
- అధికారంలో ఉన్న పార్టీలే మద్దతిచ్చాక.. ఇక ఆపేదెవరు?: హరీశ్
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్, బీజేపీలు డ్రామాలు చేస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయని, ఆ రెండు పార్టీలూ మద్దతిచ్చాక బీసీ రిజర్వేషన్లను ఆపే వాళ్లెవరుంటారని శనివారం ఓ ప్రకటనలో విమర్శించారు.
‘‘రిజర్వేషన్ల పెంపుపై ఢిల్లీలో కొట్లాడాల్సిన రెండు జాతీయ పార్టీలు బీసీలను మభ్యపెడుతూ గల్లీలో డ్రామాలు చేస్తున్నాయి. బీసీలను అవమానిస్తున్నాయి. ఆరుసార్లు జనాభా లెక్కింపు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు బీసీ గణన చేయలేదు. బీజేపీ అయితే జనగణనను ఏకంగా నాలుగేళ్లుగా వాయిదా వేస్తూ వస్తున్నది. గత 35 ఏండ్లలో ఈ దేశాన్ని కాంగ్రెస్ 15 ఏళ్లు, బీజేపీ 17 ఏళ్లు పాలిస్తే ఏనాడూ ఈ రెండు పార్టీలకు బీసీలు గుర్తుకు రాలేదు. కానీ ఇప్పుడు ఈ పార్టీలు బీసీలపై కపట ప్రేమ నటిస్తున్నాయి. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఉండాలని 2005లోనే కోరిన ఏకైక నేత కేసీఆర్. ఏ పార్టీ బిల్లు పెట్టినా దానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఉంటుంది” అని పేర్కొన్నారు.