రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం సిరిసిల్లలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేంద్రమంత్రి బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ శ్రేణులు సిరిసిల్లలో ధర్నాకు దిగగా.. దానికి కౌంటర్‌గా బీజేపీ శ్రేణులు కూడా బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా రోడ్డుపైకి వచ్చారు.
సిరిసిల్లలోని నేతన్న చౌరస్తా వేదికగా బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీ ధర్నాలకు దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా చేజారిపోయింది. ఇరు పార్టీల కార్యకర్తలు ముఖాముఖిగా నిలబడి పరస్పర నినాదాలతో చౌరస్తాను దద్దరిల్లేలా చేశారు. ఒకవైపు బండి సంజయ్ డౌన్ డౌన్’ అంటూ బీఆర్ఎస్.. మరోవైపు కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున నినాదాలు చేస్తూ ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు కొట్టుకునే స్థాయికి చేరడమే కాకుండా.. ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకుంటూ వీరంగం సృష్టించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరు పార్టీల నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఉభయ పార్టీల నేతలు పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టడంతో.. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది.
ఈ అకస్మాత్తు పొలిటికల్ వార్‌తో సిరిసిల్ల పట్టణంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. వాహనదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రస్తుతం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిరిసిల్ల నేతన్న చౌరస్తా వద్ద భారీగా పోలీస్ బలగాలను మోహరించారు.
