విద్వేషం, హింసకు డెమోక్రసీలో చోటు లేదు

విద్వేషం, హింసకు డెమోక్రసీలో చోటు లేదు

న్యూఢిల్లీ: ఇస్లాంలోని అసలైన సహనం, మితవాద సూత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో.. ప్రగతిశీల ఆలోచనలతో తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ‘ఉలేమా(ముస్లిం పండితుల బృందం)’ ప్రధాన పాత్ర పోషిస్తున్నదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ‘ఇండియా, ఇండోనేసియాలో సర్వమత శాంతి, సామాజిక సామరస్య సంస్కృతిని పెంపొందించడంలో ఉలేమా పాత్ర’ అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు ఇండోనేసియా పొలిటికల్, లీగల్, సెక్యూరిటీ అఫైర్స్ కోఆర్డినేటింగ్ మినిస్టర్ మొహమ్మద్ మహ్ఫూద్ ఆధ్వర్యంలో ఉలేమా బృందం, ఇతర మతాల ప్రతినిధుల బృందం ఢిల్లీకి వచ్చింది. ఇండియన్ ఇస్లామిక్ కల్చరల్ సెంటర్‌‌‌‌లో పలు అంశాలపై ఇండియన్ ప్రతినిధులు, ఇతర రిలీజియన్ల లీడర్లతో ఉలేమా బృందం రోజంతా చర్చలు జరిపింది. ఈ కార్యక్రమంలో అజిత్ దోవల్ ప్రారంభోపన్యాసం ఇచ్చారు. 

‘‘ఎక్స్‌‌ట్రీమిజం, టెర్రరిజం అనేవి.. ఇస్లాం నిజమైన అర్థానికి వ్యతిరేకం. ఎందుకంటే ఇస్లాం అంటే శాంతి, శ్రేయస్సు (సలామతి/అసలాం)’’ అని చెప్పారు. ద్వేషపూరిత ప్రసంగం, దురభిప్రాయాలు, తప్పుడు ప్రచారం, రాక్షసత్వం, హింస, అనిశ్చితి, మతాన్ని దుర్వినియోగం చేయడం.. వంటి వాటికి ప్రజాస్వామ్యంలో చోటులేదని స్పష్టం చేశారు. వేర్పాటువాదం, టెర్రరిజానికి ఇండియా, ఇండోనేసియా బాధితులేనని చెప్పారు. టెర్రర్ సవాళ్లను సమర్థంగానే ఎదుర్కొంటున్నామని, కానీ క్రాస్ బార్డర్ టెర్రరిజం, ఐసిస్ ప్రేరేపిత టెర్రరిజం ముప్పు పోలేదని అన్నారు.