- గ్రూప్ 1కు అప్లికేషన్లకు గడువు పొడిగింపు
- 4 వరకు పెంచిన టీఎస్పీఎస్సీ
గ్రూప్ 1 పోస్టులకు రికార్డు స్థాయిలో అప్లికేషన్లు వచ్చాయి. మంగళవారం రాత్రి 10 గంటల వరకు 3,44,042 అప్లికేషన్లు అందాయి. అప్లికేషన్ల గడువును జూన్ 4 వరకు పొడిగించారు.
హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 దరఖాస్తు గడువును టీఎస్పీఎస్సీ పొడిగించింది. ఈ నెల నాలుగో తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఫీజు పేమెంట్లో సమస్యలు తలెత్తుతున్నాయని కొందరు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. చివరి తేదీ నాడు ఉదయం 11.59 గంటల వరకే దరఖాస్తులను తీసుకుంటామని స్పష్టం చేసింది. గ్రూప్1 పోస్టులకు రికార్డు స్థాయిలో అప్లికేషన్లు వచ్చాయి. మంగళవారం రాత్రి 10 గంటల వరకు 3,44,042 అప్లికేషన్లు అందాయి. మంగళవారం ఒక్క రోజే 50 వేల దరఖాస్తులు వచ్చాయి. కాగా, కొత్తగా 1,83,089 మంది టీఎస్పీఎస్సీ ఓటీఆర్ చేసుకోగా.. పాత ఓటీఆర్ను 3,71,994 మంది ఎడిట్ చేసుకున్నారు. 18 విభాగాల్లోని 503 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. మే 2న అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో 312 పోస్టులకు గ్రూప్ –1 నోటిఫికేషన్ ఇవ్వగా.. అప్పట్లో 3లక్షలకు పైగా అప్లై చేశారు. ప్రస్తుతం ఒక్క తెలంగాణలోనే మూడున్నర లక్షల మంది దరఖాస్తు చేశారు.
