
హైదరాబాద్, వెలుగు : మాజీ సైనికుడు మల్లేశ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను మంత్రి జూపల్లి కృష్ణారావు తన పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టారని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. నిందితుడిని కాపాడుతున్నారు కాబట్టే మృతుడి కుటుంబాన్ని మంత్రి పరామర్శించలేదని ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి మీడియాతో మాట్లాడారు. హత్యకు గురైన మాజీ సైనికుడి కుటుంబాన్ని మంత్రి జూపల్లి ఎందుకు పరామర్శించలేదో చెప్పాలన్నారు. మల్లేశ్ కుటుంబ సభ్యులు రెండు వారాల క్రితం డీజీపీని కలిసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ పై మంత్రి అనవసరమైన వ్యాఖ్యలు చేశారని తెలిపారు.