
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండు కొత్త సర్కారు డిగ్రీ కాలేజీలు రానున్నాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండి సెగ్మెంట్లోని గంగాధర మండలంలో ఒక కాలేజీ, జగిత్యాల జిల్లా ధర్మపురిలో మరో కాలేజీని ఏర్పాటు చేయనున్నట్టు సర్కారు ప్రకటించింది. ఈ మేరకు శనివారం విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా ఉత్తర్వులు జారీ చేశారు.
కళాశాల విద్యాశాఖ చేసిన ప్రతిపాదనలకు సర్కారు ఓకే చెప్పింది. కాగా, వచ్చే విద్యాసంవత్సరం ఈ కాలేజీలను ప్రారంభించే అవకాశం ఉంది. మరోపక్క నారాయణపేట జిల్లా ధన్వాడలోని సర్కారు డిగ్రీ కాలేజీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. కొత్త బిల్డింగ్ నిర్మాణానికి రూ.6.10 కోట్లు సాంక్షన్ చేస్తున్నట్టు యోగితారాణా ఉత్తర్వులిచ్చారు.