ఆశావహుల్లో అసంతృప్తి.. ఏడుపాయల ధర్మకర్తల మండలిలో పాతోళ్లకే మళ్లీ చాన్స్

ఆశావహుల్లో అసంతృప్తి.. ఏడుపాయల ధర్మకర్తల మండలిలో పాతోళ్లకే మళ్లీ చాన్స్

మెదక్, పాపన్నపేట, వెలుగు : ఏడుపాయల దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్, డైరెక్టర్​ పదవులు ఆశిస్తున్నవారి ఆశలు అడియాసలయ్యాయి. కొత్త ధర్మకర్తల మండలిలో సైతం ఇటీవల పదవీ కాలం ముగిసిన పాత ధర్మకర్తల మండలి సభ్యులకే మళ్లీ చాన్స్​ ఇవ్వడంతో ఎంతో కాలంగా ఆయా పదవులపై ఆశ పెట్టకున్నవారిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీమాత ఆలయం 6ఏ జాబితాలో ఉంది. ఆలయ నిర్వహణ, భక్తులకు సౌకర్యాల కల్పన, అభివృద్ధి, ఉత్సవాలు, జాతరల నిర్వహణ కోసం ఎండోమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రభుత్వం ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేస్తుంది. ఆలయ ధర్మకర్తల మండలిలో మొత్తం 14 డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి. 

ఇందులో ఎస్సీ లేదా ఎస్టీలకు ఒకటి, బీసీలకు ఒకటి, మహిళలకు ఒకటి కేటాయించారు. ఒక డోనర్ కు అవకాశం ఉంది. ఆలయ ప్రధాన పూజారి ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఉంటారు. హిందువు అయి ఉండి, వయసు 35 ఏళ్లకు పైబడి ఉండి, సత్ప్రవర్తన కలిగి, ఎలాంటి పోలీస్ కేసులు లేనివారు ధర్మకర్తల మండలి డైరెక్టర్ పోస్టుకు అర్హులు. ఎంపికైన డైరెక్టర్లలోనుంచి ఒకరిని చైర్మన్ గా ఎన్నుకుంటారు. ఏడుపాయల ధర్మకర్తల మండలిలో 10 పోస్టులు పాపన్నపేట మండలానికి, రెండు పోస్టులు కొల్చారం మండలానికి చెందిన వారికి కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. 

ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వారికే...

ఆలయ ధర్మ కర్తల మండలి పోస్టుల భర్తీకి ఎండోమెంట్​ డిపార్ట్​మెంట్​ నోటిఫికేషన్​ జారీ చేస్తుంది. గైడ్​లైన్స్​ ప్రకారం అర్హత, ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. ఆఫీసర్లు ఎంక్వైరీ చేసి అర్హులైన వారిని డైరెక్టర్​ పోస్టులకు ఎంపిక చేయాలి. కానీ ఇది అమలు కావడం లేదు. స్థానిక ఎమ్మెల్యే సిఫారసు చేసిన వారికే డైరెక్టర్, చైర్మన్​ పోస్టులు దక్కుతున్నాయి. గతేడాది జూన్​లో కొలువుదీరిన ఏడుపాయల ధర్మ కర్తల మండలి పదవీకాలం ఈ నెలారంభంలో ముగిసింది. ఈ మేరకు కొత్త ధర్మకర్తల మండలి ఏర్పాటుకు సంబంధించి ఎండోమెంట్ డిపార్ట్​మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. చైర్మన్​ పదవి పాపన్నపేట మండలానికి చెందిన వారికే ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. 

ఆ పోస్టుతోపాటు, 9 డైరెక్టర్​పోస్టులను పాపన్నపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అధికార బీఆర్​ఎస్​ పార్టీ లీడర్లు, రెండు డైరెక్టర్​ పోస్టులకు  కొల్చారం మండలం చిన్న ఘనపూర్, పోతంశెట్​పల్లి గ్రామానికి చెందిన  అధికార పార్టీ లీడర్లు  ఆశించారు. ఈ మేరకు వారు మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేల ఆశీస్సులతో ధర్మకర్తల మండలి పదవుల కోసం ప్రయత్నాలు చేశారు. ఇదివరకు అవకాశం లభించని వారు ఈ సారి తప్పకుండా తమకు చాన్స్​ దొరుకుతుందని భావించారు. అయితే చైర్మన్​, డైరెక్టర్​ పదవులు ఆశిస్తున్నవారు చాలా మంది ఉండటంతో ఒకరికి ఇస్తే మరొకరు నారాజ్​ అవుతారని, ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో పార్టీలో అసంతృప్తి రగులుతుందని భావించి పాత ధర్మకర్తల మండలి సభ్యులకే మళ్లీ చాన్స్ ఇవ్వాలని నిర్ణయించారు. 

ఈ మేరకు మెదక్, నర్సాపూర్​ ఎమ్మెల్యేల సూచన మేరకు ఇదివరకటి ధర్మకర్తల మండలి సభ్యులే మళ్లీ దరఖాస్తు  చేసినట్టు సమాచారం. దీంతో ఏడుపాయల ధర్మ కర్తల మండలిలో చోటు కోసం ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్న ఆశావహులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కాగా దేవాలయ చైర్మన్ పదవి మళ్లీ మొన్నటి వరకు చైర్మన్​గా ఉన్న బాలాగౌడ్​కే దక్కుతుందా? లేదా కొత్త వారికి చాన్స్​ ఇస్తారా? అనేది చూడాలి.