ఏడాది తర్వాత ఉద్యోగాలు.. సింగరేణిలో తీరనున్న జూనియర్​ అసిస్టెంట్ల కొరత

ఏడాది తర్వాత ఉద్యోగాలు..  సింగరేణిలో తీరనున్న  జూనియర్​ అసిస్టెంట్ల కొరత

కోల్​బెల్ట్, వెలుగు : జాబ్​ సెలెక్షన్​ కోసం పరీక్షలు పెట్టిన ప్రతిసారీ సింగరేణి అభాసుపాలవుతోంది. ఏడాది కిందట జూనియర్​ అసిస్టెంట్​ ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఫలితాలు నిలిపివేశారు. ఎట్టకేలకు పరీక్షల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో పరీక్షలు రాసి అర్హత సాధించిన అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. 

177 పోస్టుల భర్తీ కోసం పరీక్షలు

సింగరేణి సంస్థలో 2014లో 450 క్లరికల్​ ఉద్యోగాలు భర్తీచేసిన యాజమాన్యం ఆ తర్వాత కొత్త నియామకాలు చేపట్టలేదు. నిరుడు జూన్​లో 177 జూనియర్​ అసిస్టెంట్​ ఉద్యోగాల భర్తీకి  ఎక్స్​టర్నల్​(బయటివారు) అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్​ జారీ చేసింది. ఈ పరీక్షకు 1.02 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎక్స్​టర్నల్​ ఉద్యోగాల్లో సింగరేణి విస్తరించిన మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాది కొత్తగూడెం జిల్లాలకు చెందిన  90 శాతం ఉద్యోగాలను స్థానికులకు కేటాయించారు. నిరుడు సెప్టెంబర్​ 4న పరీక్షలు రాసేందుకు 98,880 మంది అభ్యర్థులకు యాజమాన్యం హాల్​టికెట్లు జారీ చేసింది. 77,907 మంది పరీక్షలు రాయగా 49,328 మంది అర్హత సాధించారు.  

ఏడాది పాటు ఫలితాలు నిలిపివేత

జూనియర్​ అసిస్టెంట్​ పోస్టుల భర్తీ కోసం గత ఏడాది సెప్టెంబర్​ 4న జేఎన్టీయూ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలపై కొందరు అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టును ఆశ్రయించారు. వారి అభ్యర్థనను విచారించిన సింగిల్​ జడ్జి బెంచ్.. రాత పరీక్షలను రద్దుచేసి తిరిగి నిర్వహించాలని ఆదేశించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ సింగరేణి దాఖలు చేసిన అప్పీలుపై న్యాయమూర్తులు జస్టిస్ట్​ అభినంద్​కుమార్​ షావిలి, జస్టిస్​ అనిల్​ కుమార్​ జూకంటిల ధర్మాసనం విచారణ చేసింది. సింగరేణి తరపున సర్కారు ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్​కుమార్​ వాదనలు వినిపించారు. ఏడాది కాలం పాటు  విచారణ సాగింది. పరీక్షలను జేఎన్టీయూ పకడ్బందీగా నిర్వహించిందని, పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రభుత్వం నియమించిన న్యాయవాది పేర్కొన్నారు. సుమారు 70 వేల మంది పరీక్షలు రాయగా.. 49 వేల మందికిపైగా అర్హత సాధించారని, ఈ దశలో పరీక్షను రద్దుచేయడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని ఆయన వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్​ జడ్జి తీర్పును రద్దుచేస్తూ గత పరీక్షల ఆధారంగానే నియామకాలకు అనుమతించింది. ఈ మేరకు ఈనెల 21న ఉత్తర్వులు జారీచేసింది.

నిరుద్యోగుల్లో ఆనందం..

ఏడాది తర్వాత జూనియర్​ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి హైకోర్టు అనుమతి ఇవ్వడంతో పరీక్షలు రాసి అర్హత సాధించిన అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. పోస్టుల భర్తీలో స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వడంతో చాలా మంది కోల్​బెల్ట్​ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు పరీక్షలు రాశారు. వారిలో పెద్ద సంఖ్యలో మంచి మార్కులు సాధించి ఉద్యోగాలకు అర్హత సాధించారు. ఈ దశలో ఊహించని విధంగా పరీక్షల నిర్వహణపై అభ్యంతరాలు రావడంతో అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఎట్టకేలకు ఏడాది తర్వాత కోర్టు తీర్పు ఇవ్వడంతో అభ్యర్థులు ఏడాది కాలం తర్వాత తమకు ఉద్యోగాలు దక్కుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

సింగరేణిలో ఇప్పటికే సుమారు 500 మంది వరకు జూనియర్​ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొద్ది కాలంగా సీనియర్​ అసిస్టెంట్లు పెద్ద సంఖ్యలో రిటైర్  అవుతున్నారు. క్లర్కులు సరిపడా లేకపోవడంతో బదిలీ వర్కర్​ కార్మికులతో యాజమాన్యం ఆఫీసు పనులు చేయించుకుంటున్నది. ఇటీవల హైదరాబాద్​లోని సింగరేణి భవన్​లో ఔట్ సోర్సింగ్​ ద్వారా క్లర్కుల నియమాకానికి సింగరేణి నోటిఫికేషన్​ జారీచేయడాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో తాజాగా 177  జూనియర్​ అసిస్టెంట్​ పోస్టు ఉద్యోగాల్లో  కొత్తవాళ్లు చేరనుండడంతో సింగరేణిలో  జూనియర్​ అసిస్టెంట్ల కొరత బాగా తగ్గనుంది.