అంతరించిన అడవి.. మళ్లీ చిగురింపజేశారు

 అంతరించిన అడవి.. మళ్లీ చిగురింపజేశారు

చెట్టు లేకపోతే ఏ జీవీ బతకలేదు. ఇది తెలిసిన జీవి మనిషి ఒక్కడే. తెలిసి ఏం చేస్తున్నాడు? నీడనిచ్చే చెట్టునే నరికేస్తున్నాడు. నేలతల్లికైన గాయానికి పచ్చని లేపనం రాశారు సెబాస్టియో సాల్గడో, అతని భార్య లెలియా డెలూయిజ్ వానిక్ సాల్గడో. 20 ఏళ్లు కష్టపడి 20 మిలియన్లకు పైగా మొక్కలు నాటారు. అంతరించిన అడవిని మళ్లీ చిగురింపజేశారు. 

సెబాస్టియో సాల్గడో బ్రెజిల్లో పేరు పొందిన ఫొటో జర్నలిస్ట్, డాక్యుమెంటరీ ఫొటోగ్రాపర్. ఆ దేశంలో ఫొటో జర్నలిస్టులకు ఇచ్చే ముఖ్యమైన అవార్డులన్నీ గెలుచుకున్నాడు. రువాండాలో 90వ దశకంలో జరిగిన అనాగరికమైన మారణహోమాన్ని డాక్యుమెంట్ చేసేందుకు పోయాడు. అక్కడ కొన్నాళ్లు పనిచేశాక బ్రెజిల్ తిరిగొచ్చాడు. 
పచ్చని ఊళ్లు 
యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం 1990 నుంచి ఇప్పటి వరకు 129 మిలియన్ హెక్టార్ల అడవి అంతరించింది. అలాగే సాల్గడో సొంతూరు ఎమోరేస్ దగ్గరలో ఉన్న అడవి కూడా అంతరించి పోయింది. ఎమోరేస్ టౌన్కి దగ్గరలో ఉన్న రియో డోజ్ వ్యాలీలో ఉన్న పచ్చదనమంతా కనుమరుగైపోయింది. అందమైన జలపాతాలు కూడా మాయమయ్యాయి. అది చూసి సాల్గడో షాక్ అయిండు. మినాస్గెరైజ్ రాష్ర్టంలో ‘గ్రీన్ ప్యారడైజ్’ అని పిలుచుకునే ఈ వ్యాలీ అలా మారడం సాల్గడో జీర్ణించుకోలేకపోయాడు.  ‘ద గార్డియన్’ పత్రిక 2015లో రియో డోజ్ వ్యాలీని జబ్బుపడ్డ నేల అన్నది. ఒకప్పుడు ఏపుగా పెరిగిన చెట్లతో ఉన్న ఆ నేలపై 0.5 శాతం చెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని లెక్కగట్టింది. 
చేయిచేయి కలిపి 
తను పెరిగిన ప్రాంతంలోని మార్పు చూసి చాలా బాధపడ్డాడు సెబాస్టియన్. అది చూసిన ఆయన భార్య ‘‘బాధపడుతూ కూర్చునే కంటే మార్పుని తీసుకురావడానికి ప్రయత్నించడం మంచిది కదా. అడవిని పెంచితే ఇక్కడి నుంచి వెళ్లిపోయిన జీవరాశులు మళ్లీ తిరిగొస్తాయి. ఒకప్పటి అందం మళ్లీ కనిపిస్తుంది” అన్నది. తర్వాత ఇద్దరూ కలిసి ‘ఇన్స్టిటో టెర్రా’ అనే సంస్థను స్టార్ట్ చేశారు. 
మొక్కలు నాటాలని, అడవి కావాలని కోరుకునే తమలాంటి వాళ్లను కూడగట్టారు. నేలను దున్ని వరుసగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఇందులో పాల్గొనమని దగ్గరలో ఉన్న పట్టణాలకు పోయి స్థానికులతో మాట్లాడేవాళ్లు. 20 ఏళ్లలో 170 పట్టణాల్లో ఉండే 65 వేల మందిని ఈ మొక్కలు నాటే కార్యక్రమంలోకి తీసుకొచ్చారు. వాళ్లందరి భాగస్వామ్యంతో ఎన్నో మొక్కలు నాటారు. 
గ్రీన్ ప్యారడైజ్ సృష్టించారు
అలా 20 ఏళ్లలో 2.7 మిలియన్ల మొక్కలు నాటించారు. ఆ ప్రాంతమంతా ఒకప్పటిలా పచ్చగా మారిపోయింది. ఈ ప్రయత్నంలో వాళ్లిద్దరే కాదు 700కు పైగా ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్స్ కోసం వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. అడవి పచ్చబడ్డాక పువ్వులు, కాయలు, చల్లని గాలి, నీరు కూడా ఇస్తోంది. ఎండిపోయిన చెలమల్లోంచి నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఒక్కో చెలమ నుంచి నిమిషానికి 20 లీటర్ల నీరు వస్తోంది. ఆ నీరు కొండవాలుల్లో ప్రవహిస్తూ అడవిని ఇంకా పెంచుతోంది. సెలయేటి ప్రవాహాలు, జలపాతాలతో పర్యాటకులకు కనువిందు చేసే ప్రదేశంగా ఈ వ్యాలీ మారిపోయింది. 

  293  వృక్ష జాతులను కాపాడుకున్నారు.  
  నేలకోతకు గురికావడం ఆగిపోయింది. 
  వానలు పెరిగాయి.  
  172 పక్షి జాతులు అడవికి తిరిగొచ్చాయి.  
  33 జాతుల పాలిచ్చే జంతుజాతులు మళ్లీ వచ్చి ఉంటున్నాయి.  
  15 బల్లి జాతులు మళ్లీ ఈ అడవిలో కనిపించాయి.  
  15 రకాల ఉభయచరాలు (నీళ్లలో, నేలపై నివసించే జీవులు) నీటి ఆవాసాల్లోకి చేరాయి.