
పెర్త్ స్టేడియంలో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరుగుతున్న తొలి వన్డేలో మ్యాచ్ కు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించింది. మొదట బ్యాటింగ్ చేస్తున్న ఇండియా ఇన్నింగ్స్ లో 9 ఓవర్లో.. 12 ఓవర్లో వర్షం రావడంతో మ్యాచ్ కు ఆటంకం కలిగింది. ఏకంగా రెండు గంటల పాటు మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం తగ్గడంతో మ్యాచ్ ప్రారంభమైంది. అంపైర్లు మ్యాచ్ ను 35 ఓవర్లకు కుదించారు. రూల్స్ ప్రకారం ఒక్కో బౌలర్ 7 ఓవర్లు మాత్రమే గరిష్టంగా వేయాల్సి ఉంటుంది. ఇప్పటికే 12 ఓవర్లు కావడంతో టీమిండియాకు కాస్త ప్రతికూలంగా మారింది.
వర్షంతో ఆట నిలిచిపోయే సమయానికి 11.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది. అయితే వర్షం తర్వాత 35 ఓవర్లకు కుదించిన తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇండియా వెంటనే శ్రేయాస్ అయ్యర్ వికెట్ ను కోల్పోయింది. హేజల్ వుడ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ కు క్యాచ్ ఇచ్చి 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద శ్రేయాస్ ఔటయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజల్ వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. స్టార్క్, ఎల్లిస్ లకు తలో వికెట్ లభించింది.
టాపార్డర్ విఫలం:
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న ఇండియాకు ఘోరమైన ఆరంభం లభించింది. 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్, కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచారు. కోహ్లీ డకౌట్ అయితే.. రోహిత్ 8 పరుగులకే పెవిలియన్ కు చేరాడు. తొలిసారి వన్డే కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన గిల్ కూడా 10 పరుగులకే ఔటవ్వడంతో ఇండియా కష్టాల్లో పడింది.