ప్యాసింజర్ రైల్లో షాకింగ్ సీన్: వాష్ బేసిన్‌లో డిస్పోజబుల్స్ ఫుడ్ ట్రేలు కడుగుతూ.. నెటిజన్లు ఫైర్..

ప్యాసింజర్ రైల్లో షాకింగ్ సీన్: వాష్ బేసిన్‌లో డిస్పోజబుల్స్ ఫుడ్ ట్రేలు కడుగుతూ.. నెటిజన్లు ఫైర్..

ఈరోడ్(తమిళ్ నాడు) - జోగ్బాని(బీహార్) మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్ 16601కు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతుంది. ఒక వ్యక్తి ప్యాసెంజర్ బోగీలో వాడిన డిస్పోజబుల్ ఫుడ్ ట్రేలను తిరిగి మళ్ళి వాడేందుకు కడుగుతుండటం భారతీయ రైళ్లలో పరిశుభ్రతపై తీవ్రమైన ఆగ్రహం తెప్పిస్తుంది. 

ఈ  ఘటన రైలు ప్రయాణా సమయంలో జరిగింది. ఒక ప్రయాణికుడు రికార్డ్ చేసిన వీడియోలో రైల్వే క్యాంటీన్ సిబ్బందిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి ప్రయాణీకుల వాష్ బేసిన్ వద్ద డిస్పోజబుల్ ప్లాస్టిక్ ఫుడ్  ట్రేలను కడుగుతు కనిపిస్తుంది. అతను ఈ ఫుడ్ ట్రేలను నీటితో కడిగి, మళ్లీ వాడటానికి రెడీ చేస్తుంటాడు. 

వీడియో రికార్డ్ చేస్తున్న ప్రయాణీకుడు అడిగినప్పుడు, అతను భయపడి  చెప్పేలేక తడబడ్డాడు. మొదట్లో ఫుడ్ ట్రేలను తిరిగి వాడడానికి  శుభ్రం చేస్తున్నానని చెప్పగా.. కానీ ప్యాంట్రీ సెక్షన్ కి దూరంగా ప్రయాణీకుల వాష్ బేసిన్ వద్ద వాటిని ఎందుకు కడుగుతున్నారో  చెప్పలేకపోయాడు.  

ఈ వీడియో క్లిప్ క్షణాల్లోనే వైరల్‌గా మారి, సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపించింది. నెటిజన్లు ఇండియన్ రైల్వేస్, IRCTCని  ట్యాగ్ చేసి, దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 

ఈరోడ్–జోగ్బానీ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది తమిళనాడులోని ఈరోడ్ జంక్షన్ నుండి బీహార్‌లోని జోగ్బానీ వరకు నడిచే మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైలు. కొన్ని రాష్ట్రాల మీద నుండి 3,100 కిలోమీటర్లకు పైగా దూరాన్ని కవర్ చేస్తుంది. అలాగే వారానికి ఒకసారి అంటే  ప్రతి గురువారం నడుస్తుంది, దూర ప్రయాణం చేసే వందలాది ప్రయాణికులకు సేవలు అందిస్తుంది.

ఈ సంఘటనపై రైల్వే అధికారులు లేదా IRCTC ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.  డిస్పోజబుల్ ఫుడ్ ట్రేలను తిరిగి వాడడం  వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది, ముఖ్యంగా వేడి భోజనం వడ్డించినప్పుడు కొన్ని రకాల ప్లాస్టిక్‌లు విషపూరిత రసాయనాలను విడుదల చేస్తాయి.