ఎంసెట్ అభ్యర్థులకు సెంటర్ల తిప్పలు

ఎంసెట్ అభ్యర్థులకు సెంటర్ల తిప్పలు
  • జిల్లాల ‘ఎంసెట్’ ​సెంటర్లన్నీ బ్లాక్​.. హైదరాబాదే దిక్కు

  • మార్చి నెలాఖరు నాటికే జిల్లాల్లోని సెంటర్లకు సరిపడా ఎంసెట్ ​అప్లికేషన్లు

హైదరాబాద్, వెలుగు:  ఎంసెట్ అభ్యర్థులకు సెంటర్ల తిప్పలు తప్పడం లేదు. సర్కారు నిర్ణయించినంత ఫీజును చెల్లిస్తున్నా.. వారివారి జిల్లాల్లోని సెంటర్లలో ఎగ్జామ్​ రాసుకునే అవకాశం దక్కడం లేదు. ఎంసెట్​కు భారీగా అప్లికేషన్లు వస్తున్నా.. వాటికి అనుగుణంగా జిల్లాల్లో సెంటర్ల సంఖ్యను పెంచడంపై ఎంసెట్, ఉన్నత విద్యాశాఖ అధికారులు దృష్టి పెట్టకపోవడం ఈ సమస్యకు దారితీస్తోంది. మార్చి 3న ఎంసెట్​కు దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. మార్చి నెలాఖరులోపే జిల్లాల్లోని ఎంసెట్ ​ఎగ్జామ్​ సెంటర్లకు సరిపడా అప్లికేషన్లు వచ్చాయి. దీంతో అప్పట్లోనే ఎంసెట్ అప్లికేషన్లు స్వీకరించే పోర్టల్​లో చాలా జిల్లాల ఎగ్జామ్​ సెంటర్లను బ్లాక్ ​చేశారు. గత వారం, పది రోజులుగా సిటీ పరిధిలోని మాత్రమే ఎగ్జామ్​ సెంటర్స్​ కనిపిస్తున్నాయి. దీనిపై స్టూడెంట్స్, పేరెంట్స్ మండిపడుతున్నారు. జిల్లాల్లో ఎంసెట్​ రాసే చాన్స్ లేకుండా చేయడంపై  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తులకు అనుగుణంగా జిల్లాల్లో ​సెంటర్లను పెంచి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. జిల్లాల నుంచి హైదరాబాద్​కు రావడం, ఇక్కడ ఒకరోజు ఉండటం ఖర్చుతో కూడుకున్న పని అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

గత్యంతరం లేక సిటీలో ఎగ్జామ్ రాసేందుకు.. 

లేట్​ ఫీజు లేకుండా ఎంసెట్​కు అప్లై చేసుకునే గడువు ఏప్రిల్​10తో ముగిసింది. ఆ తర్వాతి నుంచి అప్లై చేసుకునే వారికి ఆయా జిల్లాల్లోని ఎగ్జామ్​ సెంటర్ల ఆప్షన్లు చాలావరకు కనిపించలేదు. ఇప్పుడు  రూ.2,500 ఫైన్​తో అప్లై చేసుకునే అవకాశం ఈ నెల 25 వరకు, రూ.5 వేల ఫైన్​తో మే 2 వరకు ఉంది. హైదరాబాద్​లోని 4 జోన్లకుగానూ 2 జోన్ల పరిధిలో చాలా సెంటర్లను ఇప్పటికే బ్లాక్ చేశారు. దీంతో నాగోల్, హయత్ నగర్​, ఇబ్రహీంపట్నం, ఎల్ బీనగర్, శంషాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీ ఏరియాలతో పాటు హయత్ సాగర్, మొయినాబాద్​, గండిపేట, బాచుపల్లి, కూకట్​పల్లి, షేక్ పేటల్లో పరీక్షలు రాసేందుకు చాన్స్ లేకుండా పోయింది. నల్గొండ, కోదాడ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్, హనుమకొండ, నర్సంపేట సహా పలు ప్రాంతాల్లోని సెంటర్లనూ బ్లాక్ చేశారు. దీంతో చాలామంది విద్యార్థులు హైదరాబాద్​లోనే పరీక్షలు రాసుకునేందుకు ఆప్షన్స్ ఇచ్చారు.  

కొత్త సెంటర్లు కూడా హైదరాబాద్​లోనే..

 ఎంసెట్ సెంటర్లన్నీ దాదాపు ఇంజినీరింగ్ కాలేజీల్లోనే పెడుతున్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని అయాన్ డిజిటల్ సెంటర్లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం చాలా జిల్లా కేంద్రాల్లో ఈ సెంటర్లు లేవు. ఒక సెషన్​లో  25 వేల మంది పరీక్ష రాసేందుకే టీసీఎస్ ఏర్పాట్లు  చేస్తోందని అధికారులు చెప్తున్నారు. గతేడాది తెలంగాణలో 89  ఎగ్జామ్ సెంటర్లు ఉండగా, ఈసారి మరో పది సెంటర్లు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త  సెంటర్లు కూడా హైదరాబాద్​లోనే పెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వివిధ జిల్లాల అభ్యర్థులు స్థానికంగా ఎగ్జామ్​ రాసుకునే అవకాశాన్ని కోల్పోయారు. జిల్లాల్లో అదనంగా ఎగ్జామ్​ సెంటర్స్​ ఏర్పాటు చేసే పరిస్థితి లేకుంటే.. అదనంగా మరో ఒకటి, రెండ్రోజుల పాటు ఎంసెట్​ నిర్వహించేలా ప్లాన్​ చేస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. మరోపక్క ఈసారి ఎంసెట్ ఫీజు పెంచారు. జనరల్, బీసీ స్టూడెంట్లకు రూ.900 ఫీజు వసూలు చేస్తున్నారు. కనీసం బీసీ స్టూడెంట్లకు ఫీజు మినహాయింపు ఇవ్వలేదు. 

భారీగా అప్లికేషన్లు.. 

వచ్చే నెల 10, 11 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్​కు, 12, 13, 14 తేదీల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్​కు ఎంసెట్ ఎగ్జామ్స్​ జరగనున్నాయి.  వీటికి ఇప్పటికే 3,18,561 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజినీరింగ్​కు 2,03,872 మంది, అగ్రికల్చర్​కు 1,14,322 మంది, రెండింటికీ 367 మంది అప్లై చేశారు.  రాష్ట్రం ఏర్పడ్డాక ఇంత భారీ సంఖ్యలో ఎంసెట్​అప్లికేషన్లు రావడం ఇదే తొలిసారి.  ఎంసెట్ ఎగ్జామ్ నిర్వహణకు తెలంగాణలో 16 జోన్లు, ఏపీలో 5 జోన్లు ఏర్పాటు చేశారు.