మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇంటర్వ్యూ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇంటర్వ్యూ

విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ఎఫ్ 3. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ  మల్టీ స్టారర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న రానున్న ఎఫ్ 3 సినిమాకు సంబంధించి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పంచుకున్న విశేషాలు.

ఎఫ్ 2 భారీ విజయం సాధించడంతో ఎఫ్ 3 అంటే కచ్చితంగా బాధ్యత పెరుగుతుంది కదా.. మీకు ఎలా అనిపించింది ?
కచ్చితంగా బాధ్యత వుంటుంది. ఐతే ఆ బాధ్యతంతా దర్శకుడు అనిల్ రావిపూడి తీసుకున్నారు. మాకు అనిల్పై చాలా నమ్మకం ఉంది. ఎఫ్ 2 షూటింగ్ సమయంలోనే ఎఫ్ 3చేయాలని నిర్ణయించుకున్నారు. డబ్బు నేపధ్యంలో ఎఫ్ 3 చేస్తానని అప్పటికప్పుడే రెండు మూడు సీన్లు చెప్పారు. అవి హిలేరియస్గా అనిపించాయి. వెంకటేష్, నేను ఎఫ్ 2 థియేటర్ లో చూశాం. ప్రేక్షకులు రెస్పాన్స్ చూసి తప్పకుండా ఎఫ్ 3 చేయాలని నిర్ణయించుకున్నాం. ఎఫ్ 2కి మించిన ట్రిపుల్ ఫన్ డోస్ ఎఫ్ 3లో వుంటుంది. సినిమా అంతా నవ్వుతూనే వుంటారు. ఎఫ్ 3 ఒక నవ్వుల పండగలా వుంటుంది.

ఎఫ్ 3లో నత్తి ఉన్న వ్యక్తి పాత్రలో చేయడం ఎలా అనిపించింది ?
ఫైట్లు, యాక్షన్ చేయడం కష్టం.. డైలాగులు చెప్పడం ఈజీ అనుకునేవాడిని. కానీ కామెడీ చేయడమే కష్టం. ఫన్  డోస్ పెంచడానికి అనిల్ నత్తి క్యారెక్టరైజేషన్ డిజైన్ చేశారు. ఒకరికి రేచీకటి, మరొకరు సరిగ్గా మాట్లాడలేరు. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఒక రాత్రి పూట కలిస్తే ఎలా వుంటుందన్న చిన్న ఐడియాను తీసుకున్నాం. హిలేరియస్గా వర్కౌట్ అయ్యింది.

నత్తి ఉన్న క్యారెక్టర్ కోసం స్పెషల్గా హోం వర్క్ ఏమైనా చేశారా ?
అనిల్ రావిపూడి నటించి చూపించేవారు. ఆయన్ని సరిగ్గా అందుకుంటే యాక్టర్ పని ఈజీ అయిపోతుంది. షూటింగ్ మొదటి రోజు కొంచెం టెన్షన్ పడ్డా. డైరెక్టర్ అనుకున్నది ఇవ్వగలనా లేదా ? అనే ఆలోచన వుండేది. ఫస్ట్ డే షూట్ తర్వాత అనిల్ ఇచ్చిన కాన్ఫిడెన్స్తో ఈజీ అయ్యింది. కానీ మాట అడ్డుపడిన ప్రతిసారి ఒక డిఫరెంట్ మ్యానరిజం చూపాలి. ప్రతిసారి కొత్త మ్యానరిజం చూపడం ఛాలెంజ్లా అనిపించింది. ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.

ఎఫ్  3లో ఫన్ ఎవరికి ఫస్ట్రేషన్ ఎవరికి ?
డబ్బులు త్వరగా సంపాదించేస్తే ఫన్ అనుకుంటారు. దాని వలన వచ్చే ఫస్ట్రేషన్ని హిలేరియస్గా చూపిస్తారు.

