లోక్ సభలో సభ్యుడు కాదు..  అయినా ప్రధాని అయ్యారు మన పీవీ

లోక్ సభలో సభ్యుడు కాదు..  అయినా ప్రధాని అయ్యారు మన పీవీ

ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా పేరు పొందిన PV నరసింహరావుకు అత్యున్నత పురస్కారం భారత రత్నను వరించింది. 1990 దశాబ్ధంలో భారత దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన గొప్ప ఘనుడు మన తెలుగు వాడే కావడం విశేషం.  నిరాడంబరమైన సాధారణ జీవన శైలి ఈయన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి వంటి గొప్ప పదవుల్లో నిలిపింది. పాములపర్తి వెంకట నరసింహా రావు 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో రుక్నాభాయి, సీతారామరావులకు జన్మించారు. 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ లో చేరి స్వతంత్రోద్యమంలో.. నిజాం రాజుకు వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఉమ్మానియా యూనివర్సిటీలో వందేమాతరం ఉద్యమంలో పాల్గొనడంతో బహిష్కరణకు గురయ్యారు.  ఆ సమయంలో ఆయన నాగ్ పూర్ యూనివర్సిటీ నుంచి లా చదివి ఉత్తీర్ణులైయారు. 17 భాషల్లో అనర్ఘళంగా మాట్లాడగలరు. 1968లో సహస్రఫణ్ అనే  ఓ అనువాదాన్ని కూడా రాశారు.

రాయకీయాల్లో రారాజు

పీవీ రాజకీయ జీవితాన్ని  జర్నలిస్ట్ గా ప్రారంభి.. తర్వాత ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రిగా ఎదిగారు. పలు శాఖలకు మంత్రిగా చేశారు. కాకతీయ అనే పత్రికను నడిపి.. జయ అనే పేరుతో వివిధ రచనలు చేశారు. బుర్గుల రామకృష్ణ రావు సహకారంతో రాజకీయాల్లోకి వచ్చి, మర్రి చెన్నారెడ్డి,  శంకరరావు చవాన్, వీరేంద్ర పాటిల్ లతో కలిసి పని చేశారు. మొదటి సారి మంథని నియోజకర్గం నుంచి 1957 నుంచి వరసగా నాలుగు సార్లు  అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1962 లో మొదటిసారి మంత్రి అయ్యారు. 1971 సెప్టెంబరు 30న ఉమ్మడి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భూ గరిష్ట పరిమితి చట్టాన్ని తీసుకురావడం, ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు చేయడం ఆయనకు చాలా పేరు తెచ్చిపెట్టాయి.
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముల్కీ నిబంధన కోర్టు తీర్పుతో తెలంగాణ ఉద్యమం తీవ్రమైంది.  జై ఆంధ్ర ఉద్యమం కూడా పీవీ కాలంలోనే జరిగింది. ఆంధ్ర, తెలంగాణ రాజకీయ సంక్షోభం కారణంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రవేశ పెట్టారు. 1973  జనవరి 18న ఇంధిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు రాష్ట్రపతి పాలన విధించారు.

లోక్ సభలోకి ప్రవేశం...

హన్మకొండ నుంచి లోక్ సభలో అడుగుపెట్టారు.  1980 నుంచి 1989 మధ్య కాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖలను వివిధ సమయాల్లో నిర్వహించారు. 1991 పార్లమెంట్ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన.. రాజకీయ సన్యాసం తీసుకున్నారు. రాజీవ్ గాంధీ హత్యగావించబడ్డ తర్వాత పీవిని ప్రధాని అధిష్ఠానం నిర్ణయించింది.  పార్లమెంట్ లో లేని పీవీని అప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని నంధ్యాల లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 

ఆర్థిక సంస్కరణలు

రూపాయి విలువ పడిపోతుంది, దేశంలో పెట్టుబడులు లేవు. కరువు కాలం మిగిల్చిన కష్టకాలంలో దేశం ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. అందరూ చేతులెత్తేశారు. అలాంటి  టైంలో ప్రధాని బాధ్యతలు స్వీకరించిన పీపీ ఒకడుగు ముందేసి ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ అనే అంశాలను భారత ఆర్థిక వ్యవస్థకు పరిచయం చేశారు. అనేక విదేశీ పెట్టబడులకు స్వాగతం పలికారు. పీవీ నరసింహా రావుని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా చెప్పుకుంటారు. మంచి ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ ని ఆర్థిక శాఖ మంత్రిని చేసి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించారు.