ఒక్క యోగీకే.. దేశంలో ఏ సీఎంకూ అందని రామమందిర ఆహ్వానం

ఒక్క యోగీకే..  దేశంలో ఏ సీఎంకూ అందని రామమందిర ఆహ్వానం

శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కోసం అయోధ్య ముస్తాబైతున్నది. మరో పది రోజులే గడువు ఉండటంతో చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమం ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనుంది.  దేశవ్యాప్తంగా వేలాది మంది భక్తులుహాజరుకానున్నారు. ఈ కార్యక్రమం కోసం దళిత ప్రముఖుల కుటుంబాలకు, కరసేవకులకు, పలువురు ఇతర ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.  కానీ  సీఎంలలో ఒక్క యూపీ సీఎం  యోగీ ఆదిత్యనాథ్‌కు తప్ప మరే సీఎంకు ఆహ్వానం అందలేదు. ఆతిథ్య రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మినహా ఇతర ఏ  ముఖ్యమంత్రికి ఆహ్వానం  అందలేని రామాలయ వర్గాలు వెల్లడించాయి. ఆలాగే కేంద్రమంత్రులకు ఆహ్వానం అందలేదు.  ఇక ఆహ్వానం అందిన దళిత ప్రముఖుల కుటుంబాల్లో బీఆర్‌ అంబేద్కర్‌, జగ్జీవన్‌రామ్‌, కాన్షీరామ్‌ కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా రామజన్మ భూమి ఉద్యమం సందర్భంగా మరణించిన కరసేవకుల కుటుంబాలకు కూడా ఆహ్వానాలు అందాయి.

 మోదీ దీక్ష 

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఇంకా 10  రోజుల సమయం మత్రమే సమయం ఉంది.  ఈ  క్రమంలో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. తాను ఈ 11 రోజులు ప్రత్యేక అనుష్ఠానాన్ని (దీక్ష) అనుసరిస్తానని వెల్లడించారు. ఈ మేరకు తన  అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో ఓ ఆడియో సందేశాన్ని రిలీజ్ చేశారు.  రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కనులారా వీక్షించే అవకాశం అవకాశం తనకు రావడం చాలా అదృష్టమని చెప్పుకొచ్చారు.   అయోధ్యలోని రామమందిర ఆలయాన్ని ప్రధాని మోదీ జనవరి 22న ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి  4 వేల మందికి పైగా సాధువులతో పాటు ఋషులు పాల్గొంటున్నారు.

వారం ముందు నుంచే పూజలు..  

శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన క్రతువులు ప్రధాన కార్యక్రమానికి వారం రోజులు ముందుగా ఈ నెల 16వ తేదీ నుంచే ప్రారంభం కానున్నాయి. వారణాసికి చెందిన ప్రముఖ వేద పండితుడు లక్ష్మీకాంత్ దీక్షిత్  ఆధ్వర్యంలో 22న రామ్ లల్లా(బాల రాముడు) విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. అయోధ్యలో ఈ నెల 14 నుంచి 22 వరకూ అమృత్ మహోత్సవ్ పేరిట రోజూ ప్రత్యేక కార్యక్రమాలు సైతం నిర్వహించనున్నారు. ఇక వేడుకలకు వచ్చే వేలాది మంది భక్తుల కోసం అయోధ్యలో టెంట్ సిటీలు ఏర్పాటు చేస్తున్నారు. వారికి భోజనం, వసతితో పాటు అవసరమైన సౌలతులు కల్పిస్తున్నారు. రామ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 15 వేల మంది బస చేసేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.