ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు జీవోలకే పరిమితం

ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు జీవోలకే పరిమితం

 

  • ఇష్టారాజ్యంగా డయాగ్నస్టిక్ సెంటర్ల చార్జీలు
  • అదనంగా రూ.250 నుంచి 
  • వెయ్యి దాకా వసూలు చేస్తున్న ల్యాబ్స్
  • వెంటనే రిపోర్టు కావాలంటే డబుల్ చార్జీలు
  • ఫిర్యాదులపై పట్టించుకోని ఆఫీసర్లు..
  • పొరుగు రాష్ట్రం ఏపీలో సర్కారు రేట్లే అమలు..
  • ఆర్టీపీసీఆర్ టెస్టుకు రూ.350


హైదరాబాద్, వెలుగు: కరోనా టెస్టుల పేరిట దోపిడీ మళ్లీ మొదలైంది. అందిన కాడికి డయాగ్నస్టిక్ సెంటర్లు దోచుకుంటున్నాయి. ప్రభుత్వం చెప్పిన ధరల కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నాయి. సర్కారు రూల్స్‌‌ ప్రకారం ఆర్టీపీసీఆర్‌‌‌‌ టెస్టుకు రూ.500, ఇంటికి వచ్చి శాంపిల్ తీసుకుంటే రూ.750 తీసుకోవాలి. కానీ హైదరాబాద్‌‌లో చాలా చోట్ల రూ.250 నుంచి 1000 దాకా ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ఇదేంటని అడిగితే హ్యాండ్లింగ్, సర్వీసు చార్జీలని చెబుతున్నారు. ఇలా అడ్డగోలుగా రేట్లు పెడుతున్నా, సామాన్యుడి జేబులు గుల్ల చేస్తున్నా.. సర్కారు పట్టించుకోవడం లేదు. ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నా చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. 

కరోనా టెస్టుల దోపిడీని అరికట్టేందుకు సర్కారు జీవో నంబర్ 539ను జారీ చేసింది. ల్యాబ్ వద్ద ఆర్టీపీసీఆర్ టెస్టు చేస్తే రూ. 850 ఉన్న రేటును రూ.500కి, ఇంటికి వచ్చి శాంపిల్ కలెక్ట్ చేసుకుంటే రూ.1,250 ఉన్న రేటును రూ.750కు ప్రభుత్వం తగ్గించింది. కానీ ఇప్పటికీ పాత రేట్లనే ప్రైవేటు ల్యాబ్స్ వసూలు చేస్తున్నాయి. అయితే అధిక ధరలపై అనుమానం రాకుండా ఉండేందుకు ఇతర చార్జీలు వేస్తున్నాయి.  ఇంటికి వచ్చి శాంపిల్ తీసుకుంటే రూ.1,000 నుంచి 1,500 దాకా చార్జ్ చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సర్కారు మాత్రం చప్పుడు చేయడం లేదు. ఇదే సమయంలో ఢిల్లీ, ఏపీ రాష్ట్రాల్లో ఆర్టీపీసీఆర్ టెస్టుల ధరలను ఆయా ప్రభుత్వాలే నిర్దేశించడంతోపాటు, పక్కాగా అమలు చేస్తున్నాయి. దీనికోసం ప్రత్యేక వైద్య సిబ్బందిని నియమించడంతోపాటు, అధిక ధరలు వసూలు చేయకుండా టెస్టింగ్ సెంటర్లపై కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఆర్టీపీసీఆర్ టెస్టులకు ప్రస్తుతం ఢిల్లీలో రూ.300, ఏపీలో రూ.350 చార్జ్ చేస్తున్నారు. మన దగ్గర వసూలు చేస్తున్న చార్జీలు వీటికి డబుల్ ఉంటున్నాయి. దీనికి తోడు ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రా చార్జీలు ఉంటున్నాయి. 

