ఎల్బీనగర్, వెలుగు: బీజేపీకి రాష్ట్రంలో ఆదరణ లేదని, నడ్డా సభకు కనీసం 2 వేల మంది జనం కూడా లేక వెలవెల పోయిందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఎద్దేవా చేశారు. శనివారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సభలో నడ్డా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన విమర్శలపై ఎల్బీనగర్‌లో మాట్లాడారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణకు తెచ్చింది ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. మొదటిసారి పర్యాటక మంత్రిగా, రెండో సారి బొగ్గు గనుల శాఖ మంత్రిగా తెలంగాణకు కిషన్ రెడ్డి ఏం తెచ్చాడో చెప్పాలన్నారు. బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ అని, మూసీ నిద్ర అంటూ కూలర్లు పెట్టుకుని పడుకుని దొంగ దీక్షలు చేశారన్నారు.