వర్షాకాలం ముగిసే వరకు సెల్లార్ల తవ్వకాలను నిలిపివేత

వర్షాకాలం ముగిసే వరకు సెల్లార్ల తవ్వకాలను నిలిపివేత

హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది వర్షాకాలం ముగిసే వరకు సెల్లార్ల తవ్వకాలను నిలిపేస్తున్నట్లు జీహెచ్ఎంసీ టౌన్​ ప్లానింగ్ డిపార్ట్​ మెంట్​ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణంలో ఉన్న ప్రతి భవనాన్ని నేరుగా వెళ్లి తనిఖీ చేసి, సెల్లార్ల నిర్మాణం, సెట్ బ్యాక్​లను చెక్ చేయాలని సర్కిల్​ స్థాయి అధికారుల​కు సూచించింది.

నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ప్రమాద నివారణ ప్రమాణాలు పాటించకపోయినా, భూసార పరీక్షలు నిర్వహించకపోయినా వెంటనే నోటీసులు జారీ చేసి నిర్మాణాన్ని కూడా నిలిపివేయాలని పేర్కొంది.. సెల్లార్లలో నీరు నిల్వకుండా చేపడుతున్న చర్యలను పరిశీలించాలని, అనుమతి లేకుండా అక్రమంగా సెల్లార్లు తవ్వి నిర్మాణ ప్రక్రియ లేకుండా ఆగిపోయిన వాటిని గుర్తించాలని సూచించింది.

ఆ సెల్లార్ల పరిసర ప్రాంతాల భద్రత కోసం సీ అండ్ డీ విభాగం సహాయంతో డెబ్రీస్ తెప్పించి, వాటిని మూసివేయాలని తెలిపింది. కొండలు, గుట్టలు వంటి ప్రాంతాల్లో తవ్వకాలు జరుగుతున్నట్లైతే, వాటిని గుర్తించి ఆ బండరాళ్లు కింది ప్రాంతాల్లో పడకుండా నిర్మాణ దారుడిని అలర్ట్  చేయాలంది.  శిథిలావస్థకు చేరిన, ప్రమాదపు అంచున ఉన్న భవనాలను గుర్తించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.