ఎక్కువ ఇస్తే.. వెంటనే రిజల్ట్

ఆర్టీపీసీఆర్ టెస్టు రిపోర్టుకు 24–48 గంటల సమయం పడుతోంది. కానీ అదనంగా చార్జీలు చెల్లిస్తే వెంటనే రిజల్ట్ ఇస్తామని డయాగ్నస్టిక్ సెంటర్లు అంటున్నాయి. ఇందుకోసం డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. అత్యవసరంగా ఆర్టీపీసీఆర్ రిపోర్టు కావాలంటే కొన్ని హాస్పిటల్స్ రూ.1,800 నుంచి 3,500 దాకా వసూలు చేస్తున్నాయి. కొన్ని ల్యాబ్‌‌‌‌‌‌‌‌లకు పర్మిషన్లు లేకున్నా.. ఇంటికి వచ్చి శాంపిల్ కలెక్ట్ చేసుకుని, వాటిని డయాగ్నస్టిక్ సెంటర్ల వద్ద టెస్టు చేసి, కమిషన్ వసూలు చేస్తున్నాయి. 

అడ్డగోలు చార్జీలపై నియంత్రణ ఏదీ?

కరోనా టెస్టుల పేరిట డయాగ్నస్టిక్ సెంటర్లు అడ్డగోలుగా వసూలు చేస్తున్నా... పట్టించుకునేవారు కరువయ్యారు. ఫిర్యాదు చేసి రెండు, మూడు నెలలు గడుస్తున్నా చర్యలు తీసుకోవట్లేదు. ఆరు నెలల వ్యవధిలో గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ పరిధితోపాటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 12 డయాగ్నస్టిక్ సెంటర్లపై 60కిపైనే ఫిర్యాదులు వచ్చాయి. కానీ చర్యలు అంతంత మాత్రమే. ఇక సోషల్ మీడియాలో వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. సరైన ఆధారాలు లేవంటూ కనీసం పరిశీలించకుండానే అధికారులు పక్కన పడేస్తున్నారు. ఈమెయిల్‌‌‌‌‌‌‌‌, ఫిజికల్ కంప్లయింట్లపైనా పెద్దగా స్పందించడం లేదు. నోటీసులు ఇచ్చామని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు.

ఫిర్యాదు చేస్తే చర్యలు తీస్కుంటం

ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ రేట్లను ఇప్పటికి మూడుసార్లు తగ్గించాం. ల్యాబ్ దగ్గర శాంపిల్ ఇస్తే రూ.500, హోమ్‌‌‌‌‌‌‌‌ కలెక్షన్‌‌‌‌‌‌‌‌కు రూ.750 మాత్రమే చార్జ్ చేయాలని ఆదేశాలిచ్చాం. అంతకంటే ఎక్కువ వసూలు చేసినట్టు ఆధారాలతో మాకు కంప్లైంట్ చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. కరోనా టెస్టుల గురించి ఆరాటపడాల్సిన పనిలేదని ఐసీఎంఆర్ ఇప్పటికే చెప్పింది. ప్రజలు అనవసరంగా కంగారుపడి ప్రైవేటు ల్యాబ్‌‌‌‌‌‌‌‌లకు వెళ్లి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ప్రభుత్వ ల్యాబ్‌‌‌‌‌‌‌‌ల్లో ర్యాపిడ్‌‌‌‌‌‌‌‌ టెస్టులతోపాటు, అవసరమైన వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నాం. లోడ్ ఎక్కువగా ఉండడం వల్ల, కొన్నిసార్లు రిజల్ట్ రావడం ఆలస్యం అవుతుంది. ఈ సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తాం.
- శ్రీనివాసరావు, డైరెక్టర్, 
  పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్

తక్కువున్న కాడికి పొమ్మన్నరు.. 
15 రోజుల కింద టెస్టు కోసమని ఓ సెంటర్ కు పోతే, రూ.850 కంటే తక్కువకు చేసేది లేదన్నరు. ఇందులో పీపీఈ కిట్లు, శానిటైజర్, మాస్కులకే సగం కంటే ఎక్కువ ఖర్చవుతుందన్నరు. అంత ఎక్కువ రేటా? అని ప్రశ్నిస్తే, తక్కువున్న చోటుకు పొమ్మన్నరు. ఇక చేసేదేం లేక టెస్టు చేయించుకున్న. 
- శ్రీకాంత్, హైదరాబాద్​