వెంకటేష్ గారితో మరోసారి వర్క్ చేయడం ఎలా అనిపించింది ? ఆయన నుండి ఏం నేర్చుకున్నారు ?
వెంకటేష్తో రెండోసారి కలసి పని చేయడం లక్కీగా ఫీలవుతున్నా. వెంకటేష్ అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం. ఒక బ్రదర్, ఫాదర్ ఫిగర్లా ఉంటారు. చిరంజీవితో ఆయనకుండే బాండింగ్, ఆయన అనుభవం ఇలా చాలా  విషయాల గురించి మాట్లాడుకోవచ్చు. అప్పుడప్పుడు రానాకి ఫోన్ చేసి..  మీ బాబాయ్  నీకు చెప్పని విషయాలు నాకు చెప్తుంటారని ఏడిపిస్తుంటాను(నవ్వుతూ). వెంకటేష్ చాలా లైట్ హార్టెడ్ పర్సన్. చాలా కూల్గా, క్రమశిక్షణతో ఉంటారు. ఆయనను చూసే సెట్స్కి రెండు నిమిషాలు ముందే వెళ్ళేవాడిని. అంత పెద్ద స్టారైనా దేన్నీ గ్రాంటెడ్ తీసుకోరు. అది చాలా గ్రేట్ క్యాలిటీ. ఎప్పుడూ నవ్వుతూ, పాజిటివ్గా వుంటారు.

ఎఫ్ 3లో కామెడీతో పాటు మెహరీన్తో రొమాంటిక్ లవ్ ట్రాక్ కూడా ఉందా ? సాంగ్స్లో కలర్ ఫుల్గా కనిపిస్తున్నారు ?
మీరు పాటని సరిగ్గా గమనిస్తే మెహరీన్ కు కొంచెం దూరంలోనే ఉంటాను(నవ్వుతూ). ఈ సినిమాలో లవ్ వుంది. ఐతే అమ్మాయి- అబ్బాయి లవ్ కాదు. డబ్బు మీదుండే లవ్. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ డబ్బుని ప్రేమిస్తారు. తమన్నా, మెహారీన్, సునీల్, అలీ అన్ని పాత్రలు డబ్బునే ఇష్టపడతాయి. ఎఫ్ 2లో నేను వెంకటేష్ కో బ్రోస్గా కనిపించాం. ఇందులో బ్రదర్స్గా కనిపిస్తాం.

ఎఫ్ 3 షూటింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి ?
ఎఫ్ 2షూటింగ్లో కొంతమంది కొత్త వాళ్లు ఉన్నారు. ఎఫ్ 3కి వచ్చేసరికి అంతా ఒక ఫ్యామిలీలా ఉంది. అన్నపూర్ణమ్మ, వై. విజయ మా కోసం అప్పుడప్పుడు భోజనాలు తెచ్చేవాళ్ళు. అందరం బోలెడు కబుర్లు చెప్పుకునే వాళ్ళం. షూటింగ్ ప్రతి రోజు పండగలా వుండేది.

ఎఫ్ 3 బడ్జెట్, రెమ్యునరేషన్ కూడా పెరిగింది. మీ వాటా ఎంత పెరిగింది ?
సినిమా హిట్ కొడితే సాధారణం గానే రెమ్యునరేషన్ పెరుగుతుంది కదా. ఇందులో చెప్పడానికి ఏముంది(నవ్వుతూ)

ఎఫ్ 3లో మీరు చాలా కొత్తగా కనిపిస్తారని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్తున్నారు ? ఏమిటా కొత్తదనం ?
ఎఫ్ 3 నాకు కంప్లీట్ డిఫరెంట్ జోనర్. ఎఫ్ 2లో తెలంగాణ కుర్రాడిగా చేశా. ఎఫ్ 3కి వచ్చేసరికి స్పెషల్గా పాత్రని డిజైన్ చేశారు. నటనకి ఆస్కారం వుండేపాత్ర. కంటెంట్ కూడా చాలా బలంగా వుంటుంది.

ఎఫ్2 కథకి కొనసాగింపుగా ఎఫ్ 3 వుంటుందా ?
లేదు. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ లో ఎలాగైతే పాత్రలు తీసుకొని కొత్త కథలు చెప్పారో ఎఫ్ 3లో కూడా కేవలం పాత్రలు మాత్రమే తీసుకొని కొత్తకథని చెప్పాం.

ఎఫ్ 3లో నలుగురు హీరోయిన్స్తో పని చేశారు.. ఒకొక్కరి గురించి మీ అభిప్రాయం ఏమిటి ?
మెహరీన్, తమన్నాతో ముందే పని చేశాం. ఇందులో మెహరీన్, తమన్నా కోసం డిఫరెంట్ పాత్రలు డిజైన్ చేశారు. అలాగే పూజా హెగ్డేతో రెండు సినిమాలు చేశా. పూజా ఇందులో స్పెషల్ సాంగ్ చేస్తుంది. సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది.

