దళిత బంధు లబ్ధిదారుల ఎదురుచూపులు

దళిత బంధు లబ్ధిదారుల ఎదురుచూపులు

హైదరాబాద్, వెలుగు: దళిత బంధు కోసం ఎమ్మెల్యేలు పేర్లు రాసుకున్నా, ప్రభుత్వం నుంచి ఇంకా అప్రూవల్ రావడం లేదు. లబ్ధిదారుల అకౌంట్లలో నిధులు జమ చేయడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం మొదలైన ఏప్రిల్ లోనే  చాలా మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లోని పార్టీ లీడర్లకు ఫోన్లు చేసి లిస్టు తయారు చేసుకున్నారు. కానీ నెలలు గడుస్తున్నా అకౌంట్లలో నిధులు జమ కాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇంకెప్పుడు పైసలిస్తరని ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో ఎమ్మెల్యేలు అధికారులకు ఫోన్లు చేస్తూ నిధులపై ఆరా తీస్తున్నారు. తమకేమీ తెలియదని అధికారులు జవాబు ఇస్తున్నారు.   

బీఆర్ఓ ఇచ్చి రెండు నెలలు.. 

సర్కార్ పోయినేడాది నియోజకవర్గానికి 100 మంది చొప్పున దళిత బంధు ఇచ్చింది. ఈసారి నియోజకవర్గానికి 1,500 మంది చొప్పున ఇస్తామని ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా బడ్జెట్‌లో రూ.17,700 కోట్లు కేటాయించింది. ఈ మొత్తానికి మేలోనే బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ (బీఆర్‌ఓ) కూడా ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు ఒక్క పైసా విడుదల చేయలేదు. ఈ స్కీమ్ కింద పోయినేడాదివే ఇంకో రూ.250 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని అధికారులు చెప్పారు. నిధుల కోసం లబ్ధిదారులంతా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఏప్రిల్, మేలో అప్పు పుట్టలేదని, వచ్చిన ఆదాయమంతా రెగ్యులర్ స్కీములు, ఉద్యోగుల జీతాలు, అప్పులు, వాటి వడ్డీలకే సరిపోతోందని పేర్కొన్నారు. జూన్, జులైలో తీసుకున్న అప్పుతో రైతుబంధు, ఉద్యోగుల జీతాలకు సరిపెట్టినట్లు వెల్లడించారు. 

4 నెలలైనా మొదలు కాని ప్రక్రియ.. 

మొదట నియోజకవర్గానికి 100 మందికి, ఈసారి 1,500 మంది చొప్పున ఇస్తామని సర్కార్ ప్రకటించగా.. ఇంకా చాలా మంది దళిత బంధు కోసం ఎదురుచూస్తున్నారు. తమకెప్పుడు ఇస్తారని ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఏప్రిల్ లో టీఆర్ఎస్ మండల, గ్రామ అధ్యక్షులు, సర్పంచ్ లకు ఫోన్లు చేసి పేర్లు పంపాలని సూచించారు. ఇలా కొంతమంది పేర్లు తీసుకోగా, నేరుగా మరికొంత మంది ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్లి పేర్లు రాయించుకున్నారు. ఇప్పుడు వాళ్లంతా దళిత బంధు డబ్బులు ఎప్పుడు జమవుతాయంటూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. తమ పేరూ రాసుకోవాలంటూ మరికొంత మంది ఎమ్మెల్యేల దగ్గరికి క్యూ కడుతున్నారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలవుతున్నా ఎలాంటి ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో అటు లబ్ధిదారులు, ఇటు ఎమ్మెల్యేల్లోనూ ఆందోళన నెలకొంది.