క్యాన్సర్ నివారణకు నిమ్మకాయ.. ఇది నిజమేనా

క్యాన్సర్ నివారణకు నిమ్మకాయ.. ఇది నిజమేనా

కరోనా తర్వాత ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నాయి. ఇది కొన్ని సార్లు మంచి, మరికొన్ని సార్లు చెడు పరిణామాలకు దారి తీస్తోంది. వాట్సాప్ లోనూ ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు ఇప్పటికీ బాగానే ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఈ వార్త ప్రకారం చక్కెర వినియోగాన్ని ఆపడం, గోరువెచ్చని నిమ్మ నీరు, సేంద్రీయ కొబ్బరి నూనె తాగడం వల్ల క్యాన్సర్‌ను నయం చేయవచ్చని డా. గుప్తా పేర్కొన్నారు. ఈ వైరల్ పోస్టుపై ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఇటీవలే విచారణ చేపట్టింది. దీంతో ఈ విషయంలో అసలు నిజానిజాలు ఏంటన్నది బట్టబయలయ్యాయి.

మస్త్ ఇండియా అనే ఓ యూజర్ ఫేస్‌బుక్‌లో ఈ వైరల్ పోస్ట్‌ను పంచుకున్నారు. అందులో సీనియర్‌గా డాక్టర్ గా కనిపించే ఓ వ్యక్తి యూనిఫాంలో ఉండి పలు సూచనలు చేశారు. డాక్టర్ గుప్తా మాట్లాడుతూ నిర్లక్ష్యానికి అతీతంగా క్యాన్సర్‌తో ఎవరూ చనిపోకూడదన్నారు.

  •     క్యాన్సర్ ను నివారించేందుకు చక్కెర తీసుకోవడం మానేయడమనేది ఫస్ట్ స్టెప్. దీని వల్ల శరీరంలో క్యాన్సర్ కణాలు సహజంగానే చనిపోతాయి.
  •     ఒక కప్పు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసి 1-3 నెలల పాటు ఉదయం భోజనానికి ముందు తాగితే క్యాన్సర్ పోతుంది. మేరీల్యాండ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం, కీమోథెరపీ కంటే వేడి నిమ్మ నీరు 1వెయ్యి రెట్లు మెరుగైనది, బలమైనది, సురక్షితమైనది.
  •     ఉదయం, రాత్రి 3 టేబుల్ స్పూన్ల ఆర్గానిక్ కొబ్బరి నూనె తాగితే క్యాన్సర్ పోతుంది.  

ఈ విషయాన్ని తాను 5 సంవత్సరాల నుంచి చెబుతున్నానని, ఎవరూ క్యాన్సర్ తో చనిపోకూడదని డా. గుప్తా ఈ వీడియోలో చెప్పారు. జీవితాలను రక్షించడానికి ఈ వీడియోను షేర్ చేయండన్నారు.

ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఏం చెప్తుందంటే...

ఈ వీడియో గురించిన సమాచారం కోసం  Googleలో  రివర్స్-సెర్చ్ చేయగా ఈ వ్యక్తి యొక్క అసలు ఫోటో Facebookలో జూన్ 9, 2019న Aconteceu em Bertioga అనే యూజర్ షేర్ చేసినట్టు తేలింది. కానీ ఈ పోస్ట్‌ డాక్టర్ గుప్తాగా చెప్పుకున్న వ్యక్తి పూర్తి పేరు మాత్రం ఎక్కడా చెప్పలేదు. ఈ పోస్ట్‌లోనూ గుప్తా చెప్పిన విషయాలే ఉన్నట్టు ఫ్యాక్ట్ చెక్ తేల్చింది. ఆ తర్వాత గుప్తా చెప్పిన విషయాల గురించి కూడా క్లారిటీ ఇచ్చింది. అందులో మొదటి ఫ్యాక్ట్ విషయానికొస్తే..
 
చక్కెర తీసుకోవడం ఆపడం వల్ల క్యాన్సర్ కణాలు చనిపోతాయన్న వాదనను ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. యూకే క్యాన్సర్ రీసెర్చ్ ప్రకారం షుగర్-ఫ్రీ డైట్‌ని అనుసరించడం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని, ఆ అవకాశాలను పెంచుతుందని కూడా ఎటువంటి ఆధారాలు లేవని తేల్చింది. ఆ తర్వాత చెప్పిన 'హాట్ లెమన్ వాటర్ కీమోథెరపీ కంటే 1వెయ్యి రెట్లు ఉత్తమం' అనే మాటపై కూడా ఫ్యాక్ట్ చెక్ విచారణ చేపట్టింది. నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ రీసెర్చ్ ప్రకారం ఈ తరహా వాదనలన్నీ అబద్దం అని తేలింది. కీమోథెరపీతో నిమ్మను పోల్చే అధ్యయనాలు ఏవీ లేవని కూడా స్పష్టం చేసింది.

ఆ తర్వాత 'సేంద్రీయ కొబ్బరి నూనె క్యాన్సర్‌కు కారణమవుతుంది' అన్న విషయానికొస్తే.. US ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం.. శాస్త్రవేత్తలు వివిధ రకాల కొబ్బరి నూనెలతో కొన్ని క్యాన్సర్ కణాలపై పరీక్షలు నిర్వహించారు. ఈ పరిశోధనలో వర్జిన్ కోకోనట్ ఆయిల్ (VCO), స్వచ్ఛమైన కొబ్బరి నూనె (PCO), ఫ్రాక్షనేటెడ్ కొబ్బరి నూనె (FCO) క్యాన్సర్ నిరోధక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని, క్యాన్సర్ చికిత్సకు, ముఖ్యంగా కాలేయం, నోటి క్యాన్సర్‌కు చికిత్స చేయడానికి ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాబట్టి ఈ వాదన కూడా తప్పేనని ఫ్యాక్ట్ చెక్ చెప్పుకొచ్చింది. దాంతో పాటు ఆరోగ్యానికి సంబంధించి వైరల్ అయ్యే ఇలాంటి వార్తలను ఎలాంటి ఆధారాలు లేకుండా పాటించరాదని సూచించింది.