
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ఖలీల్ బాషా అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఖలీల్ బాషాకు కొన్ని రోజుల క్రితం కరోనా సోకింది. దాంతో ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత కరోనా నెగిటివ్ రావడంతో ఆయన డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారు. కాగా.. రెండు రోజుల క్రితం ఆయనకు హర్ట్ అటాక్ వచ్చింది. దాంతో మళ్లీ ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. అయితే ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలోనే చనిపోయారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఖలీల్ బాషా అంత్యక్రియలు బుధవారం కడప జిల్లాలో జరగనున్నాయని ఆయన కుటుంబీకులు తెలిపారు.
ఖలీల్ బాషా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మంత్రి వర్గంలో మైనార్టీ శాఖ మంత్రిగా పని చేశారు. టీడీపీ హాయాంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన రాజకీయాలలోకి రాకముందు వైద్య నిపుణుడిగా జిల్లా ప్రజలందరికీ సుపరిచితుడు. పేదలకు ఎలాంటి ఫీజు లేకుండా వైద్య సేవలు చేశారని గుర్తింపు ఉంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత .. 2019 ఫిబ్రవరి 5న టీడీపీకి గుడ్ బై చెప్పి, సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఖలీల్ బాషా మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు ఆయన కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
For More News..