టికెట్ రేట్లు తగ్గించడం వలన అడ్వాంటేజ్ వుంటుందని భావిస్తున్నారా ?
ఎఫ్ 3 ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా. ఒక వ్యక్తి తన ఫ్యామిలీ మొత్తాన్ని సినిమా తీసుకువెళ్ళాలంటే పెరిగిన ధరలు భారం కావచ్చు. అందుకే అందరికీ అందుబాటులో వుండే విధంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్ రేట్లు ఉండేలా మా నిర్మాత దిల్ రాజు నిర్ణయం తీసుకున్నారు. కచ్చితంగా ఫ్యామిలీ అంతా కలసి ఎఫ్ 3ని థియేటర్ లో ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా.

యాక్షన్, రొమాన్స్, కామెడీ.. ఇలా చాలా జోనర్ సినిమాలు చేశారు కదా.. అందులో మీకు ఏది తృప్తినిచ్చింది ?
అన్ని సినిమాలు, పాత్రలు తృప్తినిస్తాయి. ఫిదా, తొలిప్రేమ, అంతరిక్షం, ఎఫ్ 2 ఇలా ఏ సినిమా చేసినా వంద శాతం ఎఫర్ట్ పెడతా. నాది అనుకునే పని చేస్తా. ప్రతి సినిమా నచ్చే చేస్తాం కదా.

ప్రస్తుతం అందరు హీరోలు పాన్ ఇండియా అంటున్నారు. కథల సెలెక్షన్ ప్రాసెస్ కూడా మారింది. ఇది ఛాలెజింగ్గా అనిపిస్తుందా ?
ప్రస్తుతం కథల ఎంపిక మారింది. ఇది పాన్ ఇండియా సినిమా వల్ల కాదని భావిస్తున్నా. ఓటీటీ లో డిఫరెంట్ కంటెంట్ పెరిగింది. ప్రేక్షకులు ఇంకా డిఫరెంట్ కంటెంట్ కోరుకుంటున్నారు. వారికి కావాల్సిన కంటెంట్ ఇవ్వడం కూడా చాలెజింగ్ గా మారింది. ఇది ఒక రకంగా మంచిదే. కొత్తకథలు బయటికి వస్తాయి.

ఎఫ్ 3 ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ నుండి వచ్చిన రియాక్షన్స్ ఏమిటి ?
ఫస్ట్ నాన్నకి ట్రైలర్ పంపించా. తర్వాత తేజుతో పాటు మా కజిన్స్ అందరితో కలసి చూశా. అందరూ గట్టిగా నవ్వుకున్నారు. ఆ పాత్రలో నన్ను చూసి షాక్ కూడ అయ్యారు. ''ఏంటి ఇలా పిచ్చోడిలా చేస్తున్నావ్'' అని సర్ ప్రైజ్ అయ్యారు. నిజానికి నేను ఇంట్లో చాలా  రిజర్వ్డ్ గా ఉంటా. నన్ను నత్తి మ్యానరిజంలో చూసి షాక్ అయ్యారు. చరణ్ ఫోన్ చేసి చాలా బాగా చేశావ్ అని మెచ్చుకున్నారు. 

పర్సనల్గా మీకు ఏ జోనర్ ఇష్టం ?
అన్ని జోనర్స్ చేయాలని వుంటుంది. యాక్షన్ సినిమాలు చూడటం ఇష్టం. 

దిల్ రాజుతో పని చేయడం ఎలా అనిపించింది?
దిల్ రాజు సినిమా అంటే నాకు హోమ్ బ్యానర్ లాంటింది. ఆయన ఫ్యామిలీలో ఒకరిగా వుంటారు. సినిమా అంటే ఆయనకి ప్యాషన్. ఎన్ని సినిమాలు చేస్తున్నా ప్రతి సెట్కి వెళ్తారు. సినిమాని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. చాలా ఫ్రెండ్లీగా వుంటారు. ఎఫ్ 3 సెట్స్లో ఎక్కువగా శిరీష్ వుండేవారు. ఆయన కూడా వండర్ ఫుల్ పర్సన్. ఎలాంటి సమస్య వచ్చిన క్షణాల్లో పరిష్కరిస్తారు. వారి బ్యానర్ లో చేయడం గొప్ప అనుభవం.

