యాంటీబయాటిక్స్​ బెడిసికొడుతున్నయ్​

యాంటీబయాటిక్స్​ బెడిసికొడుతున్నయ్​

హైదరాబాద్​, వెలుగు: యాంటీ బయాటిక్​లే రివర్స్​ అయిపోతున్నాయి. అతిగా వాడడం వల్ల ఇన్​ఫెక్షన్లపై సరైన ప్రభావం చూపించలేకపోతున్నాయి. జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న వాటికీ జనాలు యాంటీ బయాటిక్​లను వాడుతుండడం వల్ల బ్యాక్టీరియాలు వాటికి నిరోధకతను (రెసిస్టెన్స్​) సంతరించుకుంటున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం టీబీ మరణాల్లో 50% యాంటీ బయాటిక్​ రెసిస్టెన్స్​ వల్లే సంభవిస్తున్నాయి. నిజానికి డ్రగ్స్​ అండ్​ కాస్మెటిక్స్​ యాక్ట్​ ప్రకారం డాక్టర్​ ‌‌‌‌ ప్రిస్క్రిప్షన్​ లేకుండా యాంటీ బయాటిక్​లను అమ్మడానికి వీల్లేదు. కానీ, ఆ ప్రిస్క్రిప్షన్​ లేకుండానే చాలా మెడికల్​ షాపల్లో అమాక్సిసిలిన్​, సెఫిక్సిమ్​, సిప్రొఫ్లోక్సాసిన్​ వంటి యాంటీ బయాటిక్​లను అమ్ముతున్నారు. డ్రగ్​ కంట్రోల్​ అధికారులు ఈ విషయాన్ని చూసి చూడనట్టు వదిలేస్తున్నారన్న విమర్శలున్నాయి. గ్రామాల్లో ఆర్​‌‌‌‌ఎంపీలు, పీఎంపీలు, కొంత మంది క్వాలిఫైడ్​ డాక్టర్లూ చిన్న చిన్న రోగాలకే ఎక్కువ డోస్​ యాంటీ బయాటిక్​లను రోగులకు ఇస్తున్నారు. ఫార్మా కంపెనీలు ఇచ్చే కమీషన్లకు ఆశపడి, జ్వరం, చిన్న చిన్న గాయాలకు పవర్​ఫుల్​ యాంటీబయాటిక్​లను ఇస్తున్నారు. ఇలా ఎక్కువ వాడడం వల్ల కొంతకాలానికి రెసిస్టెన్స్​ రావడంతో పాటు సైడ్​ ఎఫెక్ట్​లూ వచ్చే ముప్పుంది. విచ్చలవిడిగా యాంటీ బయాటిక్​ల వాడకాన్ని తగ్గించేందుకు యాంటీ బయాటిక్స్​ పాలసీని తీసుకొస్తున్నామని గతంలో మెడికల్​ ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్​ ప్రకటించినా ఇప్పటివరకూ ఒక్క అడుగూ ముందుకు పడలేదు.

25 నుంచి 40% మరణాలు

రాష్ర్టంలో ఏటా 70 వేల మంది టీబీ బారిన పడుతున్నారు. ఇందులో 5 నుంచి 8 వేల మంది మల్టీ డ్రగ్​ రెసిస్టెన్స్​టీబీ(ఎండీఆర్​‌‌‌‌టీబీ) బారిన పడుతున్నారు. సాధారణ టీబీ వచ్చినవాళ్లలో 2 నుంచి 3% మంది చనిపోతుంటే, ఎండీఆర్​ టీబీ వచ్చినవాళ్లలో 25 నుంచి 40% మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ‘‘టీబీ పేషెంట్లలో చాలా మంది వ్యాధి కొంత తగ్గగానే మందులు మానేస్తున్నారు. దీంతో టీబీ తిరగబెట్టినప్పుడు వాళ్లకు మరోసారి మందులు ఇచ్చినా పనిచేయడం లేదు. దీని వల్లే అధికశాతం టీబీ మరణాలు చోటు చేసుకుంటున్నాయి’’ అని టీబీ కంట్రోల్​ ప్రోగ్రామ్​ జాయింట్​ డైరెక్టర్​‌‌‌‌, డాక్టర్​‌‌‌‌ రాజేశం తెలిపారు. ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న యాంటిబయాటిక్స్​ అన్ని పదిహేను, ఇరవై ఏండ్ల క్రితం కనుగొన్నవే ఉన్నాయి. చివరగా నాలుగైదేండ్ల క్రితం అమెరికన్​ డ్రగ్​ కంట్రోల్​ అథారిటీ ఓ కొత్త యాంటిబయాటిక్​కు ఆమోదం తెలిపింది. రెసిస్టెన్స్​ను తట్టుకునే యాంటీ బయాటిక్​లను కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి.

ఇట్ల వాడాలె

వ్యక్తి శరీర తత్వాన్ని, రోగాన్ని బట్టి యాంటీ బయాటిక్స్​ ఇచ్చేందుకు బ్లడ్​ కల్చర్​ సెన్సిటివిటీ టెస్ట్​ చేస్తారు. ఫలితాలను బట్టి ఏ డోస్​ ఇవ్వాలో నిర్ణయిస్తారు. అయితే, చాలా అరుదుగా, నాలుగైదు దవాఖానలు మాత్రమే ఈ పద్ధతిని పాటిస్తున్నాయి. ఇటీవల నిమ్స్​లో యాంటీ బయాటిక్​ స్టువార్డ్​షిప్​ పేరిట ఓ కార్యక్రమం ప్రారంభించారు. యాంటీ బయాటిక్​ రెసిస్టెన్స్​పై రోగులు, డాక్టర్లకు అవగాహన కల్పించడం, అవసరమైన మేరకే వాడడం వంటివి ఈ కార్యక్రమం ఉద్దేశం. ‘‘ప్రస్తుతం నిమ్స్​లో రోగి రక్త నమూనాలు తీసుకుని సెన్సిటివిటీ టెస్ట్​ చేసిన తర్వాతే యాంటీ బయాటిక్స్​ ఇస్తున్నాం. ఇలా చేయడం వల్ల రోగం తగ్గడంతోపాటు, రెసిస్టెన్స్​ సమస్య ఉండదు’‘ అని నిమ్స్ రెసిడెంట్​ డాక్టర్​‌‌‌‌ జి. శ్రీనివాస్​ తెలిపారు. టీచింగ్​, కార్పొరేట్​ హాస్పిటళ్లలో సెన్సిటివిటీ టెస్ట్​ తప్పనిసరి చేస్తూ నిబంధనలు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. మెడికల్​ షాపులు, అర్హత లేని డాక్టర్లపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

మన దేశంలోనే వాడకం ఎక్కువ

ప్రపంచంలో మనదేశంలోనే ఎక్కువగా యాంటీ బయాటిక్స్​ను వాడుతున్నారు. ఇప్పుడున్న అన్ని యాంటీ బయాటిక్​లకు రెసిస్టెన్స్​ మొదలైంది. మందులకు లొంగని అంటువ్యాధులు పెరుగుతున్నాయి. దీన్ని అడ్డుకోకపోతే ప్రజల ప్రాణాలకే ప్రమాదం. రాష్ర్ట ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలి. నిపుణులతో కమిటీ వేసి, యాంటీ బయాటిక్​ పాలసీ తీసుకురావాలి.

‑ డాక్టర్​ సంజయ్​రెడ్డి, ఫార్మకాలజిస్ట్