నారు. ఆ తర్వాత ‘వెల్త్ అలయన్స్ ఇంటర్న్‌షిప్ టీమ్’లో 5 నుంచి 6 వారాలలోపు సుమారు 200 శాతం రాబడులు ఇస్తామని హామీ ఇచ్చారు.
రూ.2.58 కోట్లు పెట్టుబడి.. రూ.10 లక్షలు మాత్రమే విత్‌డ్రా
డిసెంబర్ 24న రూ.లక్షతో మొదలుపెట్టి అత్యధికంగా రూ.50 లక్షల చొప్పున.. జనవరి 5 నాటికి మొత్తం రూ.2.58 కోట్లు సైబర్ నేరగాళ్ల అకౌంట్లలో మాజీ ఐపీఎస్ కుటుంబం జమ చేసింది. ఇందులో కేవలం రూ.10 లక్షలు మాత్రమే తిరిగి విత్‌డ్రా చేసుకున్నారు. కాగా,ప్రతిరోజూ వివిధ బ్యాంకులకు చెందిన వేర్వేరు కరెంట్ ఖాతా నంబర్లను అందిస్తున్నారని మాజీ ఐపీఎస్ తన భార్యను పలుమార్లు హెచ్చరించారు. ఆ ఖాతాలు చాలా అనుమానాస్పదంగా కనిపించాయి. దీంతో ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ గురించి ఆన్‌లైన్‌లో సెర్చ్ చేశారు. ఇలాంటి వాట్సాప్ గ్రూపుల ట్రేడింగ్ మోసాలను గుర్తించి, డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నం చేశారు. కానీ సైబర్ నేరగాళ్లు అవకాశం ఇవ్వలేదు. దీంతో వెంటనే 1930 తో పాటు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఈ నెల 6న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
భర్త హెల్ప్‌తో ట్రేడింగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని
ట్రేడింగ్ కోసం ప్రత్యేక డీమ్యాట్ ఖాతా తెరవాల్సిన అవసరం లేదని సైబర్ నేరగాళ్లు తెలిపారు. ఇలా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కిన ఆమె.. భర్త సహాయంతో ఆపిల్ యాప్ స్టోర్ నుంచి "MCKIEY CM" అనే అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసి ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేశారు. డిసెంబర్ 24 నుంచి పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. తన బ్యాంకు ఖాతా నుంచి, భర్త ఖాతాకు అక్కడి నుంచి గ్రూప్‌లో ఇచ్చిన సూచనల ప్రకారం మెకిన్లీ ట్రేడింగ్ ఖాతాకు డబ్బు బదిలీ చేశారు. ఇలా డిసెంబర్ 24 నుంచి జనవరి 5 వ తేదీ వరకు సుమారు రూ.2.58 కోట్లు పంపించారు. ఇందుకుగాను ట్రేడింగ్ పోర్టల్‌లో రూ.2 కోట్ల లాభాలు వచ్చినట్లు చూపించారు. ఆ తర్వాత రూ.20 లక్షల కంటే తక్కువ పెట్టుబడులు ఉన్నవారిని ఒక టీమ్‌గా.. ఎక్కువ పెట్టుబడి పెట్టేవారికి మరో టీమ్ పేరుతో “క్లోజ్డ్ డోర్ డిసైపుల్ టీమ్” అనే గ్రూపులో చేర్చారు. ఈ టీమ్‌లో చేర్చిన వారి నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేయడం టార్గెట్‌గా పెట్టుకున్నారు.
