పెరట్లో తుపాకీ  పేల్చొద్దన్నరని కాల్చి చంపిండు

పెరట్లో తుపాకీ  పేల్చొద్దన్నరని కాల్చి చంపిండు
  • పెరట్లో తుపాకీ  పేల్చొద్దన్నరని కాల్చి చంపిండు
  • ఐదుగురు మృతి.. మృతుల్లో ఓ బాలుడు కూడా
  • అమెరికాలోని టెక్సస్​లో దారుణం

క్లీవ్ ల్యాండ్: అమెరికాలో గన్  కల్చర్  మరో ఐదుగురి ప్రాణాలను బలిగొంది. ఓ వ్యక్తి అర్ధరాత్రి తన పెరట్లో కాల్పులు జరుపుతూ ఉండగా పొరుగువారికి ఆ శబ్దం ఇబ్బంది కలిగించింది. నిద్రపోతున్న వేళ ఫైరింగ్  చేయొద్దని చెప్పారు. దీంతో కోపం పెంచుకుని ఆ యువకుడు పక్కింట్లోకి చొరబడ్డాడు. తన గన్​తో వాళ్లపై కాల్పులు జరిపి పారిపోయాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎనిమిదేళ్ల బాలుడు కూడా ఉన్నారు. టెక్సస్  రాష్ట్రంలోని క్లీవ్ ల్యాండ్ లో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘోరం జరిగింది. నిందితుడిని ఫ్రాన్సిస్కో ఓరొపియా (38) గా గుర్తించారు. అతను ఏఆర్  స్టైల్  రైఫిల్  ఉపయోగించాడని, అతని కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. 

ఇప్పటికీ ఓరొపియా ఆయుధంతో తిరుగుతూ ఉండవచ్చని తెలిపారు.  ‘‘ఓరొపియా పొరుగువారి ఇంట్లోకి వెళ్లి కాల్పులు జరిపినపుడు పది మంది ఉన్నట్లు తెలుస్తోంది. అతని కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు. ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. వారంతా ఎనిమిది నుంచి 31 ఏళ్లలోపు వారే. ముగ్గురు పిల్లల దుస్తులపై రక్తపు మరకలు ఉండడంతో వారిని ఆసుపత్రికి తీసుకెళ్లాం. వారికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిసింది. ఓరొపియా కాల్పుల్లో చనిపోయిన వారు ఆ పిల్లలకు ఎదురుగా నిలబడి వారిని కాపాడి ఉండవచ్చు” అని పోలీసులు పేర్కొన్నారు. 

నా ప్రాపర్టీ నా ఇష్టం అని సమాధానం

ఓరొపియా తన పెరట్లో కాల్పులు జరుపుతుండగా.. డిస్టర్బ్  అయిన పొరుగువారు అతని వద్దకు వెళ్లి కాల్పులు జరపవద్దని కోరారు. ‘‘ఇది నా ప్రాపర్టీ. నా ఇష్టం” అని అతను బదులు ఇచ్చాడని పోలీసులు వెల్లడించారు. అనంతరం అతను పొరుగువారి ఇంట్లోకి వెళ్లి కాల్పులు జరిపాడని చెప్పారు.