వెంటనే ఇరాన్ విడిచి వెళ్లండి: భారతీయులకు ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ

వెంటనే ఇరాన్ విడిచి వెళ్లండి: భారతీయులకు ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ

టెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య దాడులు తాత్కాలికంగా ఆగిపోయాయి. ఈ క్రమంలో ఇరాన్‎లో ఉన్న భారతీయులకు టెహ్రాన్‌లోని ఇండియన్ ఎంబసీ ఎమర్జెన్సీ అడ్వైజరీ జారీ చేసింది. భారత పౌరులు వీలైనంత త్వరగా ఇరాన్ విడిచి వెళ్లాలని సూచించింది. 

కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ప్రమాదం ఇంకా  పొంచి ఉందని హెచ్చరించింది. భారత రాయబార కార్యాలయ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ సురక్షిత తరలింపు కోసం సూచించిన నిర్దేశిత మార్గాలను మాత్రమే ఉపయోగించాలని తెలిపింది. ఎంబసీ ముందస్తు అనుమతి లేకుండా పౌరులు ఏ అంతర్జాతీయ భూ సరిహద్దు దగ్గరకు వెళ్లొద్దని హెచ్చరించింది. ప్రయాణ వివరాలను రాయబార కార్యాలయ అధికారులతో పంచుకోవాలని సూచించింది.

భారత పౌరులకు సహాయం చేయడానికి రాయబార కార్యాలయం అత్యవసర సంప్రదింపు నంబర్లను జారీ చేసింది. +989128109115, +989128109102, +989128109109 +989932179359 అత్యసర సమయాల్లో ఈ నెంబర్లను సంప్రదించాలని సూచించింది. దేశం విడిచే వెళ్లాలనుకునే వారు ఎంబసీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరపాలని కోరింది.