మద్యం రేట్లు పెంచకుండా..ఎక్సైజ్ ఆదాయం పెంచాలి

 మద్యం రేట్లు పెంచకుండా..ఎక్సైజ్ ఆదాయం పెంచాలి
  •   టూరిజం అభివృద్ధిపై దృష్టి పెట్టాలి
  •  మద్యం రేట్లు పెంచకుండా..ఎక్సైజ్ ఆదాయం పెంచాలి

హైదరాబాద్, వెలుగు :  మద్యం ధరలను పెంచకుండా ఎక్సైజ్ ఆదాయాన్ని పెంపొందించే మార్గాలు, వనరులను గుర్తించాలని అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. ఎలైట్ బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఎలైట్ వైన్​షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మొదలైన వాటిని ఏర్పాటు చేయడానికి ఏకీకృత విధానంలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి గైడ్ లైన్స్ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్సైజ్, పోలీసు, సమాచార శాఖలతో కూడిన మల్టీ డైమెన్షనల్ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేసి.. డ్రగ్స్ ముప్పుపై అవగాహన కల్పించేందుకు, వాటిని అరికట్టేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. 

ప్రీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం సెక్రటేరియెట్ లో ఎక్సైజ్, టూరిజం, కల్చరల్, ఆర్కియాలజీ అధికారులతో భట్టి సమావేశమై మాట్లాడారు. రాష్ట్రంలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. ‘‘రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధి చెందాలంటే ఎండోమెంట్, టూరిజం, ఆర్టీసీ శాఖలు సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరముంది. అలాగే రాష్ట్రంలో ఉన్న అడవులను ఎకో టూరిజం కోసం ఉపయోగించుకోవచ్చు. మన దగ్గర పర్యాటక ప్రదేశాలు ఉన్నప్పటికీ సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేకపోవడంతో వాటిని ఉపయోగించుకోలేకపోతున్నాం. 

పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాల్సిన ప్రాంతాలను గుర్తించి, వాటి డెవలప్ మెంట్ కు విధానాలు రూపొందించాలి” అని ఆదేశించారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని అంతర్జాతీయంగా తెలియజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వమే అన్ని టూరిజం ప్రాజెక్టులు చేపట్టడం సాధ్యం కాదని, ప్రైవేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టేలా గైడ్ లైన్స్ రూపొందించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.

రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గించండి

‘రేరా’ ఏర్పాటయినందున బిల్డింగ్ నిర్మాణ పర్మిషన్ల కోసం ప్రస్తుతం ఉన్న 10 శాతం మార్టిగేజ్ విధానాన్ని ఎత్తి వేయాలని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్​మెంట్ కౌన్సిల్ తెలంగాణ విభాగం ప్రతినిధి బృందం ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రంలో అధికంగా ఉన్న రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గించాలని, జీవో నం.50 ఎత్తివేయాలన్నారు. సోమవారం సెక్రటేరియెట్​లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఈ ప్రతినిధి బృందం కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మరింత అభివృద్ధి చెందేందుకు పలు సూచనలను డిప్యూటీ సీఎంకు అందజేసింది. 

పెండింగ్​లో ఉన్న లక్షలాది ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, తద్వారా పెద్దఎత్తున నిర్మాణాలు ప్రారంభమై ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. టీఎస్ బీ-పాస్ కింద వివిధ ప్రాజెక్టులపై సమర్పించిన ధరఖాస్తులు రంగారెడ్డి జిల్లాలో రెండేండ్లుగా పెండింగ్ లో ఉన్నాయని, దీనివల్ల ఎన్నో ప్రాజెక్టులు నిలిచి పోయాయన్నారు. భవన నిర్మాణాలకు తీసుకుంటున్న తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లకు యూనిట్ కు రూ.9 నుండి 14 రూపాయలకు పెంచారని దీనిని తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.

మూసీ శుద్ధితో పర్యాటక అభివృద్ధి

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ఖజానాకు పెద్ద ఎత్తున ఆదాయ మార్గాలు తెచ్చే వెల్త్ క్రియేటర్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టమని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. థేమ్స్ నది మాదిరిగా మూసీ నాదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించామని, దీనితో పాటు రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం వల్ల హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. 

హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చడానికి శివారు ప్రాంతాల్లో ఇండస్ట్రియల్, ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని వివరించారు. ధరణి పై తగు సూచనలు, సలహాలను అందచేస్తే తాను పరిశీలించడంతో పాటు ధరణి పై ఏర్పాటు చేసిన కమిటీ కి అందిస్తానని భట్టి విక్రమార్క తెలిపారు. డబ్బులు కట్టి గత రెండు మూడేళ్ళుగా పెండింగ్ లో ఉన్న ఎల్.ఆర్.ఎస్. దరకాస్తులను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. 

కాగా, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధి కి పలు సూచనలను నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణా విభాగం ప్రతినిధి బృందం ఉప ముఖ్యమంత్రికి అందచేసింది. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో బృందం ప్రతినిధులు మేకా విజయ సాయి, కె.శ్రీధర్ రెడ్డి, కాళీప్రసాద్, దశరథ్ రెడ్డి, చలపతి రావు, భూపాల్ రెడ్డి, మారోజు శ్రీధర్ రావు, అశోక్, రామిరెడ్డి వెంకట్ రెడ్డి, కె.కె.రెడ్డి తదితరులు ఉన్నారు.