
- ఓటమికి బలమైన కారణాలు అక్కర్లేదు
- సోషల్ మీడియాలో దుష్ప్రచారం చాలు
- కాంగ్రెస్ హామీలు అమలు చేయలేదు
- మన బడ్జెట్ కు మించి హామీలిచ్చారు
- మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు మందు ఇచ్చిన హామీలు నెరవేర్చడం సాధ్యం కాదని, ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉన్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. అప్పుడు ప్రజలే తమను రమ్మని పిలుస్తారని చెప్పారు. ఇవాళ నాగర్ కర్నూల్ లోక్ సభ సన్నాహా క సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం లో ప్రభుత్వాలు మారడానికి బలమైన కారణాలు ఉండనక్కర్లేదని, సోషల్ మీడియా దుష్ప్రచారాలు చాలని అన్నారు. ప్రభుత్వాలు మారడం కొత్తేమీ కాదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ వరుసగా పదేండ్లు పాలించిన సందర్బాలు చాలా అరుదని చెప్పారు. ఐదేళ్ల లోపే ప్రజావ్యతిరేకత ను మూట గట్టుకుని ఇంటికి పోయిన కాంగ్రెస్ ప్రభుత్వాలే ఈ దేశం లో ఎక్కువన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఏడాదికి మూడున్నర లక్షల కోట్ల రూపాయలు కావాలని, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2.90 లక్షల కోట్లని అన్నారు. బడ్జెట్ కు మించి హామీలు ఇచ్చారని విమర్శించారు. అధికారం ఎలాగూ రాదనుకొని అరచేతిలో వైకుంఠం చూపేలా మేనిఫెస్టో రాశారని అన్నారు. కర్ణాటక లో 5 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కుడితిలో పడ్డ ఎలుకలా మారిందని విమర్శించారు.
5 గ్యారంటీల అమలుకు డబ్బులు లేవని కర్ణాటక ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయరెడ్డి మొన్న మీడియా తో చెప్పారన్నారు. ఆ గ్యారెంటీలన్నీ అమలు చేస్తే కర్నాటక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని చెప్పారు. మన దగ్గర కూడా గ్యారెంటీలపై కాంగ్రెస్ నేతలు చావు వార్త చెప్పే రోజు ఎంతో దూరం లేదన్నారు. ఇంకా వంద రోజులు కాలేదు కదా అని ఆగుతున్నామని, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే వాళ్ళమని హరీశ్ రావు అన్నారు.