సునీల్ గారి కాంబినేషన్ గురించి చెప్పండి ?
కాలేజీలో వున్నపుడు సునీల్ గారికి ఫ్యాన్. ఆయన సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన హీరో అయిన తర్వాత  టైమింగ్ని సరిగ్గా వాడుకోలేదమో అనిపించింది. అనిల్ రావిపూడి ఎఫ్ 3లో మళ్ళీ వింటేజ్ సునీల్ని చూపించబోతున్నారు. సునీల్ తో పని చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆయన టైమింగ్ అద్భుతం. ఎఫ్ 3లో మా కాంబినేషన్ హిలేరియస్గా వుంటుంది.

ఎఫ్ 3లో కిడ్స్ గురించి స్పెషల్ ట్రాక్ ఉందని విన్నాం ?
అవును. ఎఫ్ 3ని పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ జనరేషన్ కిడ్స్కు ఎలాంటి సమస్య వుందనే అంశంపై స్పెషల్ ట్రాక్ డిజైన్ చేశారు. 
 
పూజా హెగ్డేతో చేసిన స్పెషల్ సాంగ్ గురించి చెప్పండి ?
చాలా మంచి పాట అది. కానీ నాకు డ్యాన్స్ చేయడం ఎప్పుడూ టెన్షనే. వెంకటేష్కు కూడా అదే టెన్షన్. రాజసుందరం మాస్టర్ కొరియోగ్రఫీ చాలా ఎంజాయ్ చేశాం.

ఇప్పటి వరకు మీరు చేసిన చిత్రాలలో నచ్చిన పాత్ర ?
కంచె సినిమాలో చేసిన పాత్ర మోస్ట్ మెమొరబుల్. తొలిప్రేమ, గద్దలకొండ గణేష్ పాత్రలు కూడా ఇష్టం.

ఎఫ్ 4  వుంటుందని దిల్ రాజు, అనిల్ రావిపూడి చెప్పారు. మీరు కథ విన్నారా ?
మూడు పాయింట్లు చెప్పారు. మూడూ హిలేరియస్ గా వున్నాయి. ప్రస్తుతం మా దృష్టి ఎఫ్ 3పైనే వుంది.

ప్రవీణ్ సత్తారు గారితో సినిమా ఎప్పుడు సినిమా ?
ఆగస్ట్ మొదటి వారంలో షూటింగ్ మొదలవుతుంది. పూర్తి యాక్షన్ సినిమా. లండన్ లో 70రోజులు షూటింగ్ ఉంటుంది. నాన్నగారు, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

డబ్బు గురించి ఫస్ట్రేషన్ అయిన సందర్భాలు ఉన్నాయా ?
చదువుకున్న రోజుల్లో వుండేది. సినిమాకి వెళ్తా అంటే నాన్న రూ.50 ఇచ్చేవారు. అది దేనికీ సరిపోయేది కాదు. (నవ్వుతూ) లక్కీగా మంచి ఫ్రెండ్స్ వుండటం వల్ల సర్దుకునేవాళ్ళం.

డబ్బుపై మీ ఆలోచన ?
కొంతమందిని చూస్తే డబ్బు ఇంత ఈజీగా వస్తుందా ? అనిపిస్తుంది. కానీ ఈజీగా వచ్చిన డబ్బు అంతే ఈజీగా పోతుంది. ఎఫ్ 3లో కూడా ఇదే చెప్పాం. డబ్బు పట్ల జాగ్రత్తగా వుండాలి.

లబ్ డబ్ సాంగ్లో చాలా గెటప్స్లో కనిపించారు ? వాటిని ఎంజాయ్ చేశారా ?
సినిమాలో చాలా గెటప్స్ వేయించారు. పోలీసు, పూజారి, రిచ్ మ్యాన్, పూర్ మ్యాన్ ఇలా చాలా వేశాం. అన్నీ చాలా సరదాగా వచ్చాయి.

మెగా ఫ్యామిలీతో మెగా మల్టీ స్టారర్ ఎప్పుడు ?
మాకు చేయాలనే వుంటుంది. అయితే అది మా చేతుల్లో లేదు. సరైన స్క్రిప్ట్ కుదరాలి కదా.

'మెగా ఫ్యామిలీ' ట్రైలర్  డైలాగ్ కి మెగాఫ్యాన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ?
పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమాలో అందరి హీరోలు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యే బ్లాక్ ని డిజైన్ చేశారు అనిల్ రావిపూడి. ఫ్యాన్స్ అంతా దాన్ని ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా.

సాయి ధరమ్ తేజ్ ఎలా వున్నారు ?
చాలా బావున్నాడు. మేము ఇద్దరం కలసి జిమ్ వెళ్తున్నాం.  నెల క్రితమే షూటింగ్ కూడా మొదలుపెట్టాడు.